గుజరాత్‌లో కోటీశ్వరుల గ్రామం

  • షకీల్ అఖ్తర్
  • బీబీసీ ప్రతినిధి
గుజరాత్‌, కోటీశ్వరుల గ్రామం
ఫొటో క్యాప్షన్,

గుజరాత్‌లో కోటీశ్వరుల గ్రామం

సాధారణంగా దక్షిణాసియాలోని గ్రామాల్లో ఎలా పడితే అలా కట్టేసిన ఇళ్లు, గతుకుల రోడ్లు, వెనుకబాటుతనంతో కనిపిస్తాయి. కానీ గుజరాత్ రాష్ట్రంలో మాత్రం డజన్ల కొద్దీ 'కోటీశ్వరుల గ్రామాలు' ఉన్నాయి.

ఈ గ్రామాలు చాలా నగరాల కంటే మెరుగ్గా ఉంటాయి. ఇక్కడి ప్రజలు చాలా సంతోషంతో, ఐశ్వర్యంతో కనిపిస్తారు. ఈ 'గ్రామీణులు' బ్యాంకుల్లో కోట్ల రూపాయలు దాచుకున్నారని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

కచ్ ప్రాంతంలోని బల్దియా గ్రామాన్ని గుజరాత్‌లోకెల్లా అత్యంత సంపన్న గ్రామంగా చెప్పొచ్చు. ఈ గ్రామంలో విశాలమైన రోడ్లు, విశాలంగా, అందంగా ఉన్న ఇళ్లు గ్రామంలోని సంపదను గురించి సూచనప్రాయంగా వెల్లడిస్తాయి.

బల్దియా సౌందర్యాన్ని, సంపదను చూస్తే ఇదేదో యూరోపియన్ గ్రామం అని పొరబడే అవకాశముంది.

విదేశాల్లోనూ సంపద

స్థానిక జర్నలిస్ట్ గోవింద్ కరాయి, ''ఇక్కడ ఉన్న ఎనిమిది బ్యాంకులలో గత రెండేళ్లలో 1500కోట్ల రూపాయలు జమ చేశారు. అలాగే పోస్టాఫీసుల్లో 500 కోట్లకు పైగా జమ చేశారు'' అని వివరించారు.

గ్రామంలో చాలా ఇళ్లకు తాళాలు కనిపిస్తాయి. గ్రామానికి చెందిన అనేక మంది విదేశాల్లో ఉన్నారని దేవ్ జీ విజోడియా అనే గ్రామస్తుడు తెలిపారు.

''నేను కెన్యాలో ఉంటాను. నా ఎదురుగా కూర్చున్న ఇద్దరు బ్రిటన్‌లో ఉంటారు. మాకూ అక్కడా ఇళ్లున్నాయి, ఇక్కడా ఉన్నాయి. ఏడాదిలో రెండు మూడు నెలలు మేం ఇక్కడికి వచ్చి ఉంటాం. మా పిల్లలు మాత్రం విదేశాల్లోనే ఉంటారు'' అని వివరించారు.

గ్రామంలో 9 బ్యాంకుల శాఖలు

భుజ్ నగరానికి దగ్గర్లో ఇలాంటి 'కోటీశ్వరుల గ్రామాలు' చాలానే ఉన్నాయి. బల్దియా గ్రామానికి దగ్గర్లోనే మాధాపూర్ కూడా అలాంటి ధనవంతులున్న గ్రామం. ఈ గ్రామంలో తొమ్మిది బ్యాంకుల శాఖలు, డజన్ల కొద్దీ ఏటీఎంలున్నాయి.

ఖేమ్ జీ యాదవ్ అనే స్థానిక రైతు, గ్రామంలో చాలా మంది కోటీశ్వరులు ఉన్నారని తెలిపారు.

''గ్రామంలో అందరూ ధనవంతులు, కోటీశ్వరులు. ఇక్కడి వాళ్లు బయటి దేశాల్లో సంపాదించి, ఆ సంపదను ఇక్కడకు తీసుకువస్తారు.''

గ్రామంలో చాలా మంది పటేల్ వర్గానికి చెందినవారు. బల్దియా గ్రామానికి చెంది జాదవ్ జీ గరేసియాకు సొంతంగా ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఉంది. గతంలో వీళ్ల పూర్వీకులు వ్యవసాయం చేసేవారు. కానీ ఇవాళ ఈ గ్రామానికి చెందిన ప్రజలు అనేక దేశాలకు విస్తరించారు.

''ఈ గ్రామ ప్రజలు చాలా మంది ఆఫ్రికా, మరీ ముఖ్యంగా నైరోబీలో ఉంటున్నారు. కొంతమంది బ్రిటన్‌లో కూడా ఉంటున్నారు. చాలా మంది సీషెల్స్‌లో కూడా ఉన్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియాకూ వెళుతున్నారు'' అని వివరించారు.

యువత తక్కువ.. వయసు మళ్లిన వాళ్లే ఎక్కువ

ఇక్కడి ప్రజలు చాలా ఏళ్ల పాటు విదేశాలలో కష్టపడి పని చేసి డబ్బు సంపాదించుకున్నారు. విదేశాలకు వెళ్లాక కూడా వాళ్లు తమ గ్రామంతో సంబంధాలు కొనసాగిస్తారని మాధాపూర్ గ్రామ పెద్ద ప్రమీలా బెన్ అర్జున్ పుడియా తెలిపారు.

''ఇక్కడి జనం తమ కుటుంబాలతో సహా విదేశాలకు వెళ్లిపోతారు. అక్కడ డబ్బు సంపాదించాక, చివరికి మళ్లీ ఇక్కడికే తిరిగి వచ్చేస్తారు'' అని వివరించారు.

ఇక్కడి గ్రామాల్లో యువత తక్కువగా కనిపిస్తారు. పెద్ద వయసు వాళ్లే ఎక్కువ.

ప్రియాంక అనే యువతి గ్రామంలోని చాలా మంది యువతీయువకులు విదేశాల్లో ఉంటున్నారని తెలిపారు.

''అమ్మానాన్నలు ఇక్కడికే తిరిగి వచ్చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కూడా అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. ఇక్కడ కూడా బాగా డబ్బుంది. అందుకే కొంతమంది యువత ఇక్కడే ఉంటూ పనులు చేసుకుంటున్నారు'' అని ఆమె వివరించారు.

సుమారు వందేళ్ల క్రితం ఇక్కడి ప్రజలు మరింత మెరుగైన జీవితాన్ని అన్వేషిస్తూ విదేశాలకు వెళ్లారు. అక్కడి నుంచి మరిన్ని మెరుగైన ఆలోచనలు, మరింత సంపదతో ఇక్కడికి తిరిగి వచ్చి, వాటిని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు.

ఈ సంపద కేవలం ఇక్కడి గ్రామాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇక్కడికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న భుజ్ నగరం భారతదేశంలోని అత్యంత సంపన్న నగరాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)