ప్రెస్ రివ్యూ: కేసీఆ‌ర్‌కి ఇవాంక లేఖ

  • 19 డిసెంబర్ 2017
Image copyright Getty Images

ఇవాంకా లేఖ

సీఎం కేసీఆర్‌కు ఇవాంకా ట్రంప్ కృతజ్ఞతాపూర్వకంగా ఓ లేఖ రాశారని నమస్తే తెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో..

ఇటీవల జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో తనకు లభించిన ఆత్మీయ ఆతిథ్యానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.

మెసేజ్‌లు, ఈ-మెయిళ్ల కాలంలో ఇవాంకా ట్రంప్.. తన సొంత దస్తూరితో లేఖ రాసి పంపడం విశేషం అని ఆ కథనం తెలిపింది.

Image copyright Getty Images

రెండో తరగతి వరకూ స్కూల్ బ్యాగ్స్ వద్దు..

'రెండో తరగతి వరకు స్కూల్ బ్యాగులు వద్దు' అంటూ సాక్షి దినపత్రిక ఓ వార్తను ప్రచురించింది. ఆ కథనంలో..

రెండో తరగతి వరకు స్కూల్ బ్యాగులు మోయకుండా చూడాలని గతేడాదే 'సీబీఎస్ఇ' సర్క్యులర్ జారీచేసినట్టు కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా తెలిపారు.

వైసీపీ నేత మేకపాటి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి కుష్వాహా సమాధానం చెప్పారు.

ఒకటి, రెండు తరగతులకు కేవలం భాష, గణితం పుస్తకాలను, మూడు, నాలుగు, ఐదో తరగతులకు భాష, పర్యావరణ అధ్యయనం, గణితం వంటి మూడు పుస్తకాలను మాత్రమే ఎన్‌సీఈఆర్‌టీ సిఫార్సు చేసిందని ఆయన వివరించారు.

మరోవైపు.. దేశ వ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలపై సమాచారం సేకరిస్తున్నామని ఎంపి జితేంద్ర చౌదరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు.

Image copyright Getty Images

గుజరాత్ సీఎం స్మృతీ ఇరానీ?

గుజరాత్ సీఎం అభ్యర్థి రేసులో స్మృతీ ఇరానీ ఉన్నట్టు ఆంధ్రజ్యోతి ఓ కథనంలో పేర్కొంది. ఆ కథనం ప్రకారం..

నరేంద్ర మోదీ తర్వాత అంత ప్రజాకర్షక నేత గజరాత్‌లో లేరని, అలాంటి ప్రజాకర్షక నేతనే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీ భావిస్తున్నట్టు ఆంధ్రజ్యోతి పేర్కొంది.

అయితే.. ప్రస్తుత సీఎం విజయ్ రూపానీ ఎన్నికల్లో గెలిచినప్పటికీ స్మృతీ ఇరానీ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది . మరోవైపు.. ఎన్నికల ముందు సీఎం అభ్యర్థిగా ప్రకటించిన ప్రేమ్‌కుమార్ ధుమాల్ ఎన్నికల్లో ఓడిపోయారు.

సీఎం జాబితాలో మరికొందరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ స్మృతీ ఇరానీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

Image copyright Getty Images

తెలంగాణ సివిల్ సర్వీసెస్

రాష్ట్రంలోనూ సివిల్ సర్వీసెస్‌ను నిర్వహించే అంశం పరిశీలనలో ఉందని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు.

ఈ మేరకు రామకృష్ణయ్య ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సులను కమిషన్ ఆమోదించిందని పేర్కొన్నారు. యూపీఎస్సీ, రాష్ట్ర పీఎస్సీలకు ఒకే విధమైన సిలబస్ ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

విశాలమైన ప్రాంగణం, ఒకేసారి 3 వేల మందికి పరీక్ష నిర్వహించేందుకు పది ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్ అవసరమని చెప్పారు. ఈ సమావేశంలో కొన్ని ఉద్యోగ ప్రకటనలు చేశారు.

అందులో.. మహిళా శిశు సంక్షేమశాఖలో విస్తరణ అధికారి గ్రేడ్ - 1 కు 79 పోస్టులు, వైద్యశాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు - 200 పోస్టులు ఉన్నాయి.

Image copyright Getty Images

టీనేజ్ తల్లులు

బాల్య వివాహాల కారణంగా అమ్మాయిలు ఆపదలో పడుతున్నారంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో..

పదిహేనేళ్లకే తాళి, 16 ఏళ్లకే గర్భం, 18 ఏళ్లకే రెండో కాన్పు.. ఇలా అమ్మాయిలకు పెళ్లి వయసు వచ్చేలోపే టీనేజీ అమ్మాయిలు ఇద్దరు బిడ్డల తల్లులు అవుతున్నారని ఆంధ్రజ్యోతి ఓ సర్వేను ఉదహరించింది.

గుంటూరు కళాశాలలోని ఓ ప్రొఫెసర్ బృందం సర్వే చేసింది. అందులో భాగంగా జీజీహెచ్ లేబర్ రూమ్‌కు వచ్చిన 200 మందిలో 40 మంది టీనేజ్ పిల్లలే ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది 16 ఏళ్లకే తొలి కాన్పుకు వచ్చారు.

టీనేజ్ గర్భవతుల్లో చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారని సర్వే పేర్కొంది. పిల్లలకు పెళ్లిళ్లు చేయాలని తల్లిదండ్రులే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని తెలిపింది.

దేశంలో ఏటా సగటున 24.9 శాతం మైనర్ బాలికలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఏపీలో 32.3శాతం బాల్య వివాహాలు జరుగుతున్నాయి.

రాజస్థాన్‌లో అధికంగా 40.8 శాతం, బిహార్‌లో 39.6 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నాయని ఆ ప్రొఫెసర్ పేర్కొన్నట్టు ఆంధ్రజ్యోతి తెలిపింది.

Image copyright Getty Images

కాళేశ్వరం ప్రాజెక్టుకు పచ్చజెండా

కాళేశ్వరం పథకానికి పర్యావరణ అనుమతి లభించిందని నమస్తే తెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో..

తెలంగాణలో 37 లక్షల ఎకరాలకు గోదావరి జలాలను అందించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతి లభించింది.

దీనితో కేవలం తాగునీటి పనులే కాకుండా సాగునీటి పనులనూ కొనసాగించడానికి మార్గం సుగమమైంది.

మూడేండ్లలో ఈ ప్రాజెక్టును పూర్తీచేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే.. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే వర్షాకాలం నుంచి వ్యవసాయానికి నీళ్లు అందించాలని, చెరువులను నింపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు..

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)