మొదటి రోజున బాలు.. చివరి రోజున రెహమాన్

  • 18 డిసెంబర్ 2017
Image copyright Getty Images

కాకినాడలో రెహమాన్ మ్యూజికల్ నైట్

కాకినాడలో రేపటి నుంచి మూడు రోజుల పాటు బీచ్ ఫెస్టివల్‌ జరగనుందని ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది.

పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని యనమల రామకృష్టుడు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం మొదటి రోజున ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత విభావరిని ఏర్పాటు చేశారు.

రెండో రోజు వందేమాతరం శ్రీనివాస్‌తోపాటు పలువురు కళాకారులు, మూడవ రోజున ఆస్కార్ గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ ప్రజల్ని అలరించనున్నారు.

ఈ మూడు రోజులూ.. ‘ప్రత్యేక కార్నివాల్’ పేరుతో జిల్లాకు చెందిన కళారూపాలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి 12 లక్షల మంది వస్తారని అధికారుల అంచనా.

హెలికాప్టర్‌లో తిరుగుతూ సముద్ర తీరాన్ని ఎంజాయ్ చేయడానికి రూ.2,500 టికెట్ ధర నిర్ణయించారు.

ఈ టికెట్లను ఏపీ టూరిజం వెబ్‌సైట్‌లో కూడా బుక్ చేసుకోవచ్చని ఆంధ్రజ్యోతి కథనం తెలిపింది.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ Image copyright Getty Images

రాష్ట్రపతి గుంటూరు పర్యటన ఖరారు

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైందని ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం..

రాష్ట్రపతి డిసెంబర్ 27న గుంటూరులో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద ఇండియన్ ఎకనామిక్స్ అసోసియేషన్ ప్రారంభ సమావేశంలో ఆయన పాల్గొంటారు.

అనంతరం వెలగపూడిలోని సచివాలయంలో ఫైబర్‌గ్రిడి పథకాన్ని ప్రారంభిస్తారు.

Image copyright Getty Images

ఒంటరిగా వెళ్లి ఏడ్చేశాను

సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో ఓడిపోవడం తనను చాలా బాధించిందని పి.వి.సింధు సాక్షి దినపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ ఇంటర్వ్యూలో సింధు భావోద్వేగానికి లోనైందని సాక్షి ప్రచురించింది.

''మ్యాచ్ ముగిశాక ఒంటరిగా వెళ్లి ఏడ్చేశాను. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో కూడా ఇలాగే జరిగింది. ఈ మ్యాచ్‌ను చాలా బాగా ఆడాను. కానీ ఎలా ఓడానో అర్థం కావడం లేదు. ఆట 19 - 19 వద్ద ఉన్నపుడు కూడా ఓటమి గురించి భయపడలేదు. మ్యాచ్ చాలా బాగా నడిచింది. ఇంకా చెప్పాలంటే.. లీగ్ మ్యాచ్‌లో నేను ఓడించిన యమగూచి వేరు.. ఫైనల్లో ఆడిన యమగూచి వేరు. నేను ర్యాలీలుగానే ఆడాలని భావించాను. దురదృష్టవశాత్తూ షటిల్స్ నెట్‌ను దాటలేకపోయాయి. వాటిలో ఒక్క పాయింట్ వచ్చినా ఫలితం భిన్నంగా ఉండేదేమో! ఆటపరంగా నేను ఏం చేయగలనో అంతా చేశాను కానీ.. చివర్లో అంతా చేజారింది. 2017 సంవత్సరం చాలా బాగా సాగింది. నాకెరీర్‌లో ఒకే ఏడాది క్కువ మ్యాచ్‌లు గెలిచిన సంవత్సరం ఇది. ఫైనల్స్‌లో కూడా గెలిచుంటే ఇంకా బాగుండేది. ఏదేమైనా.. 2018 సంవత్సరాన్ని కొత్తగా మొదలుపెడతాను. వరల్డ్ నంబర్ వన్ కూడా సాధించే అవకాశం ఉంటుంది కదా!’’

Image copyright Getty Images

ఆంధ్రప్రదేశ్ అధికారులు పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొనకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం..

పల్లె నిద్ర కార్యక్రమం నిద్రావస్థలోకి జోగుతోంది. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో అధికారుల పల్లె నిద్రకు సంబంధించిన జీఓ జారి అయ్యింది.

ఆ జీఓ ప్రకారం వారు నెలకు కనీసం రెండు రోజులపాటు క్షేత్ర పర్యటనలకు వెళ్లాలి. అందులో ఓ రోజు గ్రామాల్లో బస చేయాలి. విభాగాధిపతులు నెలలో 7 రోజుల పర్యటన, రెండు రోజుల పల్లె నిద్ర చేయాలి.

కానీ చాలా మంది అధికారులు పల్లె నిద్ర చేసిన పాపాన పోలేదు. కానీ పల్లె నిద్ర చేసిన గ్రామాల్లో మంచి ఫలితాలు వస్తున్నట్లు ఆంధ్రజ్యోతి తెలిపింది.

అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు.

Image copyright Telangana CMO/Facebook

ముగింపు సభలో చారిత్రాత్మకమైన నిర్ణయాలు

ప్రపంచ మహాసభల ముగింపు సమావేశాల్లో మంచి పథకాలను ప్రకటిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినట్టు నమస్తే తెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. కథనం ప్రకారం..

తెలుగు భాషోన్నతికి, సారస్వత అభివృద్ధి కోసం చారిత్రాత్మకమైన నిర్ణయాలను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. సాహితీ సృజన కోసం కృషి చసేవారికి ఒకప్పుడున్న ఆదరణ మధ్యలో కొంత తగ్గిందని ఆయన అన్నారు.

కానీ తెలంగాణలో రస స్ఫూర్తికి తక్కువ లేదు, రచించేవారికీ కొదవ లేదని ఈ సభలు రుజువు చేస్తున్నాయన్నారు.

‘‘ఒకప్పుడు నాకు 3 వేల పద్యాలు కంఠతా వచ్చేవి. మధ్య రాత్రి లేపి మనుచరిత్రలోని ఫలానా పద్యం చెప్పమంటే చెప్పేవాడిని’’ అంటూ.. పెద్దన రచించిన 'స్వారోచిష మను సంభవము'లోని పద్యం..

‘‘అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్షరస్ఝరీ...'' అనే పద్యం అందుకున్నారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)