ఎడిటర్స్ కామెంట్: ప్రపంచ తెలుగు మహాసభలు మనకు చెపుతున్నదేమిటి?

  • 19 డిసెంబర్ 2017
తెలుగు మహాసభల్లో ప్రసంగిస్తున్న సీఎం కె.చంద్రశేఖరరావు, వేదికపై ఉపరాష్ట్రపతి, గవర్నర్ తదితరులు Image copyright Telangana CMO/Facebook

తెలంగాణ రాజ్యాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్న చంద్రశేఖరుల వారు భూమండలం నలుమూలలా విస్తరించి ఉన్న కవి గాయక వైతాళికులను సభకు ఆహ్వానించి సన్మాన సత్కారములు జరిపి నజరానాలతో సంతృప్తిపరిచి మహారాజపోషకులనిపించుకున్నారు అని విని ఉండేవాళ్లం, నాలుగు కాలాల ముందయితే.

గతంలో జరిపిన యాగఫలమ్ము కానీ ఇప్పటి కవి దీవెనలు కానీ ఊరికే పోవని అవి రాజుకు రాజ్యానికి శుభం కలిగిస్తాయని కూడా విని ఉండేవాళ్లం. కాలం మారింది కాబట్టి ధ్వని మారింది. స్వతహాగా సాహితీ ప్రేమికుడైన ముఖ్యమంత్రి తన స్థాయికి తగ్గట్టుగా జరుపుతున్న మహాసభలు అని ఆధునిక భాషలో వింటున్నాం.

కెసిఆర్ ఏది తలపెట్టినా అంతే. ఏదైనా ధూం ధామే. కొరత సహించరు. నిధులకు లోటు రానివ్వరు. మర్యాదలకు తక్కువ చేయరు. ఆయన మాట్లాడుతుంటే వినాలె అనిపించేంత తీయనైన తెలుగు పలుకుబడి ఉన్నవక్త. వీటన్నింటిని మించి తాను అనుకోవాలే గానీ దేనికైనా ఎన్ని కోట్లైనా ఖర్చుపెట్టగలిగిన తెగువ ఉన్న నేత.

యాగమైనా, కులాల వారీగా చేస్తున్న సంతర్పణలయినా. క్రీడాకారులకు ఇచ్చే నజరానాలయినా. అలాంటి వారు తలపెట్టిన తెలుగు సభలు ఎలా ఉంటాయి? ఇలాగే ఉంటాయి.

హైదరాబాద్ మోత మోగిపోతా ఉంది. ఎటు చూసినా ఏర్పాట్ల గురించి సత్కార సన్మానాల గురించీ, భోజనాల గురించీనూ. తెలుగు రాజ్యాల నుంచే కాకుండా ఎక్కడెక్కడో ఏఏ సీమల్లోనో స్థిరపడిన తెలుగువారిని భారీగా రప్పించి స్టార్ హోటళ్లలో ఉంచి మరీ సత్కార సన్మానాలు చేసి పంపిస్తున్నారు.

నాలుగు కాలాల పాటు నాలుగు నాల్కల మీద నర్తించాలని పాలకునికి ఉన్నట్టు అనిపిస్తున్నది. హైదరాబాద్ వల్ల ఒనగూరిన అదనపు సొమ్ము చేతిలో ఉన్నది. వాళ్లకు వాళ్లే నమ్మలేనంతగా కళ్లుతిరిగిపోయేంతగా కోటి అంటే రెండక్షరాలే కదా అన్నట్టుగా ఈనాములు ఆటగాళ్లకు ఇస్తూ ఉంటిమి.

కవి గాయకులకు నాలుగు రోజులు బస ఏర్పాటు చేసి తృప్తిగా సత్కారము చేసి పంపిస్తే రాజ్యానికేమైనా లోటా అని అనుకుని ఉండవచ్చును.

Image copyright Telangana CMO/Facebook

ఎవరేమనుకున్నా నగర వీధుల్లో కవులు, రచయితల తోరణాలు సాహితీ ప్రియులకు ఊరట. ప్రభుత్వ వేదికపై సన్మానసత్కారాలు అందుకోవడం మరికొందరి ముచ్చట.

