గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధానాంశాలివీ...

  • 18 డిసెంబర్ 2017
ప్రధాని మోదీ Image copyright Getty Images

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక ప్రతిపక్షాలు బీజేపీ, కాంగ్రెస్ పరస్పర ఆరోపణలు, విమర్శలతో తీవ్రస్థాయిలో ప్రచారం సాగించాయి. ప్రచారంలో ప్రధానాంశాలు ఏమిటంటే...

నోట్ల రద్దు, జీఎస్‌టీ

పెద్ద నోట్ల రద్దు, వస్తు-సేవల పన్ను(జీఎస్‌టీ) అమలు తీరును ప్రస్తావిస్తూ, భాజపాపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.

నోట్ల రద్దు విమర్శలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ- ఈ నిర్ణయంతో సామాన్యుడిపై ప్రభావం పడలేదన్నారు. ఈ చర్య కాంగ్రెస్‌ను తీవ్రంగా ప్రభావితం చేసిందని, అందుకే దీనిని పదే పదే తప్పుబడుతోందని విమర్శించారు.

గుజరాత్‌లో చిన్న, మధ్యతరహా వ్యాపారులు పెద్ద సంఖ్యలో ఉంటారు. సాధారణంగా వీరు బీజేపీకి ప్రధాన మద్దతుదారులు. జీఎస్‌టీ అమలు తీరు వీరిపై తీవ్ర ప్రభావం చూపందని కాంగ్రెస్ పేర్కొంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక గుజరాత్ ఎన్నికల ప్రచారంలో అభిమానులకు అభివాదం చేస్తున్న రాహుల్

నిరుద్యోగిత

గుజరాత్ జనాభాలో సగం మందికి పైగా 40 ఏళ్లలోపు వారే. ఉద్యోగాలు కల్పించాలంటూ గత మూడేళ్లలో పలుమార్లు యువతీయువకులు ఆందోళనలు నిర్వహించారు.

గుజరాత్‌లో ఉద్యోగాల సృష్టి జరగడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించగా, భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ (రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గం) నుంచి కూడా ప్రజలు ఉపాధి కోసం గుజరాత్ వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

గుజరాత్ అభివృద్ధిపై భాజపా ప్రచారాన్ని ఎదుర్కొనే క్రమంలో, రాష్ట్రంలో అభివృద్ధి డొల్లేనని కాంగ్రెస్ ఆరోపించింది.

భాజపా అభివృద్ధి ప్రచారాన్నిఎద్దేవా చేస్తూ, 'క్రేజీ వికాస్' అంటూ గుజరాతీ హ్యాష్‌ట్యాగ్ 'vikas gando thayo chhe'తో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది.

పోలింగ్ తేదీలు సమీపించే కొద్దీ అభివృద్ధి అంశం వెనక్కు వెళ్లిపోయింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక హార్దిక్ ప‌టేల్

పాటీదార్ రిజర్వేషన్

గుజరాత్ జనాభాలో సుమారు 14 శాతం మంది పాటీదార్లు(పటేళ్లు). ఉద్యోగాలు, విద్యలో పాటీదార్లకు రిజర్వేషన్ కల్పించాలంటూ హార్దిక్ పటేల్ నాయకత్వంలో రెండేళ్లుగా ఆందోళనలు జరుగుతున్నాయి.

తాము అధికారంలోకి వస్తే పాటీదార్లకు రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

ఈ హామీని అమలు చేయడం ఎలా సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ది బూటకపు హామీ అని ఆరోపించారు.

Image copyright Bipin Tankariya
చిత్రం శీర్షిక రాజ్‌కోట్‌లో హార్దిక్ పటేల్ సభకు హాజరైన జనం

పాకిస్తాన్‌పై ఆరోపణలు

తనను అడ్డు తొలగించుకొనేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్‌లో 'సుపారీ' ఇచ్చారంటూ మోదీ తీవ్ర ఆరోపణ చేశారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కై గుజరాత్ ఎన్నికల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకుంటోందని మరో సందర్భంలో ఆరోపించారు.

ఈ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. ఎన్నికల్లో తమ జోక్యం లేదని పాకిస్తాన్ స్పష్టంచేసింది.

'నీచుడు(నీచ్ ఆద్మీ)' అంటూ మోదీని ఉద్దేశించి మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలూ తీవ్రస్థాయిలో దుమారం రేపాయి. ఇది పార్టీ నుంచి ఆయన సస్పెన్షన్‌కు దారితీసింది.

Image copyright AFP/Getty Images
చిత్రం శీర్షిక మణిశంకర్ అయ్యర్

రాహుల్ మతంపై చర్చ

సోమ్‌నాథ్ ఆలయ సందర్శన అనంతరం రాహుల్ మతమేదనే దానిపై చర్చ మొదలైంది.

ఆలయం వద్ద ఉన్న ఒక రిజిస్టర్‌లో రాహుల్‌ తాను హిందువేతరుడనని పేర్కొన్నట్లు భాజపా ఆరోపించింది. భాజపా ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది.

రాహుల్ హిందువని, జంధ్యం కూడా ధరిస్తారని కాంగ్రెస్ కమ్యూనికేషన్ విభాగం సారథి రణ్‌దీప్ సుర్జేవాలా చెప్పారు.

జంధ్యం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడంపై విమర్శలు వచ్చాయి. తన మతం గురించి చర్చపై రాహుల్ స్పందిస్తూ- తాను శివ భక్తుడినని తెలిపారు.

రెండో విడత పోలింగ్‌కు ముందు రోజు గుజరాత్ ఎన్నికలకు సంబంధించి ప్రసారమైన కొన్ని రాహుల్ ఇంటర్వ్యూలపై ఆయనకు ఎన్నికల కమిషన్ నోటీసు జారీచేసింది.

మీరు ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించారని, మీపై చర్య ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ఆయనకు నిర్దేశించింది.

ఈ నెల 14న తుది విడత పోలింగ్ రోజు సబర్మతి నియోజకవర్గంలో ఓటు వేసిన తర్వాత ప్రధాని మోదీ 'రోడ్డు షో' నిర్వహించారంటూ ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును పరిశీలిస్తున్నామని ఈసీ చెప్పింది.

ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)