నన్ను చట్టబద్ధంగా అంతమొందించే కుట్ర జరుగుతోంది: కోబాడ్ గాంధీ

  • 18 డిసెంబర్ 2017
కోబాడ్ గాంధీ Image copyright Kranthi Tekula/FB

ఇటీవల జైలు నుంచి విడుదలైన మావోయిస్టు సిద్ధాంతవేత్త కోబాడ్‌ గాంధీని ఝార్ఖండ్ పోలీసులు తిరిగి అరెస్టు చేయడంపై పలు సంస్థలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అయితే అతనిపై పలు కేసులు పెండింగ్‌లో ఉన్నందునే ఆయనను మళ్లీ అరెస్ట్ చేశామని ఝార్ఖండ్ పోలీసులు అంటున్నారు.

శనివారం ఒక కేసు విచారణ నిమిత్తం తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట కోర్టులో హాజరై తిరిగి వెళ్తుండగా ఝార్ఖండ్ పోలీసులు కోబాడ్‌‌ను అరెస్టు చేసి తీసుకువెళ్లారు.

కోబాడ్‌ గాంధీ అలియాస్‌ అరవింద్‌ అలియాస్‌ సలీంపై దేశంలోని అనేక ప్రాంతాల్లో కేసులున్నాయి. ఈ కేసులన్నింటిలో ఒకేసారి బెయిల్‌ రావడంతో గత మంగళవారమే ఆయన విశాఖ జైలు నుంచి విడుదలయ్యారు.

విడుదల అనంతరం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందుతున్న క్రమంలోనే ఝార్ఖండ్ పోలీసులు ఆయనను మళ్లీ అరెస్ట్ చేసినట్లు రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు వరవరరావు తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి కోబాడ్ గాంధీ జైలులో ఉన్నపుడే ఝార్ఖండ్ పోలీసులకు లేఖ రాశారని.. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఆ రాష్ట్ర పోలీసులు జైలు నుంచి విడుదలయ్యాక ఇలా అరెస్ట్ చేయడం అక్రమమని వరవరరావు ఆరోపించారు.

అరెస్ట్ అనంతరం కోబాడ్ గాంధీని హైదరాబాద్ నాంపల్లి కోర్టులో హాజరు పరచి, అక్కడి నుంచి రాంచీకి తరలించారని తెలిపారు.

Image copyright Youtube grab
చిత్రం శీర్షిక కోబాడ్ గాంధీ

'నడవలేరు... నిలబడలేరు'

కోబాడ్ గాంధీ పలు దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారని సీఆర్‌పీపీ తెలంగాణ శాఖ కార్యదర్శి బళ్లా రవీంద్రనాథ్ బీబీసీకి తెలిపారు. ప్రొస్టేట్ గ్రంథి సమస్య, గుండెకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలున్నాయని ఆయన చెప్పారు.

దాంతో పాటు డిస్క్‌కు సంబంధించిన సమస్యలు, రక్తపోటు వంటివి ఉన్నాయని ఆయన చెప్పారు. విడుదలైన తర్వాత అపోలో ఆస్పత్రిలో చూపించినపుడు ఆయనకు వెంటనే ఆపరేషన్ అవసరమని వైద్యులు సూచించారని, అయితే తాను తన స్వస్థలం ముంబయికి వెళ్లిన తర్వాతే చికిత్స చేయించుకుంటానని కోబాడ్ అన్నారని ఆయన తెలిపారు.

గుండె పరీక్షలు ఇంకా జరుగనే లేదని ఆయన చెప్పారు. ఈ సమస్యల రీత్యా ఆయన ఎక్కువ సేపు నిలబడలేరనీ, నడవడం కూడా కష్టంగా ఉందని ఆయన చెప్పారు.

సీపీడీఆర్ ప్రధాన కార్యదర్శి ఆనంద్ తేల్‌తుంబ్డే దీనిపై మాట్లాడుతూ, "ప్రభుత్వ చర్య అక్రమం. ఆయనపై మోపిన చాలా కేసులు కొట్టివేశారు. కొన్నింటిలో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండి, ఆయన విడుదల కాగానే పాత కేసులు తిరగదోడడం అనుచితం. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే అవుతుంది" అని అన్నారు.

"వయస్సు, ఆరోగ్యం రీత్యానే కాదు, చట్టపరంగా చూసినా ఇలా బెయిల్‌పై విడుదలైన వెంటనే ఇలా అరెస్ట్ చేయడం అనుచితం" అని ఆనంద్ బీబీసీతో అన్నారు.

Image copyright facebook
చిత్రం శీర్షిక కోబాడ్ గాంధీ ప్రెస్ నోట్

నాకేమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత: కోబాడ్

తన అరెస్ట్‌పై కోబాడ్ గాంధీ చేతితో రాసిన ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

ఈ ప్రెస్ నోట్‌లో ఆయన.. అన్ని కేసుల నుంచి విడుదలైన తనను మూడు రోజులకే తిరిగి అరెస్ట్ చేశారని తెలిపారు. ఏపీ ఇంటలిజెన్స్ అధికారులు వెంట ఉండగా ఝార్ఖండ్ పోలీసులు తనను అరెస్ట్ చేసి విమానం ద్వారా రాంచీకి తరలించారని ఆరోపించారు.

విడుదలైన వెంటనే తాను ఒక నెల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని.. అయినా పోలీసులు తనను అరెస్ట్ చేయడం చూస్తే తనను చట్టబద్ధంగా అంతమొందించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానం కలుగుతోందని లేఖలో పేర్కొన్నారు.

తనకిప్పుడు 71 ఏళ్లనీ, తాను పలు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నానని ఆయన ఆ లేఖలో తెలిపారు. తనకేమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని ఆ ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు.

Image copyright Twitter/Jharkhand police

సమాచార లోపం!

అయితే ఝార్ఖండ్ పోలీసులు మాత్రం గతంలో సమాచార లోపం ఏర్పడడం వల్ల అపుడు చర్య తీసుకోలేకపోయామని కోబాడ్ గాంధీని ఇప్పుడు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెపుతున్నారు.

2006-2007లో రెండు కేసులకు సంబంధించి కోబాడ్ గాంధీ ప్రధాన సూత్రధారి అని బొకారో ఎస్పీ కార్తిక్ బీబీసీకి తెలిపారు. ఇందులో ఒక పేలుడు సంఘటనలో 15 మంది పోలీసులు మరణించారని ఆయన వెల్లడించారు.

కోబాడ్ గాంధీ గతంలోనే లేఖ రాసినా స్పందించకపోవడంపై బీబీసీ ఆయనను ప్రశ్నించగా.. లేఖ అందిన మాట వాస్తవమే అయినా, రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య సమాచార లోపం వల్లే ఆయనను అప్పుడే విచారించడం వీలు కాలేదన్నారు. ప్రస్తుతం కోబాడ్ గాంధీ తేనూఘాట్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

బ్రిటన్‌లో చార్టర్డ్ అకౌంటెంట్‌ విద్యనభ్యసించిన కోబాడ్ గాంధీ.. కొన్నేళ్లపాటు డెహ్రూడూన్‌లో ఆర్థికవేత్తగా, ఆ తరువాత జర్నలిస్టుగా పని చేశారు. అనంతరం మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లారు. 2009లో కోబాడ్ గాంధీని దిల్లీలో అరెస్ట్ చేశారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)