నిత్య ప్రతిపక్షంలో ఉండాలని చాలామంది కోరుకోరు

యాయవారపు బ్రాహ్మడు కడుపారా భోజనం కోరుకున్నట్టే రచయిత గుర్తింపు కోరుకుంటారు. ఎరుపు, కాషాయం, ఇంకా ఏ రంగులో కవిత్వం రాసినా గుర్తింపు దగ్గర రాజీపడే వాళ్లు తక్కువ. ఇవి ప్రభుత్వ సభలు, వ్యతిరేకించండి అని పిలుపునిస్తున్న వాళ్ల సంఖ్య బహుపలుచన.

నిన్నటిదాకా వారి వేదికలనెక్కినవారిలో, వారి సరసన కూర్చున్నవారిలో అనేకులు ప్రభుత్వ వేదికలమీద కనిపిస్తున్నారు. అంతకుముందు ఇలాంటి సభలను వ్యతిరేకించడంలో ముందు వరుసలో ఉన్నవారు, రాజ్య వ్యతిరేకులకు అత్యంత సన్నిహితులు, వారి సంస్థల్లో ‘అసభ్యులు’గా పిల్చుకునే వారు ఇపుడు ఈ సభల సారధి.

తెలంగాణలో వైచిత్రికి కొదువ లేదు. నిత్యమూ కవిగాయక సాంగత్యాన్ని కోరుకుంటారని పేరున్న కెసిఆర్ కొలువులో వారిపాత్ర మెండుగానే ఉన్నది. నిన్నటివరకూ తమతో ఉన్నవారు కొలువులో కుదురుకోవడం నిరంతరం ప్రతిపక్షపాత్ర పోషించాలనుకునేవారికి నచ్చకపోవచ్చును. కానీ నిత్య ప్రతిపక్షంలో ఉండాలని చాలామంది కోరుకోరు..

బలమైన భావజాల కారణాలుంటే తప్ప.

బయట ఉండి జీవితాంతం పోరాడుతూనే ఉండడం కంటే లోపల ఉండి కొంతమేర సానుకూల మార్పు తేవచ్చును అనే వాదన సిద్ధంగా ఉండనే ఉన్నది. ఉద్యమం తర్వాత వచ్చే అధికారం ప్రత్యామ్నాయ శక్తులకు ఎక్కువగానే చోటు కల్పిస్తుంది. గుర్తింపా, అప్రాప్రియేషనా అనేది చూసే చూపును బట్టి కనిపించే విషయం.

Image copyright Telangana CMO/Facebook

వ్యతిరేకించే బృందం ఎందుకు వ్యతిరేకిస్తున్నది? పౌరహక్కులకు భంగం కలిగిస్తున్న ప్రభుత్వం పిలిస్తే కవిగాయకులు వెళ్లి సన్మానాలు చేయించుకుంటారా అనేది వారి ప్రశ్న.

భిన్నమైన భావజాలమున్న వారు సభలు, సమావేశాలు, ధర్నాలు జరుపుకుంటామంటేనే అనుమతించకుండా ఆంక్షల సంకెళ్లు బిగిస్తున్న ప్రభుత్వం జరుపుతున్న సమ్మేళనానికి ఎలా వెడతారు అని ప్రశ్న.

రాజ్యానికి ఎదురు నడవడం తప్ప పక్కన చెయ్యేసి నడవడం కవికి శోభించదు అని సూచన.

అధికారంలోకి వస్తే ఎన్‌కౌంటర్లు ఉండవు అని చెప్పిన నాయకుడి ఏలుబడిలో బూటకపు ఎన్‌కౌంటర్లు సాగుతున్న విషయం తెలీదా, నిన్న మొన్నటి ఘటనలు చూడలేదా, ఇలాంటి తరుణాన ప్రతిపక్షపాత్ర పోషించాల్సిన రచయితలు సర్కారీ సభల్లో పాల్గొనడం ఏ సందేశమిస్తుంది అనేది వారి ప్రకటనల సారాంశం.

Image copyright Govt of Telangana

వ్యతిరేకించే వారు స్వల్పం.. పాల్గొన్నవారు బహుళం

సాహితీకారుల మీద చాలా పెద్ద బాధ్యతను పెట్టి మాట్లాడడం వారి ఆనవాయితీ. తమకు వీలైనపుడల్లా అలాంటి బాధ్యత తమకు ఉన్నట్టుగా భావిస్తూ ఉభయచరించడం కొందరు సాహితీకారులకు ఆనవాయితీ. తెలుగు నేలకు ప్రత్యేకమైన ఆనవాయితీలివి.

