రోహిత్ లాంగ్ ఇన్నింగ్స్ రహస్యమేంటి?

  • 17 డిసెంబర్ 2017
రోహిత్ శర్మ Image copyright NOAH SEELAM/AFP/Getty Images

భారత్, శ్రీలంక మధ్య విశాఖ వేదికగా జరిగే వన్డే తుదిపోరు గురించి అంతా ఉత్కంఠగా చూస్తున్నారు.

ధర్మశాలలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసిన రోహిత్ సేన.. తర్వాత మొహాలీ వన్డేలో ప్రభంజనం సృష్టించింది. దాంతో ఇరు జట్ల విజయాలు సమమయ్యాయి.

అందుకే, ఇప్పుడు చివరి మ్యాచ్‌పై ఆసక్తి పెరిగింది.

2015 లో దక్షిణాప్రికాలో జరిగిన వన్డే సిరీస్‌లో పరాజయం పొందిన భారత్, ఆ తర్వాత ఒక్క సిరీస్‌నూ చేజార్చుకోలేదు.

అయితే, ధర్మశాలలో ఘన విజయాన్ని అందుకున్న శ్రీలంక, విశాఖ వన్డేపై భారీ ఆశలే పెట్టుకుందని చెప్పొచ్చు.

రెండో వన్డేలో లంకను మట్టికరిపించడంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మది కీలక పాత్ర. వన్డే కెరీర్‌లో మూడో డబుల్ సెంచరీ సాధించి అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్నాడు.

అందుకే, ఇప్పుడు విశాఖ మ్యాచ్‌లో అందరి చూపూ అతడి వైపే ఉంది.

Image copyright Getty Images

అసలు రో'హిట్రహస్యమేంటి?

ఒకప్పుడు సునీల్ గవాస్కర్.. ఆయన తర్వాత సచిన్ తెందుల్కర్.. విరాట్ కోహ్లీ.. అలాగే టీమిండియాకు దొరికిన మరో స్టార్ రోహిత్.

గవాస్కర్ కాలంలో గుండప్ప విశ్వనాథ్ ఫ్లిక్ షాట్‌లకు పెట్టింది పేరు. విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా సెహ్వాగ్ పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు వన్డేల్లో రోహిత్ కూడా లాంగ్ ఇన్నింగ్స్‌లో సత్తా చాటుతున్నాడు.

అంతర్జాతీయ వన్డేలలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) చేసిన రికార్డు రోహిత్ శర్మ పేరిటే ఉంది. 2014లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ ఈ రికార్డు నమోదు చేశాడు.

అంతకు ముందు 2013 నవంబర్ 2న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 209 పరుగులు చేశాడు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సునీల్ గవాస్కర్

రోహిత్ కాకుండా వన్డేల్లో ద్విశతకాలు సాధించిన భారత ఆటగాళ్లు సచిన్ తెందుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్.

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ నమోదైంది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ పేరిటే. 2010 ఫిబ్రవరి 24న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ సరిగ్గా 200 పరుగులు చేశాడు.

ఆ తర్వాత 2011లో వెస్టిండీస్‌తో జరిగిన పోరులో వీరేంద్ర సెహ్వాగ్ 219 పరుగుల చేసి ఔరా! అనిపించాడు.

Image copyright NOAH SEELAM/AFP/Getty Images

'నాకంత పవర్ లేదు'

ఇంత లాంగ్ ఇన్నింగ్స్‌ ఎలా ఆడగలుగుతున్నారు? ఈ క్రికెటర్ల ఆట వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అన్నది చాలా మంది మెదళ్లను తొలిచే ప్రశ్న.

తాజాగా మొహాలీ వేదికగా మూడో ద్విశతకం సాధించిన సందర్భంగా రోహిత్ ఇలా సమాధానం చెప్పాడు.

"ప్రారంభంలో పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. అందువల్ల నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకోవాలనుకున్నా. నేను ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, మహేంద్ర సింగ్ ధోనీ లాంటి వాడినేమీ కాదు. నాకు అంత పవర్ లేదు."

Image copyright Getty Images

"ఫీల్డ్‌లో పరిస్థితులకు అనుగుణంగా వ్యూహం అనుసరించేందుకు కొంచెం బుర్ర ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆట కోసం నా శక్తి మేరకు ప్రయత్నిస్తుంటాను" అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ 153 బంతుల్లో 208 పరుగులు చేశాడు.

