పంజాబ్‌: డ్రగ్స్ సమస్యను తీర్చేందుకు.. అమ్మాయిలకు స్వేచ్ఛనిచ్చేందుకు.. ఫుట్‌బాల్‌!!

  • సరబ్జీత్ దలివాల్
  • బీబీసీ ప్రతినిధి
వీడియో క్యాప్షన్,

పంజాబ్‌లో డ్రగ్స్ సమస్యకు ఫుట్‌బాల్‌తో సమాధానం

పంజాబ్‌లో డ్రగ్స్ వినియోగం అతి పెద్ద సమస్య. మరోపక్క అక్కడ గ్రామాల్లో అమ్మాయిలు స్వేచ్ఛకు దూరంగా నాలుగ్గోడల మధ్యే బతుకుతున్నారు. ఈ రెండు సమస్యలకూ ఒకేఒక్క ఆటతో పరిష్కారం చూపిస్తోంది ‘యూత్ ఫుట్‌బాల్ క్లబ్’.

ఫుట్‌బాల్ సాయంతో డ్రగ్స్ బారి నుంచి బయట పడ్డ ఓ కుర్రాడితో, అదే ఆటతో ద్వారా అందరితో సమానమేనని చాటి చెబుతోన్న ఓ అమ్మాయితో ‘బీబీసీ’ మాట్లాడింది.

పంజాబ్‌లో దాదాపు పది లక్షల మంది మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారని అంచనా. రాజిందర్ సింగ్ అనే ఓ కుర్రాడు కూడా పదమూడేళ్లపాటు డ్రగ్స్‌కు బానిసయ్యాడు. అవి లేకపోతే జీవించలేననే స్థితికి వచ్చేశాడు.

అలాంటి సమయంలో ‘యూత్ ఫుట్‌బాల్ క్లబ్’ అతడి పాలిట వరంగా మారింది. మాదక ద్రవ్యాలకు బానిసైన రాజిందర్‌ను క్రమంగా ఫుట్‌బాల్ వైపు నడిపించింది. ఎలాగైనా ఆ అలవాటుకు దూరమవ్వాలని ప్రయత్నిస్తున్న రాజిందర్ త్వరగానే ఆటపైన ద‌ృష్టి పెట్టగలిగాడు.

ఫొటో క్యాప్షన్,

‘15ఏళ్ల వయసులో నేను డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టాను’

‘దాదాపు 13ఏళ్ల పాటు నేను డ్రగ్స్‌కి బానిసగా ఉన్నాను. 15ఏళ్ల వయసులో నేను డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టాను. డ్రగ్స్ తీసుకునే రోజుల్లో నాకు మరే పనీ చేయాలనిపించేది కాదు. గత ఆర్నెల్లుగా ఆ ప్రపంచం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడిప్పుడే భవిష్యత్తుపైన నాకు ఆశలు కలుగుతున్నాయి. నేనూ అందరిలా కలలు కనగలనని అనిపిస్తోంది’ అంటాడు రాజిందర్.

‘మా ఊళ్లో, చుట్టుపక్కల గ్రామాల్లో డ్రగ్స్ చాలా పెద్ద సమస్య. డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదని నేను నా అనుభవం ద్వారా గట్టిగా చెప్పగలను. అలవాటయ్యాక వాటిని వదిలిపెట్టడం అంత సులభం కాదు. కుర్రాళ్లు ఏదో ఒక ఆటలో భాగమవడం ద్వారా డ్రగ్స్‌కి దూరమవ్వొచ్చు. డ్రగ్స్ తీసుకునేవాళ్లు తమ కుటుంబం గురించి కూడా ఓసారి ఆలోచించాలి’ అని రాజిందర్ తన అనుభవాల్ని వివరిస్తూ యువతకు సలహాలిస్తున్నాడు.

రానున్న తరం వాళ్లు డ్రగ్స్ బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ‘యూత్ ఫుట్‌బాల్ క్లబ్’ అనే సంస్థ వాళ్లకు ఆటలో శిక్షణ ఇస్తోంది.

మరోపక్క అమ్మాయిల్లో ధైర్యం, సమానత్వ భావనను నూరిపోసేందుకు వాళ్లకూ ఫుట్‌బాల్ నేర్పిస్తోంది.

ఫొటో క్యాప్షన్,

‘అబ్బాయిలే ఇల్లు దాటి బయటకు వెళ్లాలనీ, అమ్మాయిలు వెళ్లకూడదనీ చెప్పేవారు’

ఫుట్‌బాల్ సాయంతో కాజల్ అనే 13 ఏళ్ల అమ్మాయి తన జీవనశైలిని మార్చుకుంది. ఫుట్‌బాల్ క్రీడాకారిణి కావాలన్న తన కలను నిజం చేసుకునే దిశగా అడుగేస్తోంది.

‘అమ్మాయిలు షార్ట్‌లు వేసుకోకూడదనీ, అబ్బాయిలు మాత్రమే ఫుట్‌బాల్ ఆడాలనీ గ్రామస్తులు ఆంక్షలు విధించేవారు. అబ్బాయిలే ఇల్లు దాటి బయటకు వెళ్లాలనీ, అమ్మాయిలు వెళ్లకూడదనీ చెప్పేవారు. కానీ నేను ఫుట్‌బాల్ ఆడటం మొదలుపెట్టిన రోజు నుంచి షార్ట్‌లు వేసుకుంటున్నా. అమ్మాయిలు కూడా ఫుట్‌బాల్ ఆడగలరని నిరూపించాలన్నది నా లక్ష్యం’ అంటుంది కాజల్.

గతేడాది వివాదాస్పదమైన 'ఉడ్తా పంజాబ్' అనే సినిమా ద్వారా పంజాబ్‌లో డ్రగ్స్ సంక్షోభం చర్చనీయాంశమైంది.

తొమ్మిది నెలల క్రితం పంజాబ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం.. డ్రగ్స్ సమస్యను 4 నెలల్లో పరిష్కరిస్తామని చెప్పింది.

కానీ ఇన్ని నెలలు గడిచినా పరిస్థితులు ఆశించినంతగా మారలేదన్నదే చాలామంది మాట.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)