ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యేనా?

  • 18 డిసెంబర్ 2017
గుజరాత్ ఎన్నికల ఫలితాలు

గుజరాత్ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఆ ఎన్నికల్లో ఈసారి తమదైన ముద్ర వేసిన ఐదుగురు ప్రముఖులపై బీబీసీ కథనం.

రాహుల్ గాంధీ విస్తృతంగా ప్రచారం చేసిన ఈ ఎన్నికలు.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన ఏ మేరకు రాణిస్తాడన్న దానికి గీటురాయిగా మారబోతున్నాయి. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ సైతం సొంత రాష్ట్రం గుజరాత్‌లో జరిగిన ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ఐదుగురు ప్రముఖులు తమదైన ముద్ర వేశారు.

Image copyright Getty Images

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ ఎన్నికలలో అన్నీ తానై రాష్ట్రమంతటా పర్యటించి, ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. మోదీ ప్రచారంతో సీఎం విజయ్ రూపానీ సహా గుజరాత్ బీజేపీ నాయకులంతా మరుగున పడిపోయారు.

అయితే ఈసారి ఎన్నికల్లో ప్రధాని అభివృద్ధి నినాదానికి బదులుగా మరోసారి 'హిందుత్వ' అంశాన్ని తడమడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తమ ప్రభుత్వం సాధించిన విషయాలను చెప్పడానికి బదులు ఆయన ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలకే ప్రాధాన్యతనిచ్చారు.

ఎన్నికల సమయంలో ఫిక్కిలో చేసిన ప్రసంగంలో ఆయన రాజకీయాల ప్రస్తావన చేయడం కూడా వివాదాస్పదంగా మారింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక రాహుల్ గాంధీ

ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ కూడా ఈసారి హిందువుల ఓట్లను ఆకర్షించడానికి ప్రయత్నించింది. ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమ్‌నాథ్‌తో పాటు 25కు పైగా దేవాలయాలను సందర్శించారు. అయితే సోమ్‌నాథ్‌ ఆలయంలో హిందువును కాదంటూ రిజిష్టర్‌లో రాశారని వివాదం చెలరేగింది.

ప్రధానిని 'నీచుడు'గా అభివర్ణించిన మణిశంకర్ అయ్యర్‌ను సస్పెండ్ చేయడం ద్వారా రాహుల్ వ్యక్తిగత దూషణలను సహించేది లేదని పార్టీ నేతలకు హెచ్చరికలను పంపారు.

బీజేపీ వ్యతిరేకులను కూడగొట్టడానికి తీవ్రంగా ప్రయత్నించిన రాహుల్.. సరిగ్గా ఎన్నికలకు ముందు అతి కష్టం మీద ఆ పనిని సాధించారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ మరికొంత పరిణితి చూపారు.

గుజరాత్ ఎన్నికలపై రాహుల్ పలు ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా వివాదాస్పదంగా మారాయి. మొదట దీనిపై వివరణ ఇవ్వాలని ఆయనకు నోటీసులు పంపిన ఎన్నికల కమిషన్, తర్వాత వాటిని వెనక్కి తీసుకుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక హార్దిక్ పటేల్

పటేళ్ల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న హార్దిక్ పటేల్ కూడా బీజేపీని ఓడించేందుకు ఈ ఎన్నికల్లో శాయశక్తులా కృషి చేశారు. 24 ఏళ్ల హార్దిక్ కాంగ్రెస్‌తో కలిసి బీజేపీని ఢీ కొడుతున్నారు.

ఈ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని హార్దిక్ ఆరోపిస్తున్నారు. అయితే బీజేపీకి కూడా పాటిదార్లలో చెప్పుకోదగినంత బలముంది. పాటిదార్ల ప్రాబల్యం ఉన్న చోట బీజేపీ విజయం సాధిస్తే అది హార్దిక్ పటేల్ ఇమేజ్‌ను దెబ్బ తీసే అవకాశముంది.

ఎన్నికల తర్వాత హార్దిక్ పటేల్ తన ఆందోళనను స్వతంత్రంగా కొనసాగిస్తారా లేక కాంగ్రెస్‌తో జత కడతారా అన్న దాని కోసం వేచి చూడాలి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక జిగ్నేష్ మేవానీ

ఫైర్ బ్రాండ్‌గా పేరు పొందిన జిగ్నేష్ మేవానీ ఉత్తర గుజరాత్‌లోని బనాస్‌కాంఠ జిల్లాలోని వడ్‌గామ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మేవానీకి మద్దతుగా కాంగ్రెస్ అక్కడ పోటీ అభ్యర్థిని పెట్టలేదు.

ఇటీవల గుజరాత్‌లో దళితులపై పెరుగుతున్న దాడుల నేపథ్యంలో జిగ్నేష్ మేవానీ ఎలాగైనా బీజేపీని ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. దళిత వ్యతిరేక బీజేపీకి ఓటేయొద్దని మేవానీ తీవ్రంగా ప్రచారం చేశారు. గుజరాత్‌లోని 7 శాతం దళితుల ఓట్లు బీజేపీకి పడకుండా చేయాలనేదే తన లక్ష్యమని ప్రకటించారు.

అయితే కాంగ్రెస్ రెబల్స్ నుంచి మేవానీ తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు. కొన్ని గ్రామాల్లో జిగ్నేష్ మేవానీ హిందూ వ్యతిరేకి అంటూ ఆయనకు ప్రవేశాన్ని కూడా నిరాకరించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక అల్పేష్ ఠాకూర్

ఓబీసీల నేత అల్పేష్ ఠాకూర్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ తరపున రాధన్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. నియోజకవర్గంలోని 60 వేల మంది ఠాకూర్ ఓటర్లను నమ్ముకుని ఆయన బరిలోకి దిగారు.

అల్పేష్ సభలకు భారీ ఎత్తున ప్రజలు హాజరైనా అవి ఏ మాత్రం ఓట్ల రూపంలోకి మారతాయో చూడాలి.

ప్రధాని రోజూ 4 లక్షల రూపాయల విలువ చేసే పుట్టగొడుగులు తింటారంటూ అల్పేష్ ఠాకూర్ చేసిన ప్రచారం కూడా వివాదాస్పదమైంది. గతంలో నల్లగా ఉన్న ప్రధాని తైవాన్ పుట్టగొడుగులు తినడం వల్లే తెల్లబడ్డారంటూ అల్పేష్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది.

గుజరాత్ ఎన్నికల ఫలితాలతో చాలా అంశాలపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ 2019 ఎన్నికల్లో మరోసారి అభివృద్ధి నినాదాన్ని వదిలిపెట్టి హిందుత్వ నినాదాన్ని చేపట్టే అవకాశముంది.

ఈ ఎన్నికల ఫలితాలు రాహుల్ గాంధీకి మంచి గుణపాఠం కాగలవు.

జిగ్నేష్ మేవానీ, హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్‌ల భవిష్యత్తు కూడా ఈ ఎన్నికలతో తేలిపోనుంది. రాజకీయాల్లో కొనసాగాలంటే జిగ్నేష్, అల్పేష్‌లకు ఈ ఎన్నికల్లో విజయం చాలా అవసరం.

అతి చిన్న వయసులోనే పటేల్ యువతకు ఆరాధ్యుడిగా మారిన హార్దిక్ ముందు ముందు ఇంకా పెద్ద నేత అయ్యే అవకాశం ఉంది.

ఒక రకంగా గుజరాత్ ఫలితాలు రాబోయే కాలానికి దిక్సూచిలాంటివి.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)