వరుసగా సిక్సర్లు బాదుతూ 40 ఓవర్ల తర్వాత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌లోనే 13 ఫోర్లు, 12 సిక్సులు కొట్టాడు.

Image copyright Getty Images

ఫోర్లు, సిక్సులు అలా బాదడం సులువైన పనేమీ కాదని అన్నారు రోహిత్.

"సిక్సులు కొట్టడం అంత సులువేమీ కాదు. ఎంతో ప్రాక్టీస్, హార్డ్ వర్క్ చేస్తేనే అది సాధ్యమవుతుంది. క్రికెట్‌లో ఏదీ సులువు కాదు. టీవీలో చూస్తుంటే అది సులువుగానే కనిపించొచ్చు!"

40వ ఓవర్‌లో రోహిత్ శతకం పూర్తి చేశాడు. 50వ ఓవర్‌లో డబుల్ శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

అందులో మొదటి సెంచరీ 115 బంతుల్లో పూర్తి చేయగా.. రెండో శతకాన్ని కేవలం 36 బంతుల్లోనే సాధించాడు. ఈ నంబర్లతో రోహిత్‌ లాంగ్ ఇన్నింగ్స్ రహస్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

Image copyright AFP

వంద దాటితే ఆగడు!

రోహిత్ తన పదేళ్ల కెరీర్‌లో 16 శతకాలు సాధించాడు. అందులో మూడింటిని 200 మార్కును దాటించాడు.

ఈ డబుల్ సెంచరీలే కాకుండా, గతంలో 171, 150, 147 పరుగులు కూడా చేశాడు. దీన్ని బట్టి చూస్తే 100 పరుగుల మార్కును చేరుకున్న తర్వాత, రోహిత్ అంత సులువుగా క్రీజు నుంచి బయటకొచ్చే రకం కాదని అర్థం చేసుకోవచ్చు.

పరుగుల వేగంలో సచిన్, కోహ్లీ, ధోనీల బాటలోనే రోహిత్ వెళ్తున్నాడని చెప్పుకోవచ్చు.

ఏ బంతిని షాట్ కొట్టాలి? ఏ వైపున బౌండరీ దాటించాలి? అని ఆలోచించడంలో రోహిత్ దిట్ట. అసాధ్యమనుకునే షాట్‌తోనూ సులువుగా సిక్స్‌లు ఖాతాలో వేసుకుంటాడు.

Image copyright Getty Images

విశాఖలో సత్తా చాటుతాడా?

విశాఖ మైదానం భారత జట్టుకు అనుకూలమైనది అన్న భావన ఉంది. ఎందుకుంటే, ఇక్కడ ఏడు మ్యాచ్‌లలో భారత్ కేవలం ఒక్క సారే ఓడిపోయింది.

మరోవైపు, "వైజాగ్ వాతావరణ పరిస్థితులు, శ్రీలంకను పోలి ఉంటాయి. అది మాకు అనుకూలించే విషయం" అని లంకేయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

భారత్‌లో తొలిసారిగా సిరీన్‌ను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు.

మరి సొంత గడ్డపై టీమిండియా తన పట్టును నిలుపుకుంటుందా? లేదా సిరీస్‌ను శ్రీలంక ఎగరేసుకుపోతుందా? అన్న తీవ్ర ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

LIVE: ‘దిల్లీ హింసపై మాట్లాడను.. భారత్‌లో ప్రజలకు మత స్వేచ్ఛ ఉండాలని మోదీ కోరుకుంటున్నారు’ - డోనల్డ్ ట్రంప్

కరోనావైరస్ - ‘మహమ్మారిగా మారకముందే ఎదుర్కోండి’ - ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

దిల్లీ హింస: సీఏఏ వ్యతిరేక హింసాత్మక ఘర్షణల్లో 10కి చేరిన మృతుల సంఖ్య

BBC Indian Sportswoman of the Year 2019: విజేత ఎవరో మార్చి 8న ప్రకటిస్తాం

దిల్లీ హింస: ముస్లింలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో హింసకు కారకులెవరు.. ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారు

డయానా నుంచి ట్రంప్ వరకు: తాజ్‌‌మహల్‌ను సందర్శించిన విదేశీ ప్రముఖుల ఫొటోలు

దిల్లీ హింస: సీఏఏ అనుకూల, వ్యతిరేక నిరసనలతో రాత్రంతా భయం గుప్పిట్లో...

హార్వే వైన్‌స్టీన్‌: అత్యాచార కేసులో దోషిగా తేల్చిన న్యూయార్క్ కోర్టు