#బీబీసీఇన్నోవేటర్స్: కేన్సర్‌తో పోయిన గొంతు రూ.60తో తిరిగి వస్తుంది!

గొంతు పరికరం, మహిళ చిత్రాలు

సృష్టిలో మాట్లాడే శక్తి మనిషికి మాత్రమే ఉంది. కానీ కేన్సర్ కారణంగా కొందరు ఆ మాటను కోల్పోవాల్సి వస్తోంది. ఆ సమస్యకు 60 రూపాయలతో పరిష్కారం చూపిస్తున్నారు డాక్టర్ విశాల్ రావ్.

చవకైన పద్ధతిలో పోయిన గొంతును తిరిగి తెప్పిస్తూ అనేక మంది సమస్యకు పరిష్కారం చూపిస్తున్న వైద్యుడు విశాల్ రావ్‌కు 'బీబీసీ ఇన్నోవేటర్స్' జాబితాలో చోటు దక్కింది.

భారత్‌లో ఏటా దాదాపు 30వేల మంది గొంతు కేన్సర్ బారిన పడుతున్నారు. ఆ కేన్సర్ ముదిరే కొద్దీ స్వర పేటిక దెబ్బతినడం మొదలవుతుంది. అది ఇతర భాగాలకు వ్యాపించకుండా ఉండాలంటే శస్త్ర చికిత్స చేసి స్వరపేటికను తొలగించక తప్పదు.

ప్రోస్థెటిక్ వాయిస్ బాక్సుల ద్వారా గొంతు కేన్సర్ రోగులకు మాట తెప్పించే అవకాశం ఉంటుంది. కానీ వాటి ఖరీదు దాదాపు రూ.60వేలు. చాలామంది రోగులకు వాటిని కొనే స్థోమత ఉండదు.

పేద రోగుల సమస్యను పరిష్కరించడానికి ఏదైనా చేయాలన్న తపనతో డాక్టర్ విశాల్ రావ్ తన ప్రయోగాల్ని మొదలుపెట్టారు. ఆ కృషి ఫలితమే 'ఓం' వాయిస్ బాక్స్.

కేవలం రూ.60 ఖరీదు చేసే ఆ పరికరం విండ్ పైప్‌నీ.. ఫుడ్ పైప్‌నీ అనుసంధానించడం ద్వారా రోగులకు తిరిగి మాట్లాడే శక్తినిస్తుంది.

'స్టేజ్ 4 కేన్సర్‌తో బాధపడే రోగుల్లో ఎక్కువ శాతం మంది తమ స్వర పేటికను కోల్పోవాల్సి వస్తుంది. వీళ్లకు శ్వాస నాళాన్ని ఆహార వాహికతో అనుసంధానిస్తే తిరిగి మాట్లాడే అవకాశం ఉంటుంది. మేం తయారు చేసిన ఓం వాయిస్ బాక్స్ అదే పనిచేస్తుంది' అంటారు విశాల్ రావ్.

ఆయన తయారు చేసిన పరికరం ద్వారా ఇప్పటికే చాలామంది కోల్పోయిన తమ గొంతుని తిరిగి పొందగలిగారు. అలాంటి వాళ్లలో నారాయణ్ స్వామి ఒకరు.

ఫొటో క్యాప్షన్,

నారాయణ్ కూడా ఓం బాక్స్ సాయంతో తిరిగి మాట్లాడగలుగుతున్నారు

'గతంలో నేను పనిచేసిన కంపెనీలో యూనియన్ లీడర్‌గా ఉండేవాణ్ణి. సమ్మెలకు పిలుపునివ్వడం, ఇతర కార్మికుల తరఫున పోరాడటం నా ప్రధాన బాధ్యతగా ఉండేది. కానీ నేను గొంతుని కోల్పోయాక తోటి ఉద్యోగులకు నాతో అవసరం లేకుండా పోయింది. గొంతు పోవడం అంటే ప్రాణం పోయినట్టే అనిపించింది. ఓ దశలో జీవితంపై విరక్తి చెంది చనిపోదామని అనుకున్నా' అంటూ తన గతాన్ని గుర్తు చేసుకుంటారు నారాయణ్.

'ఓం' బాక్స్ సాయంతో నారాయణ్ తిరిగి మాట్లాడటంతో పాటు తన కాళ్లపై తాను నిలబడగలుగుతున్నారు.

