హార్దిక్ పటేల్ సొంతూరు విరమ్‌గామ్: పంచాయితీ, మున్సిపాలిటీ, అసెంబ్లీ నియోజకవర్గం.. అన్నీ బీజేపీ చేతిలోనే

  • విజయ్ సింగ్ పర్మార్,
  • బీబీసీ ప్రతినిధి

గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక పాటిదార్ అమానత్ ఆందోళన్ సమితి నేత హార్దిక్ పటేల్ ఇంట నిశ్శబ్దం నెలకొంది. హార్దిక్ కుటుంబం అహ్మదాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న విరమ్‌గామ్‌ పట్టణంలో ఉంటోంది.

సోమవారం బీబీసీ గుజరాతీ టీమ్ హార్దిక్ తల్లితో మాట్లాడడానికి ప్రయత్నించింది. కానీ ఆమె అందుకు నిరాకరించారు. హర్దిక్ పటేల్ తండ్రి భరత్ పటేల్ కూడా ఇంట్లో లేరని ఆమె తెలిపారు.

''హార్దిక్ ఎక్కడున్నాడో నాకు తెలీదు. అతను ఆదివారం సోమ్‌నాథ్‌లో ఉన్నాడు. అంతకన్నా ఎక్కువ చెప్పడం నాకిష్టం లేదు'' అని అన్నారు.

కానీ హార్దిక్ అహ్మదాబాద్‌లోనే ఉన్నారు. ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంలే కారణమని వ్యాఖ్యానిస్తూ, ''ఇది చాణక్య నీతి కాదు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఈవీఎం హ్యాకింగ్‌కు వ్యతిరేకంగా ఏకం కావాల్సిన అవసరముంది. ఏటీఎంలే హ్యాక్ అవుతున్నపుడు, ఈవీఎంలను ఎందుకు హ్యాక్ చేయలేరు?'' అని పశ్నించారు హార్దిక్.

ఫొటో క్యాప్షన్,

తల్లి ఉషా బెన్‌లో హార్దిక్ (ఫైల్ ఫొటో)

'స్థానిక రాజకీయాల్లో చురుగ్గా లేరు'

24 ఏళ్ల హార్దిక్ పటేల్ గుజరాత్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. పెద్ద ఎత్తున ర్యాలీలలో పాల్గొన్నారు.

బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఆయన సభలకు జనం భారీగా హాజరయ్యారు.

హార్దిక్ ప్రచారంతో తాము అధికారంలోకి రావచ్చని కాంగ్రెస్ ఆశించింది. కానీ చివరకు బీజేపీ విజయం సాధించింది.

హార్దిక్‌ పటేల్‌ను సోషల్ మీడియాలో చాలా మంది ఫాలో అవుతుండవచ్చు. కానీ, అతను స్థానిక రాజకీయాల్లో ఎన్నడూ క్రియాశీలక పాత్ర పోషించలేదని విరమ్‌గామ్ ప్రజలు తెలిపారు.

విరమ్‌గామ్‌లో అతను ఎలాంటి ర్యాలీలు నిర్వహించలేదు.

స్థానికుడు బ్లాతంత్ ఠాకూర్ బీబీసీతో మాట్లాడుతూ.. ''హార్దిక్ గుజరాత్‌ వ్యాప్తంగా వందలాది ర్యాలీల్లో పాల్గొన్నా, విరమ్‌గామ్‌లో మాత్రం ఒక్క ర్యాలీలో కూడా పాల్గొనలేదు. విరమ్‌గామ్ నియోజకవర్గంలో పటేల్, ఠాకూర్ల ఆధిపత్యం ఉంది. మున్సిపాలిటీ, తాలూకా పంచాయితీలు కూడా బీజేపీ చేతిలో ఉన్నాయి'' అని తెలిపారు.

ఫొటో క్యాప్షన్,

హార్దిక్ పటేల్ ఇల్లు

స్కూల్ టీచరైన హార్దిక్ మెహతా మాట్లాడుతూ.. ''మా విద్యార్థి పాటిదార్ల ఉద్యమానికి నాయకుడైనందుకు మాకు గర్వంగా ఉంది. భవిష్యత్తులో అతను ఇంకా ఎత్తుకు ఎదుగుతాడు'' అన్నారు.

2012 ఎన్నికలలో తేజశ్రీ పటేల్ విరమ్‌గామ్‌లో గెలుపొందారు. ఈసారి ఆమె బీజేపీ తరపున పోటీ చేశారు. కానీ కాంగ్రెస్‌ అభ్యర్థి లాఖాభాయి భర్వాడ్ చేతిలో పరాజయం పాలయ్యారు.

రాజ్‌దీప్ సింగ్ చౌహాన్ అనే స్థానికుడు మాట్లాడుతూ.. ''కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం విరమ్‌గామ్ అభివృద్ధిపై దృష్టి పెడుతుందని భావిస్తున్నాం. విరమ్‌గామ్ ప్రజలు నిరుద్యోగంతో పాటు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు'' అన్నారు.

ఫొటో క్యాప్షన్,

రాజ్‌కోట్‌లో హార్దిక్ ర్యాలీ

''ప్రభుత్వం ఇక్కడి చారిత్రక మున్సార్ చెరువును పరిరక్షించాలని, దాన్ని శుద్ధి చేయాలని కోరుతున్నాం. ఆ చెరువులోకి మురుగునీరును వదులుతున్నారు. దాన్ని కనుక అభివృద్ధి చేస్తే, ఇక్కడికి పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించవచ్చు'' అని మరో స్థానికుడు లాఖా భర్వాడ్ తెలిపారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)