2జీ కుంభకోణం కేసు: ‘ఏడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా.. ఒక్క సాక్ష్యం లేదు’

  • 21 డిసెంబర్ 2017
రాజా Image copyright Getty Images

2జీ కుంభకోణం కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ దిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది. మాజీ టెలికం మంత్రి ఏ. రాజా, కనిమొళిలను నిర్దోషులుగా ప్రకటించినట్టు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

2008లో జరిగిన స్పెక్ట్రమ్ కేటాయింపులపై అనుమానాలు లేవనెత్తుతూ 2010లో కాగ్ వెలువరించిన నివేదిక నేపథ్యంలో 2జీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

2జీ కుంభకోణంలో... స్పెక్ట్రమ్ లైసెన్సుల కేటాయింపుల్లో వేలం వేయడానికి బదులు ఎవరు మొదట వస్తే వారికే అన్న పద్ధతిని అనుసరించారని కాగ్ నివేదిక తెలిపింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు దాదాపు ఒక లక్ష 76 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆ నివేదిక వెల్లడి చేసింది.

వేలం పద్ధతిలో లైసెన్సులు ఇచ్చినట్టయితే లక్షా 76 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సమకూరేదని అంచనా వేశారు.

అయితే నష్టాలపై కాగ్ వేసిన అంచనాలపై అనేక ఆరోపణలున్నాయి. ఇదొక పెద్ద రాజకీయ వివాదంగా ముందుకొచ్చింది. ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానంలో కూడా పిటిషన్ దాఖలు చేశారు.

కాగా, ఈ తీర్పును దిల్లీ హైకోర్టులో సవాల్ చేస్తామని సీబీఐ తెలిపింది.

Image copyright Getty Images

‘ఏడేళ్లు ఎదురుచూశా..’

"ఏడేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. సెలవు రోజుల్లోనూ పని చేస్తున్నాను. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడే కూర్చొని చట్టప్రకారం స్వీకరించదగ్గ సాక్ష్యాల కోసం నిరీక్షిస్తున్నాను. కానీ ఇంత వరకు ఒక్కటీ రాలేదు."

2జీ స్పెక్ట్రం కేసును విచారించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీ చేసిన వ్యాఖ్యలివి. తన తీర్పులో ఆయన వీటిని రాశారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)