మహాభారత యుద్ధానికి ద్రౌపది పట్టుదలే కారణమా?

  • సింధు వాసిని
  • బీబీసీ ప్రతినిధి
ద్రౌపది

ఫొటో సోర్స్, STAR PLUS/YOU TUBE GRAB

"ద్రౌపది, తన ఐదుగురు భర్తల్లో ఎవరి మాటా వినేది కాదు. తన స్నేహితుడైన శ్రీకృష్ణుడి మాట మత్రమే వినేది."

పై మాటలను, భారతీయ జనతా పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్ అన్నారు. ఆయన, ద్రౌపదిని ప్రపంచంలోనే మొట్టమొదటి ఫెమినిస్ట్‌గా అభివర్ణించారు. ఆమె పట్టుదల వల్లనే మహాభారత యుద్ధం జరిగిందని, దానిలో 18 లక్షల మంది చనిపోయారనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

రామ్ మాధవ్ వ్యాఖ్యలపై, సోషల్ మీడియాలో చాలామంది అసహనం వ్యక్తం చేశారు. ఎంతో మంది అతని వ్యాఖ్యలను అంగీకరించలేనివిగా, అనుచితమైనవిగానూ భావించారు.

ద్రౌపదిని ఫెమినిస్ట్ అనడం సరైనదేనా? ఫెమినిస్ట్ స్త్రీల లక్షణం భర్త మాట వినకపోవడమేనా?

ప్రముఖ రచయిత్రి అనితా నాయర్ మాటల్లో.. "నిజానికి, ద్రౌపది అసమానత్వం, అన్యాయం ఎదుర్కొన్న ఎందరో మహిళలకు ప్రతీక."

ఫొటో సోర్స్, Twitter

భర్త అంటే భార్యని అన్ని వేళలా రక్షించేవాడని ఒక నమ్మకం. కానీ ద్రౌపది విషయంలో జరిగింది ఏమిటి? అంతటి కౌరవ మహాసభలో ఆమెకి అవమానం జరుగుతుంటే, ఆమె ఐదుగురు భర్తలు తల వంచుకుని కూర్చున్నారు. ఒక్కరూ ఆమెని కాపాడడానికి ముందుకి రాలేదు.

అనితా నాయర్ రాసిన "What Draupadi Did to Feed Ten Thousand Sages" లో ద్రౌపదిని గొంతు విప్పే అవకాశం లేని నిస్సహాయురాలైన స్త్రీ గా అభివర్ణించారు.

"పై విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని చూస్తే ద్రౌపది ఫెమినిస్ట్ ఎలా అయ్యింది?" అని ఆవిడ అన్నారు. ద్రౌపది తన ఇష్టప్రకారమే ఐదుగురు భర్తలని పెళ్ళాడిందా?

ద్రౌపది, ఐదుగురు భర్తలను పెళ్ళాడడం గురించి రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Twitter

మొదటిది, అర్జునుడు స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకుని, తన నలుగురు సోదరులతో సహా కుంతి దగ్గరకు వచ్చినప్పుడు, ఏది లభించినా మీ ఐదుగురు సమానంగా పంచుకోండి అని ఆమె అంటుంది. తల్లి మాటలను శిరసావహిస్తూ పాండవులు ఐదుగురూ ద్రౌపదిని వివాహమాడతారు.

రెండవది, ద్రౌపది పూర్వజన్మలో శివుడిని ప్రార్థిస్తూ, వచ్చే జన్మలో తనకి సకల గుణసంపన్నుడు, మహా పరాక్రమవంతుడు అయిన భర్త లభించాలని కోరుకుంటుంది. ఇన్ని గొప్ప లక్షణాలు ఒకరిలో ఉండడం అసాధ్యం గనుక, శివుడు ఆమె కోరికను అంగీకరిస్తూ, సర్వలక్షణ సంపన్నులైన ఐదుగురిని తయారుచేశాడు.

ద్రౌపది ఐదుగురితోనూ ఒకే సమయంలో కాపురం చెయ్యలేదు. ఒక్కొక్కరితో ఒక్కో సంవత్సరం చొప్పున కాపురం చేసేది. ఒకరితో ఉన్నప్పుడు మిగిలిన నలుగురు ఆమె దరికి చేరడానికి వీల్లేదు.

అంతే కాదు, పురాణాల ప్రకారం ద్రౌపదికి ఓ అరుదైన వరం కూడా ఉండేదట. ఒక భర్తతో ఒక సంవత్సరకాలం పాటు సుఖించాక, ఆమెకు తన కన్యత్వం (virginity) తిరిగి వచ్చేస్తుంది.

ఫొటో సోర్స్, Twitter

నిజంగా నియమాలు, పద్ధతులు అందరికీ సమానమే అయితే, కన్యత్వం ఒక్క ద్రౌపదికే ఎందుకు వెనక్కు రావాలి? పాండవుల సంగతేమిటి?

అనితా నాయర్ మాటల్లో.. " ద్రౌపదిని ఫెమినిస్ట్‌గా కొనియాడిన రామ్‌ మాధవ్ మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక మహిళకు ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది భాగస్వాములు ఉండడం అనేది పూర్తిగా ఆమె వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సంబంధించిన విషయం. అలా ఎంచుకున్నంత మాత్రాన్నే ఎవరూ ఫెమినిస్టులు కాలేరు."

"రామ్ మాధవ్ మాటలబట్టి చూస్తే ఫెమినిస్టులు అనేవాళ్ళు అరాచకంగానూ, అధ్వాన్నంగానూ ఉంటూ, అన్నిచోట్లా సమస్యలు సృష్టిస్తూ ఉంటారని ఆయన భావిస్తున్నట్టు అనిపిస్తోంది.." అని ఆవిడ నవ్వుతూ అన్నారు.

ఫెమినిజం అనేది ఆడ-మగ సమానత్వం గురించి మాట్లాడుతుంది. ఇది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. అలాగే చరిత్రకు, పురాణాలకు మధ్య అంతరం తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.

అసలు మహాభారత యుద్ధానికి, ద్రౌపదే కారణమనడాన్ని వ్యతిరేకిస్తారు, "మిస్ ద్రౌపది కురు" రచయిత్రి త్రిషా దాస్.

ఫొటో సోర్స్, Getty Images

బీబీసీతో మాట్లాడుతూ ఆవిడ ఏమన్నారంటే.. "మహాభారత యుద్ధం అనేది అధికారం కోసం, రాజ్యం కోసం జరిగిన కొట్లాట, పురుషుల అహంకార ధోరణి వల్ల జరిగిందది. అంతే తప్ప ద్రౌపది వల్ల గానీ, ఇతర స్త్రీల వల్ల కానీ జరిగింది కాదు."

త్రిషా జోర్ దేకర్ మాటల్లో.. "ద్రౌపదిని, యుద్ధానికి కారణంగా భావించడం victim blaming, అంటే పీడితులనే దోషులుగా నిలబెట్టడం కిందకి వస్తుంది."

ఆవిడ ఇంకా ఏమన్నారంటే.. "కౌరవులు, పాండవుల మధ్య పంతాలకు ద్రౌపది బలైపోయింది. యుద్ధానికి ఆమెనే కారణం అనడం చాలా అన్యాయం."

మానసికంగానూ, భావోద్వేగాలపరంగానూ ద్రౌపది చాలా బలమైన వ్యక్తి. కానీ, మహాభారత యుద్ధానికి ఆవిడని కారణంగా చెప్పడం చాలా తప్పు అని చిత్ర భావించారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)