పౌరహక్కులకు సంబంధించి అందరికీ ఒకే రకమైన అభిప్రాయాలు ఉండవు. ఎవరి దృష్టికోణం, ప్రాధామ్యం వారికుంటాయి. పౌరహక్కుల అంశానికి తెలుగు సభలకు సంబంధమేమిటి అని కొందరు కవులు ప్రశ్నించవచ్చు. అన్నింటికి అన్నింటిని ముడిపెట్టి చూడడం సరికాదని వాదించవచ్చు.

ఈ వ్యవస్థను కూల్చి కొత్త వ్యవస్థ తేవాలని ప్రయత్నించేవారు ప్రభుత్వం ఏమి చేసినా ఎలాగూ మెచ్చరు కాబట్టి సరుకు చేయనక్కర్లేదు అని ప్రభుత్వలోగిలిలోనూ బయటా ఉన్న సాహితీకారులు చాలామంది లోలోపల భావించవచ్చు.

అక్షరం ఎలాగూ సొమ్ముచేయదు. కీర్తికి కూడా దూరంగా ఉండమంటే ప్రాణం కొట్టుకులాడుతది. అదే ప్రధానంగా పనిచేస్తున్నవారూ ఉండొచ్చు. నిజంగానే ఇలాంటి సభలు తెలుగు భాషకు పట్టుబట్ట కడతాయని అనుకునేవారూ, సాహితీ వికాసానికి దారితీస్తాయని నమ్మే వారూ ఉండొచ్చు.

కారణాలు ఏమైనా ఎన్నున్నా వ్యతిరేకించే వారు స్వల్పం. పాల్గొన్నవారు బహుళం.

Image copyright Telangana CMO/Facebook

మాది పూర్తిగా వేరేభాష అన్నవారు ఇపుడు తెలుగు సభలు నిర్వహంచడమేమిటి అనే నిరసన ధ్వనులు కొన్ని సన్నగానైనా వినిపిస్తున్నాయి. మా ప్రాంతానికి దక్కిన ప్రాధాన్యం ఎంత అని తూకపు రాళ్లు పట్టుకుని తిరుగుతున్నవారు కొందరు కనిపిస్తున్నారు. అవన్నీ ప్రాంతీయ కోణం ఉన్న విమర్శలు

అన్నింటినీ అనలేం కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని విమర్శలు ఆహ్వానం అందని వారికి ఉండే నిరసన రూపాంతరాలు. ఉద్యమ వేడిలో కొన్ని అతిశయోక్తులు, కొసకు వెళ్లి వాదించడాలు మనలాంటి సమాజాల్లో అన్ని చోట్లా ఉంటాయి. అవి తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్నాయి. వాటిని ఇపుడు వినిపించడం వల్ల ప్రయోజనం లేదు.

అన్ని రంగాల్లో వివక్ష ఉందని పోరాడి సొంత రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఆ ఉద్యమ రథసారధి నేతృత్వంలో నడుస్తున్న సభలుగా దీనికి తమదైన సాంస్కృతిక ప్రాధాన్యం ఉంటుంది.

కచ్చితంగా తమ ప్రాంతపు సాహితీ వైభవానికి ప్రభుత్వం, సంస్థలు పెద్దపీట వేస్తాయి. అది సభల్లో ప్రతిఫలిస్తుంది. వారి స్థానంలో ఉండి ఆలోచించాల్సిన విషయం ఇది.

తెలుగు భాషాభివృద్ధిలో తెలంగాణ సాహితీ మూర్తుల కృషికి తగిన గౌరవం లభించడం అనేది మహాసభల ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా స్పష్టంగా ప్రకటించుకుని ఉన్నారు. కాళోజీ, వట్టికోట ఆళ్వారు స్వామి వంటి ప్రజా రచయితలను తోరణాలుగా నగర వీధుల్లో చూడడం కన్నుల పండువగా ఉందని భావిస్తున్న వారు ఉన్నారు.

అప్రాప్రియేషన్ అనుకునేవారు కూడా ఉండొచ్చును. అది దృష్టికోణం.

Image copyright TelanganaCMO/Facebook

భావజాలాన్ని అణిచివేయాలనుకోవడం అప్రజాస్వామికం

కానీ ఎందువల్లయినా కొంతమంది వ్యతిరేకిస్తున్నపుడు వారికి నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వకుండా వారి వాదన ప్రజాముఖంగా వినిపించుకునే అవకాశం ఇవ్వకుండా ముందస్తు అరెస్టులు చేయడం, ఇళ్లనుంచే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టడం ప్రశ్నార్థకమైన నిర్ణయం.