ఫొటో క్యాప్షన్,

ఈ పరికరాన్ని గొంతులో అమర్చడం ద్వారా తిరిగి మాటను రప్పిస్తారు

'రోగుల్లో 80శాతం మంది క్యాన్సర్ ముదిరిన దశలోనే మా దగ్గరకి వస్తారు. వాళ్లంతా గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదలే. భారత్‌లో వైద్య వ్యవస్థ ఎక్కువ శాతం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉంది. ఈ పేదలు ఆ ఖర్చులు భరించలేరు. అందుకే ఈ రోగులను తిరిగి మాట్లాడేలా చేయాల్సిన బాధ్యత నాకు ఉందనిపించింది. మాట్లాడటం ప్రతి ఒక్కరి హక్కు అనేది నా అభిప్రాయం. అందుకే ఓం బాక్స్ తయారీపై దృష్టి పెట్టా' అంటూ ఆ పరికరం తయారీ వెనక ఉన్న నేపథ్యాన్ని వివరిస్తారు డాక్టర్ విశాల్.

ఫొటో క్యాప్షన్,

నాణ్యమైన వైద్యం అందరికీ అందాలన్నది డాక్టర్ రావ్ ఆలోచన

కేన్సర్ కారణంగా తన గొంతును పోగొట్టుకున్న వాళ్లలో నళినీ సత్యనారాయణ ఒకరు. ఇక ఎప్పటికీ మాట్లాడలేననుకున్న తనను 'ఓం' బాక్స్ ఆదుకుందంటారు ఆమె.

'నాకు కేన్సర్ అని తెలిశాక ఇంకెప్పటికీ స్వతంత్రంగా జీవించలేనేమోనని భయపడ్డా. కానీ దేవుడి దయవల్ల మళ్లీ మాట్లాడగలుగుతున్నా. ప్రస్తుతం కేన్సర్ నుంచి కోలుకొని చాలా సంతోషంగా జీవిస్తున్నా' ఆంటారామె.

ప్రస్తుతం ఇతర కేన్సర్ రోగులకు ఆమె కౌన్సిలింగ్ నిర్వహిస్తూ, వారికి అవసరమైన సహాయాన్ని చేస్తున్నారు.

ఫొటో క్యాప్షన్,

‘నా వయసు 70.. అయినా నేనెప్పుడూ ఉత్సాహంగా ఉంటా’

'చూడ్డానికి ఇది సాధారణ పరికరంలా కనిపించినా దీని సామర్థ్యం అపారం. చాలామంది దీని సాయంతో మాట్లాడటంతో పాటు తిరిగి ఉద్యోగాలను పొందగలిగారు. ఫలితంగా ఎవరిపైనా ఆధారపడకుండా జీవిస్తున్నారు' అంటూ ఓం బాక్స్ గురించి వివరిస్తారు అలోక్ థాపర్ అనే మరో వైద్యుడు.

దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని కేన్సర్ సెంటర్లలో 'ఓం' వాయిస్ బాక్స్‌ని అందుబాటులోకి తేవాలన్నది డాక్టర్ విశాల్ ఆలోచన.

'ఇది చాలా చిన్న ఆవిష్కరణలా కనిపించినా ఇప్పటికే ఈ పరికరం చాలామంది జీవితాల్ని మార్చింది' అన్నది ఆయన మాట.

దక్షిణాసియాలో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలకు సరికొత్త పరిష్కార మార్గాలను 'బీబీసీ ఇన్నోవేటర్స్' సిరీస్ వెలుగులోకి తెస్తుంది.

సమస్యలకు పరిష్కారాలు చూపే గొప్ప ఆవిష్కరణలు మీకు ఎక్కడ కనిపించినా, మీరే అలాంటి పరిష్కారాలు కనుగొన్నా ఆ ఫొటోలను మాతో పంచుకోండి.

yourpics@bbc.co.uk కి ఈమెయిల్ చేయొచ్చు. #Jugaad, #BBCInnovators హ్యాష్‌ట్యాగ్‌లతో @BBCWorldService కి షేర్ చేయండి. లేదా ఈ లింక్‌ను క్లిక్ చేసి అప్‌లోడ్ చేయొచ్చు..

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)