ప్రెస్‌ రివ్యూ: రెండు వేల నోటు ముద్రణ ఆగిపోయిందా?

  • 21 డిసెంబర్ 2017
Image copyright SAJJAD HUSSAIN
చిత్రం శీర్షిక రూ.2000 నోటు ముద్రణ ఆగిందా?

రూ.2000 నోటు ముద్రణ ఆగిందా అంటూ ఎస్‌బీఐ నివేదికను ఉటంకిస్తూ 'ఆంధ్రజ్యోతి' ఒక కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం...

రిజర్వ్‌ బ్యాంకు 2000 రూపాయల నోట్ల పంపిణీని తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు కనిపిస్తోందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఓ నివేదికలో వెల్లడించింది.

ఈ మధ్య లోక్‌సభలో ఆర్థిక శాఖ ప్రవేశపెట్టిన నివేదికను, రిజర్వ్‌బ్యాంకు వార్షిక నివేదికను పక్కపక్కన పెట్టి అధ్యయనం చేసినపుడు ఈ విషయం స్పష్టమయ్యిందని స్టేట్‌ బ్యాంక్‌ రిపోర్ట్‌ తెలిపింది.

ఆర్బీఐ, ఆర్ధిక శాఖ నివేదికల మధ్య రూ. 2463 బిలియన్‌ల తేడా వస్తోందని ఎస్‌బీఐ నివేదిక తేల్చింది. ఈ డబ్బు ఏమయిపోయిందని ఎస్‌బీఐ ప్రశ్నించింది.

రిజర్వ్‌బ్యాంకు వాటిని ప్రింట్‌ చేసి- చలామణీలోకి తీసుకురాకుండా ఆపిందా? అని ప్రశ్నించారు స్టేట్‌బ్యాంక్‌ ఈకోఫ్లాష్‌ రిపోర్ట్‌ నివేదికను రూపొందించిన బ్యాంకు ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్‌.

పోనీ ఈ రూ.2463 బిలియన్లను చిన్న నోట్ల రూపంలో ముద్రించి ఉంటారని భావించినా, రూ.2000 నోట్ల ముద్రణను ఆపినట్లుగా భావించవచ్చని ఘోష్‌ అభిప్రాయపడ్డారు.

లావాదేవీల్లో పెద్ద నోట్ల ద్వారా వివిధ రకాల సవాళ్ళు ఎదురవుతున్నాయని భావించి రిజర్వ్‌బ్యాంకు ఉద్దేశపూర్వకంగానే ఈ ముద్రణను ఆపి ఉండొచ్చని ఘోష్‌ పేర్కొన్నారు.

Image copyright facebook

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా బహుజన లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌

తెలంగాణలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా 30కి పైగా రాజకీయ పార్టీలు, సామాజిక, ప్రజా సంఘాలతో కలిసి బహుజన లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) ను ఏర్పాటు చేయబోతున్నట్టు 'నవతెలంగాణ' కథనం తెలిపింది.

ఫ్రంట్‌లో చేరాలని సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, కోదండరామ్‌లతో కూడా చర్చలు జరుపుతు న్నామని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు.

ఫ్రంట్‌ విధివిధానాలను జనవరి 28 తేదీన ప్రకటించబోతున్నట్టు ఆయన తెలిపారు.

ఖమ్మం జిల్లా వైరాలోని పర్సా సత్యనారాయణనగర్‌లో సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా 20వ మహాసభలు మంగళవారం ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా వైరాలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తమ్మినేని వీరభద్రం మహాసభల ప్రారంభోపన్యాసం చేశారు.

తెలంగాణ సామాజిక ప్రజాసంఘాల ఐక్య వేదిక (టీమాస్‌)కు సీపీఐ(ఎం)రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందన్నారు.

ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, దీనికి గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు.

గుజరాత్‌ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పట్టలేదని, మోడీ గ్రాఫ్‌ దిగజారిందని అన్నారు. ఈ తరుణం లోనే దేశంలో, రాష్ట్రంలో ఎర్ర జెండాకు తన సత్తా చూపించగల అవకాశం వచ్చిందన్నారు.

ఆర్థిక విధానాల పరంగా బీజేపీకి, కాంగ్రెస్‌లకు పెద్ద తేడా ఏమీ లేదన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లను గెలిపించటం, ఓడించటం కాదని, సీపీఐ(ఎం)ను గెలిపించేందుకు ప్రజల్లోకి వెళ్తామన్నారు.

తెలంగాణలో ఈసారి ఐదు, పది సీట్లల్లో కాకుండా 119 స్థానాల్లోనూ ఫ్రంట్‌ తరపున పోటీ చేస్తామన్నారు. 31 పార్టీలు ఫ్రంట్‌లోకి రావడానికి అంగీకరించాయన్నారు. ఇప్పటికే లెఫ్ట్‌ పార్టీలతో చర్చలు జరిపినట్టు తమ్మినేని చెప్పారని ఆ కథనం తెలిపింది.

Image copyright KTR/Twitter

కేటీఆర్ బిజినెస్ వరల్డ్ 'లీడర్ ఆఫ్ ది ఇయర్'

రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు ప్రతిష్ఠాత్మకమైన అర్బన్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నట్టుగా 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.

బుధవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి చేతులమీదుగా అవార్డు స్వీకరించారు.

పట్టణాభివృద్ధి, స్వచ్ఛత, మౌలిక సదుపాయాల కల్పన, ఉత్తమ నగరాలుగా ప్రతిభ కనబరిచిన సంస్థలకు, నగరాలకు, వ్యక్తులకు బిజినెస్ వరల్డ్ సంస్థ అవార్డులు ప్రకటించగా.. అందులో తెలంగాణకు రెండు అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే.