ప్రజాస్వామ్యంలో విపక్షానికి చోటు ఉండాలి. వారి వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వాలి. వారిదే భావజాలమైనా సరే! భావజాలాన్ని బలప్రయోగంతో అణిచివేయాలనుకోవడం ప్రజాస్వామికం అనిపించుకోదు.

మిలిటెంట్ వామపక్ష రాజకీయాలకు గొంతు వినిపించుకునే ఏ సన్నివేశాన్నీ అనుమతించడం లేదనే మాట ప్రబలంగా వినిపిస్తున్నది. ధర్నా దాకా రానిస్తే బలవంతంగా ఈడ్చుకెళ్లడాలు వంటి దృశ్యాలు మీడియా ముందు రికార్డు అవుతాయని కాబోలు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతిసందర్భంలోనూ ఈ ముందస్తు మంత్రాన్ని పఠిస్తున్నది.

కోదండరామ్ అరెస్టు దగ్గర్నించి నేటి వరకు ఇదే పద్ధతిని అవలంబిస్తున్నది. అభేదమన్నంతగా ఉద్యమంలో పనిచేసిన వారు కావడం వల్లనేమో మరీ ఎక్కువ ముందస్తు చర్యలు తీసుకుంటున్నది!

Image copyright Telangana CMO/Facebook

ఇంతకీ ఈ సభల వల్ల తెలుగు భాషీయులకు ఒనగూరిన ప్రయోజనాలేంటి? తెలంగాణ కవిగాయక వైతాళికుల పేర్లు, చిత్రపటాలు నగర వీధులెక్కడం మంచి విషయమే.

మీడియా తెలుగు విస్తరణకు వాహిక

సాహితీ ప్రియులకు ముచ్చటగొలిపే అంశమే. ప్రయోజనం అంతమాత్రమే అయితే ఇంత ఆర్భాటానికి తగిన ఫలితం దక్కినట్టుండదు. ఉపాధిలోనూ, నిత్య వ్యవహారాల్లోనూ తెలుగువారికి ఎదురవుతున్న ఇబ్బందులను ఎదుర్కోవడమెట్లా అనేదానిమీద దృష్టిపెట్టాలె.

తెలుగు ప్రచార ప్రసారసాధనాల భాషా వైదుష్యం గురించి బోలెడన్ని జోకులు విమర్శలు ప్రచారంలో ఉన్నవి. ప్రత్యేకించి టీవీ యాంకర్ల చేతిలో భాష ఎన్ని వంకర్లు పోతున్నదో చెప్పే వారి సంఖ్య ఎక్కువ. అందులో కొన్ని వాస్తవాలు కూడా ఉండొచ్చును. కానీ మీడియా తెలుగు విస్తరణకు వాహికగా ఉన్నదనేది అంతకంటే ప్రధానమైన వాస్తవం .

భాష గురించి పట్టించుకోవడం అంటే కొన్ని ధ్వనుల గురించి కొన్ని అక్షరాల గురించి పట్టించుకోవడం కాకూడదు.

కేవలం భాషని కలవరించడం కడుపు నిండిన బేరం. భాషీయుల గురించి పట్టించుకోవాలి. ప్రస్తుతం ఆంగ్లం మెరుగైన ఉపాధిమార్గంగా ఉన్నది. నిచ్చెనమెట్టుగా ఉన్నది. మెరుగైన ఆంగ్లవిద్య అభ్యసించేవారికి లేని వారికి అంతరం పెరుగుతున్నది.

ఇది పేదలకు ఇబ్బందికరమైన స్థితి. తమ ఆర్థిక స్థితి వల్ల పిల్లలు దాన్ని అందుకోలేకపోవడం అంతరాలను పెంచే విషయం. పేదరికం శాపం కాకూడదు. ఫలనా వర్గంలోనో ఫలానా కులంలోనో పుట్టడం వల్ల విద్య, ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలు లేకపోవడం ప్రజాస్వామికం కాదు.

