అభిప్రాయం: ‘మోదీకి అసలు సవాలు ఇప్పుడే ప్రారంభమైంది’

  • ఆర్ జగన్నాథన్,
  • సీనియర్ పాత్రికేయులు, బీబీసీ కోసం
గుజరాత్, నరేంద్ర మోదీ, అమిత్ షా

ఫొటో సోర్స్, Getty Images

గుజరాత్‌లో బీజేపీకి భారీ విజయమేమీ దక్కలేదు. కానీ ఈ విజయం ఆ పార్టీకి చాలా ఊరటనిచ్చేది.

గుజరాత్‌లో విజయం సాధించడం మోదీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రధాని సొంత రాష్ట్రం కావడంతో అక్కడ బీజేపీ ప్రదర్శన సరిగా లేకపోయినా, ఓటమి పాలైనా ఆ సందేశం చాలా దూరం వెళుతుంది.

గతంలో బీజేపీ చాలా సులభంగా మెజారిటీని సాధించింది. కానీ ఈసారి ఎన్నికల్లో అతి కష్టం మీద మెజారిటీ దక్కించుకుంది.

బీజేపీ అక్కడ 22 ఏళ్లుగా అధికారంలో ఉంది. అక్కడి ప్రజలు కూడా బీజేపీ పాలనతో అలసిపోయినట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం గుజరాత్‌లో ఆ పార్టీ అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. పాటిదార్ల ఉద్యమంతో ఆ సమస్యలు మరింత పెరిగాయి. పాటిదార్లు అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు కోరుతున్నారు.

కాంగ్రెస్ అక్కడ బీజేపీ వ్యతిరేక పార్టీలను ఒక కూటమిగా కూడగట్టింది. దానిలో పాటిదార్ల నాయకుడు హార్దిక్ పటేల్ కూడా చేరారు. ప్రచారానికి నేతృత్వం వహించిన రాహుల్ గాంధీ, బీజేపీ అత్యంత బలంగా ఉన్నచోటే దానిని సవాలు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోని బీజేపీ

ఈ ఎన్నికలలో జీఎస్టీ బీజేపీకి పెద్ద సవాలుగా మారింది. ఎన్నికలకు ముందు నిర్వహించిన పలు సర్వేలలో బీజేపీ చేతి నుంచి గుజరాత్ జారిపోతున్నట్లు తేలింది. సీఎస్‌డీఎస్-లోక్‌నీతి సర్వేలో ఓట్ల శాతం విషయంలో బీజేపీ వెనుకబడినట్లు తేలింది.

ఈ ఎన్నికల్లో ఓడిపోతుంది అని భావించిన బీజేపీ ఎలా విజయం సాధించింది అనేది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న.

ఈ ఎన్నికల్లో హిందువుల ఓట్ల కోసం ‘గుజరాత్ ఆత్మగౌరవం’ అన్న కార్డును ఉపయోగించిన మోదీ, ఈ ఎన్నికలలో పాకిస్తాన్ జోక్యం కూడా ఉందని చెప్పే ప్రయత్నం చేశారు.

బీజేపీ ఉచ్చులో మణిశంకర్ అయ్యర్, కపిల్ సిబల్ చిక్కుకున్నారు. మోదీ ఆ వివాదాలను తనకు అనుకూలంగా మలచుకున్నారు.

మోదీ గుజరాతీ ఆత్మగౌరవం అన్న ప్రచారం హిందూ ఓట్లను కూడగట్టడానికి బాగా పని చేసింది.

ఫొటో సోర్స్, Getty Images

గెలుపోటముల్లో అతి తక్కువ వ్యత్యాసం

గుజరాత్ ఫలితాలలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పెద్ద తేడా లేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తూ, గెలుస్తూ ఓడిపోతే, బీజేపీ ఓడిపోతూ ఓడిపోతూ గెలిచింది.

ఈ ఎన్నికల్లో గెలవడానికి ఏం చేయాలో రాహుల్ గాంధీ అన్ని ప్రయత్నాలూ చేశారు. పార్టీలో స్థానికంగా బలమైన నాయకులు లేకపోయినా, మంచి ఫలితాలు రాబట్టారు.

గుజరాత్ ఫలితాలకు ముందే రాహుల్‌ పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టారు. పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు మొదటి ఫలితాలే నిరాశాజనకంగా వచ్చాయి. భారీ విజయం సాధిస్తామన్న రాహుల్ మాటలు నిజం కాలేదు.

ఫొటో సోర్స్, Getty Images

గుజరాత్ ఎన్నికల తర్వాత ఐదు విషయాలు స్పష్టమయ్యాయి.

మొదటి విషయం ఏమిటంటే, ఆర్థిక రంగంలో రైతులు, చిన్న వ్యాపారులు తమ విధానాల పట్ల సంతోషంగా లేరని బీజేపీ గుర్తించింది. కొత్త ఉద్యోగాల కల్పన కూడా పెద్దగా లేదు.

పాటిదార్ల ఉద్యమం ఈ ఆందోళన నుంచే పుట్టుకొచ్చింది. ఇలాంటి ఆందోళన ఇతర రాష్ట్రాలలోనూ ఉంది.

చిన్న, అసంఘటిత వ్యాపారులకు జీఎస్టీ అన్నది పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం ఉన్న రూపంలోనే జీఎస్టీని కొనసాగించడం కూడా కష్టమని బీజేపీకి అర్థమైంది.

రెండోది, రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ బహిరంగంగా ముస్లింలకు మద్దతు తెలపడం ఆగిపోయింది.

దీని కారణంగా బీజేపీకి ఆయువు పట్టుగా ఉన్న హిందువుల్లోని సంఖ్య కొంత తగ్గుతోంది.

దీని అర్థం - తమ నుంచి కాంగ్రెస్ వైపు జారిపోతున్న హిందూ ఓటర్లను బీజేపీ తిరిగి తమ వైపు ఆకర్షించుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images

ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం

ఇప్పుడు బీజేపీ తన ఆర్థిక, రాజకీయ అజెండాను అమలు చేయడానికి పూనుకోవచ్చు. దీనిలో భాగంగా మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

అయితే బీజేపీ 2019 సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.

గుజరాత్ ఎన్నికల ఫలితాలతో బీజేపీ 2019 సాధారణ ఎన్నికల్లో మిత్రపక్షాలు తన మాట వినేట్లు చేసుకోగలిగిన స్థితికి చేరుకుంది.

2018 ఎన్నికల్లో మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గడ్, రాజస్థాన్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్‌తో పోలిస్తే ఈ రాష్ట్రాలలో ఎన్నికలు భిన్నం. ఇక్కడ మోదీతో పాటు స్థానిక నేతలు కూడా కీలకం.

అందుకే మోదీకి అసలైన సవాళ్లు ఇప్పుడే ప్రారంభమయ్యాయి.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)