అర్బన్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మంత్రి కేటీఆర్ అందుకోగా, పట్టణాభివృద్ధికి మౌలిక వసతులు కల్పిస్తున్న రాష్ట్రంగా తెలంగాణకు దక్కిన మరో అవార్డును రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి నవీన్‌మిట్టల్ అందుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. మూడున్నరేండ్ల కిందట తెలంగాణలో విద్యుత్ లోటు ఉండేదని, పారిశ్రామిక, వ్యవసాయ, గృహావసరాలకు విద్యుత్ కొరత ఉండేదని పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలలోపే విద్యుత్ సమస్యను అధిగమించినట్టు తెలిపారు. 2018 జనవరి 1 నుంచి సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వగలిగే స్థాయికి ఎదిగామని మంత్రి చెప్పారు.

దేశంలో సాగుకు 24 గంటలపాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయగలిగిన తొలిరాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, విద్యుత్‌రంగంలో ప్రథమస్థానంలో ఉన్నదని, సోలార్ ద్వారా 3వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధిస్తున్నామని, మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని ఇంటింటికీ తాగునీరిచ్చే రాష్ట్రంగా తెలంగాణ నిలువనున్నదని మంత్రి కేటీఆర్ వివరించారని ఆ కథనం తెలిపింది.

Image copyright Reuters

వేధింపులకు ఫేస్‌బుక్ చెక్!

ఇక వేధింపులను నిలువరించేందుకు ఫేస్‌బుక్ సరికొత్త అస్త్రంతో ముందుకొచ్చిందని 'ఈనాడు' కథనం ప్రచురించింది.

అనవసర ''ఫ్రెండ్‌ రిక్వెస్టులు'' మన దరిచేరకుండా అడ్డకునేందుకు ఇది తోడ్పడుతుంది. మహిళలకు ఇది ఎంతగానో ఉపయోగపడే అవకాశముంది.

దిల్లీ, అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఫేస్‌బుక్‌ ఈ అస్త్రాన్ని సిద్ధంచేసింది.

నకిలీ ఖాతాలను వేగంగా గుర్తించి, తొలగించేందుకు ఈ సదుపాయం తోడ్పడే వీలుందని సంస్థ పేర్కొంది.

'అక్కర్లేని సందేశాలనూ అడ్డుకునేలా కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చాం. ఒకసారి దీన్ని యాక్టివేట్ చేస్తే సంబంధిత వ్యక్తి పంపిన సందేశాలపై ఎలాంటి నోటిఫికేషన్లూ రావు.

ఆ సందేశాలన్నీ ప్రత్యేక ఫోల్డర్‌లోకి వెళ్లిపోతాయని ఫేస్‌బుక్ పేర్కొంది.

సోఫియా Image copyright Arab News/YouTube

రోబోలతో జీవనం!

భవిష్యత్‌లో రోబోలు కీలకంగా మారబోతున్నాయని 'ఈనాడు' ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. దాని ప్రకారం..

ఉదయం నిద్ర లేచింది మొదలు అన్నింటా చేదోడు వాదోడుగా ఉండబోయేది రోబోలేనట.

భోజనాది కార్యక్రమాలతోపాటు ఆరోగ్యం బాగోకపోతే ఏ మందులు వేసుకోవాలో రోబోయే చెబుతుందట.

ముందుముందు పౌరహిత్యాలు, అంత్యక్రియల వంటి క్రతువులకూ వీటిని వినియోగించే రోజులు రాబోతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

నిన్నమొన్నటి వరకూ పరిశ్రమల్లో సంక్లిష్టమైన పనులు చేయటానికే పరిమితమైన రోబోలు ఇప్పుడు మన ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి.

అన్ని రకాల పనులూ చేయగలుగుతూ మనిషికి ప్రత్యామ్నాయంగా మారిపోతున్నాయి.

వంట పని, ఇంటి పని చేయటంతో పాటు చివరికి సెక్స్‌ రోబోలు కూడా వచ్చేస్తున్నాయి.

అయితే సౌలభ్యం సంగతి ఎలా ఉన్నా ఈ మార్పు భవిష్యత్తులో ఎటువంటి విపరీత పరిణామాలకు దారితీస్తుందోననే ఆందోళన ఇప్పుడు పలువురు శాస్త్రవేత్తల్లో వ్యక్తం అవుతోంది.

అన్ని పనులకూ రోబోలను తయారుచేయటం సమంజసం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

నంబి నారాయణన్: ఒక నకిలీ ‘గూఢచార కుంభకోణం’ ఈ సైంటిస్టు జీవితాన్ని ఎలా నాశనం చేసిందంటే..

అడవిలో తప్పిపోయి, 34 రోజులపాటు బెర్రీలు తింటూ ప్రాణాలు నిలబెట్టుకున్న తల్లీ పిల్లలు

కరోనా వైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...

నెలకు రూ.7 వేల వేతనం కోసం ప్రాణాలు పణంగా పెడుతున్న రైతు కూలీలు

అంతర్జాతీయ పోటీల్లో భారత్ పెట్టుకున్న ఆశల భారాన్ని మహిళా క్రీడాకారులు ఎలా మోస్తున్నారు

కరోనా వైరస్: చైనాలో 106కు చేరిన మరణాలు... ఇతర దేశాల్లో పెరుగుతున్న బాధితులు

ఆఫ్రికా: ప్రధాని భార్య హత్య మిస్టరీ... ఆరోపణల్లో కూరుకుపోయిన ప్రధాని థామస్, ఆయన రెండో భార్య

ఎయిర్ ఇండియా: రూ. 22,863 కోట్ల రుణ భారం సహా సంపూర్ణ విక్రయానికి ప్రభుత్వ నిర్ణయం