ఎన్నికల ఫలితాలు: గెలిచిందెవరు? ఓడిందెవరు?

  • 18 డిసెంబర్ 2017
గుజరాత్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక గుజరాత్‌లో బీజేపీ మహిళా కార్యకర్తల సంబరాలు

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది.

ఇప్పటి వరకు ఎన్నికల సంఘం ప్రకటించిన గణాంకాల ప్రకారం గుజరాత్‌లో బీజేపీ 96 స్థానాల్లో గెలుపొందింది. మరో మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

కాంగ్రెస్ 77 స్థానాలు దక్కించుకుంది. ఇతరులు 6 చోట్ల గెలిచారు.

అయితే, కొన్ని కీలక నియోజక వర్గాల్లో పార్టీల అంచనాలు తప్పాయి. తలపండిన సీనియర్ నాయకులు సైతం పరాజయం పాలయ్యారు. మరికొన్ని చోట్ల కొందరు బొటాబొటి మెజార్టీ సాధించారు.

ఇంతకీ ఎవరు ఏ ప్రముఖుడు ఏ స్థానంలో గెలిచారు, ఎన్ని ఓట్ల మెజారిటీ సాధించారో చూద్దాం.

Image copyright facebook/vijay rupani
చిత్రం శీర్షిక రాజ్‌కోట్ పశ్చిమంలో గెలుపొందిన సీఎం విజయ్ రుపానీ

1. రాజ్‌కోట్‌లో విజయ్ రూపానీ విజయ దరహాసం!

గుజరాత్‌లోని రాజ్‌కోట్ పశ్చిమం స్థానాన్ని బీజేపీ నిలబెట్టుకుంది.

అక్కడి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి, ముఖ్యమంత్రి విజయ్ రూపానీ 53, 755 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఇంద్రాణి రాజ్యగురుకి 35.9 శాతం ఓట్లు రాగా, విజయ్ రుపానీకి 60.7శాతం ఓట్లు వచ్చాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక విజయోత్సవ ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా

నిజానికి ఇంద్రాణి రాజ్‌కోట్‌ తూర్పు నియోజక వర్గ సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే.

కానీ కుల సమీకరణాల్లో భాగంగా పశ్చిమం స్థానంలో బరిలోకి దిగారు. కానీ కమలం హవాలో నిలవలేకపోయారు.

బీజేపీకి వ్యతిరేకంగా హార్దిక్ పటేల్ విస్తృత ప్రచారం చేశారు. కానీ కాషాయ పార్టీ గెలుపును అడ్డుకోలేకపోయారు.2. కాంగ్రెస్ ఖాతాలో రాధన్‌పూర్‌

పాటన్ జిల్లాలోని రాధన్‌పూర్‌ నియోజకవర్గం కాంగ్రెస్ ఖాతాలో పడింది.

ఇక్కడ ఓబీసీ నాయకుడు అల్పేష్‌ ఠాకూర్ విజయం సాధించారు.

ఆయన బీజేపీ అభ్యర్థి లావింజ్ ఠాకూర్‌పై 14, 857 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఇక్కడ 67శాతం ఓబీసీ ఓటర్లే ఉన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఓబీసీ నేత అల్పేష్ ఠాకూర్

3. వడ్‌గామ్‌లో జిగ్నేష్ మేవానీ మ్యాజిక్

బనాస్‌కాంఠా జిల్లాలోని వడ్‌గామ్‌లో దళిత నేత, స్వతంత్ర్య అభ్యర్థి జిగ్నేష్ మేవానీ గెలిచారు. జిగ్నేష్ కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచారు.

బీజేపి అభ్యర్థి విజయ్ కుమార్‌పై 19,696 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు.

వడ్‌గామ్‌ కాంగ్రెస్‌కు కంచుకోట. జిగ్నేష్‌కి మద్దతు ప్రకటిస్తూ కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెట్టలేదు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక జిగ్నేష్ మేవానీ

4. భావ్‌నగర్ వెస్ట్‌లో కమలం హవా

భావ్‌నగర్‌ వెస్ట్‌ సీటు కమలం ఖాతాలో పడింది. ఇక్కడి నుంచి బరిలో నిలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీతూ వాఘానీ గెలిచారు.

సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి దిలీప్‌పై 27, 185 ఓట్ల మెజారిటీ సాధించారు. జీతూ వాఘానీ గుజరాత్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు.

Image copyright Getty Images

5. పోరుబందర్ చివరి వరకు హోరాహోరే!

గాంధీ జన్మస్థలమైన పోరుబందర్‌లో పోరు చివరి వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగింది.

కాంగ్రెస్ అభ్యర్థి మద్‌వాడియా, బీజేపీ అభ్యర్థి బొకిరియా మధ్య హోరాహోరీ జరిగింది.

చివరికి బీజేపీ అభ్యర్థి బొకిరియా స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు.

గుజరాత్‌ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడైన మద్‌వాడియా 1855 ఓట్ల తేడాతో ఓడిపోయారు.


మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionగుజరాత్‌లోని సూరత్‌లో బీజేపీ కార్యకర్తల సంబరాలు

6. మాండ్విలో పనిచేయని శక్తిసింగ్

కచ్ఛ్ జిల్లాలోని మాండ్వి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శక్తిసింగ్ పరాజయం పాలయ్యారు.

ఆయనపై 9171 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి వీరేంద్ర జడేజా విజయం సాధించారు.

గుజరాత్‌ కాంగ్రెస్‌లో శక్తిసింగ్‌ కీలక నాయకుడు.

Image copyright ANI
చిత్రం శీర్షిక హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ తరఫున సీఎం అభ్యర్థిగా పోటీ చేసిన ప్రేమ్ కుమార్ పరాజయం పొందారు

హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ సీఎం అభ్యర్థి పరాజయం

అయితే, కమలం గాలి ఎంత వీచినా.. హిమాచల్‌ప్రదేశ్‌లో మాత్రం బీజేపీ సీఎం అభ్యర్థి ప్రేమ్ కుమార్‌ దమల్‌ ఓడిపోయారు.

ఈయన సజ్జన్‌పూర్‌ నుంచి బరిలో నిలిచారు. 2933 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.కమలానికి పట్టం కట్టిన రెండు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన ట్వీట్ చేశారు.

ప్రజా తీర్పును గౌరవిస్తాం:రాహుల్

రెండు రాష్ట్రాల ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు.కాంగ్రెస్‌కు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)