తెలుగులోనూ‘ఉపాధి‘ చూపగలగాలి

ఈ అంతరాలు తగ్గించాలి అంటే తెలుగులో కూడా అదే ఉపాధి పొందగలిగే మార్గం ప్రభుత్వం చూపగలగాలి. అది దాటి వచ్చేశాం, అసాధ్యమనుకుంటే అందరికీ మెరుగైన ఆంగ్లవిద్య అభ్యసించే వీలు కల్పించాలి. కెజి నుంచి పిజి ఉచిత విద్య, అందరికీ ఆంగ్ల మాధ్యమంలో చదివే వెసులుబాటు హమీల రూపంలో ఇంకా చెవుల్లో రింగురింగుమంటూనే ఉన్నాయి. వాటి గతి ఏమైందో కాస్త చూడాలె!

అమలు చేయడంతో పాటు కెజి టు పిజి విద్య కానీ ఆంగ్ల మాధ్యమం కానీ కార్పోరేట్ పిల్లలతో పోటీపడేలా ఉండాలంటే ఏ చేయాలో ఆలోచించాలి. ఆ స్థితి వచ్చే దాకా తెలుగు మాధ్యమంలో చదువుకున్న పిల్లలకు పై చదువుల్లో ఉద్యాగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇపుడు తెలుగు మాధ్యమంలో చదువుతున్న పిల్లలు అంటే ప్రధానంగా నిరుపేదలు,కింది కులాల వాళ్లే.

Image copyright Telangana CMO/Facebook

అలాగే ప్రభాత గేయాలుగా మారిన కొన్ని గీతాల్లోంచి ''మల్లమ్మ పతిభక్తి'' లాంటి పాతకాలపు వాసనలను తొలగించుకోవాల్సిన అవసరం ఉన్నది.

అది ఇపుడు ఏ ప్రాంతంలో ఎక్కువ వాడుకలో ఉన్నది అనేది వేరే విషయం. అన్ని ప్రాంతాల్లోనూ వివక్షను సమర్థించే వెనుకబాటు వాడుకలున్నాయి. భాష సంస్కృతి అని మాట్లాడుకుంటున్నపుడు వారసత్వంగా వస్తున్న కొన్ని వెనుకతరం వెనుకబాటు మాటలను పరిహరించడం ప్రజాస్వామిక అవసరం.

అలాగే భాషకు సంబంధించిన మౌలికమైన కృషి జరగాలి. వాస్తవానికి అనేక సంస్థలు చేయగలిగిన కృషిని భద్రిరాజు గారు చేసి ఉన్నారు.

కవిత్వానికి ఉన్నంత గ్లామర్ మౌలిక కృషికి ఉండదు

తెలుగు సభల్లో ఆయన్ను ఎంత గుర్తుచేసుకుంటున్నారో ఏమో తెలీదు కానీ భాషకు సంబంధించిన నిజమైన కృషికి గుర్తింపు స్వల్పం. కవిత్వానికి ఉన్నంత గ్లామర్ దానికి ఉండదు.

నిత్య వ్యవహారంలోనూ సాంకేతిక రంగంలోనూ ఎదురవుతున్న ఆంగ్ల పదాల సమానార్థకాల సృష్టికి నిఘంటు నిర్మాణ ప్రక్రియ జరగాలి. తమిళుల మాదిరి కంప్యూటర్, మౌస్, సెల్ఫీస్టిక్ వంటి పదాలను తెలుగు చేయడం అంతగా అవసరం కాకపోవచ్చును.

నామవాచకాలను అలాగే ఉంచితే కొంపలేమీ మునగవు. కాకపోతే కొత్త సమాజంలో పుట్టుకొచ్చే అనేకానేక కొత్త భావాలకు విషయాలకు తెలుగుమాటలు అవసరం. ఇంతవరకూ అకాడమీల నేతృత్వంలో జరిగిన నిఘంటు నిర్మాణ ప్రక్రియలన్నీ అరకొరగానే ఉన్నవి.

కొన్ని మీడియా సంస్థలు ఆ కృషి చేస్తున్నాయి. కానీ అది ప్రైవేట్ సంస్థలు నెత్తినేసుకోవాల్సిన పని కాదు.

వ్యవస్థాగతమైన కృషికి వనరులు అందుబాటులో ఉంటాయి. అలాంటి దీర్ఘకాలిక ప్రయోజనాలున్న అంశం చేపడితే తెలుగుకు చక్కని చేర్పు చేసినవారు అవుతారు పాలకులు.

అదే సమయంలో తెలుగు మాత్రమే తెలియడం అనేది దానికది శాపంగా మారుతున్న పేదబిడ్డల గురించి లోతుగా ఆలోచించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటే మంచి మేలు చేసినవారవుతారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు