ప్రెస్‌రివ్యూ:బిర్యానీ.. బ్యాడ్మింటన్.. బాహుబలి ఓ హైదరాబాద్

రామ్‌నాథ్ కోవింద్

ఫొటో సోర్స్, facebook

''హైదరాబాద్ అంటేనే బిర్యానీ.. బ్యాడ్మింటన్.. బాహుబలి.. గుర్తుకొస్తాయి'' అని రాష్ట్రపతి రామ్‌నాథ్ అన్నారు.

తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరయ్యారని ఈనాడు వార్తా పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం మేరకు..

''సోదర సోదరీమణులకు నమస్కారం..'' అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి ''దేశ భాషలందు తెలుగు లెస్స'' అంటూ మాట్లాడారు.

దేశంలో ఎక్కువ మంది మాట్లాడే రెండో భాష తెలుగు. తెలుగు సంస్కృతి, సాహిత్యం దేశానికి, నాగరికతకు ఎంతో తోడ్పాటును అందించాయన్నారు.

1920 - 30లలో ప్రముఖ శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు ఖండాంతరాల్లో తెలుగు ఖ్యాతిని చాటారు. అమెరికాలో తెలుగువారు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు కూడా..

మైక్రోసాఫ్ట్ సి.ఇ.ఓ. సత్య నాదెళ్ల కూడా తెలుగువారే కావడం గర్వకారణం అని రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఈ సంధర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.

ఫొటో సోర్స్, facebook/Raja Rayalaseema

పోలీసు భద్రత నడుమ గుప్తనిధుల తవ్వకాలు

కర్నూలు జిల్లా చెన్నంపల్లిలో పోలీసు బందోబస్తు మధ్య గుప్తనిధులు తవ్వుతున్నారంటూ సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని వెలువరిచింది. ఈ కథనంలో..

తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని ఓ పురాతన కోటలో తవ్వకాలు జరుపుతున్నారు. అందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతనిస్తున్నారు.

గుప్తనిధులను తవ్వుకోవడానికి వీరికి ముఖ్యమంత్రి కార్యాలయం అనుమతిచ్చిందట.. కానీ లిఖితపూర్వక ఆధారాలు మాత్రం లేవు.. కానీ మౌఖిక ఆదేశాలున్నాయని కలెక్టర్ ఒప్పుకున్నట్లు ఆ కథనంలో ఉంది.

డిసెంబర్ 13 నుంచి జరుగుతున్న తవ్వకాలను గ్రామస్థులు తరుచూ అడ్డుకుంటుండగా.. తూతూమంత్రంగా గ్రామసభలను నిర్వహించి.. తవ్వకాలను తిరిగి ప్రారంభిస్తున్నారు.

కోటలో బంగారంతోపాటు భారీగా నిధులున్నాయని, అక్కడ తవ్వకాలు చేపడతామంటూ ఓ ప్రైవేట్ ఏజెన్సీ సీఎంఓకు దరఖాస్తు చేసుకోగానే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారని వినిపిస్తోంది.

ఫొటో సోర్స్, facebook/Raja Rayalaseema

కోట వెనుక కథ

గోల్కొండ సుల్తాన్, పోర్చుగీసు 1584 - 1614 మధ్య విజయనగర సామ్రాజ్యంపై దాడులు చేస్తున్న నేపథ్యంలో వారు గుత్తి కోటను వదిలి.. అక్కడున్న సంపద, ఆయుధాలను రహస్యంగా మరో కోటకు తరలించినట్టు చరిత్ర చెబుతోంది.

గుత్తి కోటకు సమీపంలో ఉన్న స్వర్ణగిరి (ఇప్పటి వజ్రగిరి) మీదుగా చెన్నంపల్లి కోటకు చేరుకునే విధంగా సొరంగ మార్గాన్ని కూడా తవ్వించారు. చెన్నంపల్లిలో వంద ఎకరాకు పైగా విస్తీర్ణంలో పెద్ద కోటను నిర్మించారు.

ఈ కోటలో విజయనగర పాలనకు చెందిన శిలాశాసనాలు, దేవతా విగ్రహాలు కనిపించడం అందుకు ఊతమిస్తోంది..

ఇలాంటి కోటల లిస్టులో గుత్తి, బళ్లారి, ఆదోని, రాయచూర్ కోటలూ ఉన్నాయి.

ఏదిఏమైనా.. ఇలాంటి గుప్తనిధుల తవ్వకాల సమాచారం పురావస్తుశాఖకూ తెలియకపోవడం, మౌఖిక ఆదేశాలతోనే వారు తవ్వకాలు జరుపుతున్నారని కలెక్టర్ చెప్పడం విడ్డూరమని సాక్షి పత్రిక కథనం..

ఫొటో సోర్స్, Getty Images

పరీక్షలకూ జీఎస్టీ

పోటీ పరీక్షలపై కూడా 'జీఎస్టీ' భారం పడనుందని ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది.. ఆ కథనం మేరకు..

తెలంగాణ రాష్ట్రం నిర్వహించే ఎంసెట్, ఈ సెట్, ఐ సెట్, పీజీ ఈ సెట్, లా సెట్, పీజీ సెట్, ఎడ్‌ సెట్‌ తోపాటు.. పలురకాల పరీక్షలను ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.

దీంతో నిర్వహణ ఖర్చు పెరగనుంది. నిర్వహణ బాధ్యతను వివిధ సర్వీసు ప్రొవైడర్లకు అప్పగిస్తూ.. నిర్వహణ కోసం నిర్ణీత మొత్తాన్నీ అందజేస్తారు.

అందుకుగానూ.. సర్వీసు ప్రొవైడర్లు 18 శాతం జీఎస్టీని చెల్లించాల్సుంటుంది. ఈ పరీక్షలకు దాదాపు 7 - 8లక్షల మంది హాజరవుతారు.

దీంతో దాదాపు 4 కోట్ల మేర అదనపు భారం పడే అవకాశం ఉందని అధికారులు తేల్చారు.

ఈ మొత్తాన్ని విద్యార్థుల నుంచి వసూలు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించిందంటూ ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఆస్తులకు ఆధార్ అవసరం లేదు

ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్ తప్పనిసరి చేసే ఆలోచనేదీ ప్రభుత్వానికి లేదని కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురీ పార్లమెంటుకు తెలిపారు.

అయితే.. వినియోగదారులు అనుమతిస్తే ఆధార్‌ను ఉపయోగించి రిజిస్ట్రేషన్లను ధృవీకరించేందుకున్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా రాష్ట్రాలను కోరామన్నారు.

గత నెలలో.. ఆస్తులకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తే బాగుంటుందని పురీ వ్యాఖ్యానించారు. గతంలో మోదీ కూడా బినామీ ఆస్తులను గుర్తించేందుకు ఆధార్‌ను ఉపయోగిస్తున్నామన్నారు.

మరోవైపు.. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉందని.. అన్ని రాష్ట్రాల ఏకాభిప్రాయంతోనే ఆ దిశగా అడుగులు వేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభకు తెలిపారు.

ఈ సందర్భంలో.. ప్రపంచ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినా భారత్‌లో పెట్ర్ల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గడం లేదని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ప్రశ్నించారు.

అయితే.. రాష్ట్రాలు వేస్తున్న పన్నులే అందుకు కారణమని అరుణ్ జైట్లీ సమాధానమిచ్చారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)