ముద్రగడతో బీబీసీ ఇంటర్వ్యూ: చంద్రబాబు గారూ ఆనాడు కాపు ఆందోళనకు మద్దతిచ్చారు..మరి డబ్బెంత ఇచ్చారు?

  • పవన్ కోరాడ
  • బీబీసీ కోసం
ముద్రగడ పద్మనాభం
ఫొటో క్యాప్షన్,

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం

బ్రిటిష్ కాలం నుంచే తమకు రిజర్వేషన్లు ఉండేవని కాపు నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన కాపులకు బీసీ రిజర్వేషన్లు ఎందుకు అవసరమో చర్చించారు.

ఈ ముఖాముఖి పూర్తి పాఠం.

ప్రశ్న: కాపులకు రిజర్వేషన్ల అవసరం ఏంటి?

జవాబు: బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో 1915 నుంచే కాపులకు రిజర్వేషన్లు అమలులో ఉండేవి. ఆ రోజుల్లో దళితులకు, గిరిజనులకు, మూడో కేటగిరిలో కాపులకు రిజర్వేషన్లు ఉండేవి.

వాటిని తొలగించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నిస్తే డాక్టర్. బాబా సాహెబ్ అంబేడ్కర్ అడ్డుకున్నారు. వారి కృషి వల్ల ఆ రిజర్వేషన్లను తొలగించకుండా బ్రిటిష్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

అయితే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తీసివేయాలనుకున్నారు. తీసివేశారు.

ఆ తర్వాత 1961లో అప్పటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 'కాపులకు గోచీలు కూడా ఉండవే. వీళ్లు ఓసీలేంటి? వీళ్ల బతుకులు ఓసీ బతుకులా? చాలా కష్టాల్లో ఉన్నారు' అని అంటూ ఓ జీవో ద్వారా రిజర్వేషన్లను తిరిగి పునరుద్ధరించారు. అవి 1966 వరకూ కొనసాగాయి.

ఆ తర్వాత పునరుద్ధరించాలని కోరుతూ మా పెద్దలు ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. పోరాటాలు చేసి.. రోడ్డు మీదకి వచ్చీ అలసిపోయారు.

ఈ ఇంటర్వ్యూ వీడియోను ఇక్కడ చూడండి....

వీడియో క్యాప్షన్,

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రత్యేక ఇంటర్వ్యూ

నేను కూడా ఇరవై ఏళ్ల నుంచీ స్తబ్ధతగా ఉండిపోయాను. ఏ పార్టీనీ నమ్మలేక నిరాశ.. నిస్పృహలో మునిగిపోయిన సమయంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తూ హామీ ఇచ్చారు.

కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే బ్రిటిష్ కాలం నాటి రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామన్నారు.

అనేక బహిరంగ సభల్లో పదేపదే చెబుతుంటే నమ్మాము. తర్వాత మూడు నాలుగేళ్లు బాధపడ్డాం.

లాఠీల దెబ్బలు తిన్నాం. బూటు కాళ్లతో తన్నించుకున్నాం. కేసులు పెట్టించుకున్నాం.

తెలంగాణలో ఇలా జరగలేదు. ఎలాంటి ఆకలికేకలు, ఆందోళనలు లేకుండానే ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు అసెంబ్లీ, కౌన్సిల్‌లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన ఘనత వారిది.

ఇక్కడ మాత్రం ఎన్నో అవమానాలు పొందిన తర్వాత ఒక అడుగేశారు. అయినా మా జాతి సంతోషించింది. మా బతుకులు బాగుపడతాయన్న ఆశతో ఎదురు చూస్తోంది.

ప్రశ్న:ఈ అంశాన్ని ఇంతగా సాగదీయడానికి కారణం ఏంటని అనుకుంటున్నారు?

జవాబు: దాని మీద కామెంట్ చేయదలచుకోవట్లేదు.

ఆయన ఇచ్చిన హామీ నీరుగారిపోతుంటే, మేమంతా రోడ్లపైకి వచ్చే పరిస్థితి వారే కలగజేశారు. అనుభవమున్న ముఖ్యమంత్రిగా అలా చేయకూడదు.

ఇన్నాళ్లూ సాగదీయడానికి కారణం ఏమిటో మీరు వారినే అడగాలి.

ప్రశ్న: రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని సుప్రీంకోర్టు చెప్పింది. 2014లో హరియాణా నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది.అడ్డంకినిఎలా దాటగలరు?

జవాబు: న్యాయపరంగా అన్నీ తెలుసుకునే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి ఉంటారని అనుకుంటున్నా. ఈ సమస్యను అధిగమించే అపారమైన అనుభవం, సమర్థత ఉన్నాయి. ఆ చిత్తశుద్ధిని నిరూపించుకునే దిశగానే ఓ అడుగు వేశారు.

వారికి బీజేపీతో బంధాలున్నాయి. తలచుకుంటే సులువుగానే ఈ సమస్యను పరిష్కరించగలరు.

న్యాయపరంగా అవాంతరాలు వస్తాయని ఆయనకు తెలుసు. వాటిని ఎలా అధిగమించాలో కూడా ఆయనకు తెలుసు.

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్,

కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, ఇతర మంత్రులు

ప్రశ్న: తన ప్రమేయం లేకుండా కమిటీలోని ఇతర సభ్యులు ఇచ్చిన రిపోర్టు చట్టపరంగా చెల్లదని మంజునాథ్ అన్నారు. దీనిపై మీరేమంటారు?

జవాబు: ముఖ్యమంత్రి చేస్తామన్నారు. ఒక అడుగేశారు. చేయకపోతే ఆయన పరువే పోతుంది.

ప్రశ్న: మీరు పెట్టిన డెడ్ లైన్ మార్చి 31లోగా హామీ నెరవేరకపోతే, మీ తదుపరి కార్యాచరణ ఏంటి?

జవాబు: రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న జేఏసీ సభ్యలతో చర్చించి కార్యాచరణ నిర్ణయిస్తాం.

ప్రశ్న: ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్న కాలంలో, రిజర్వేషన్లు మీకు ఎలా ఉపయోగపడతాయి?

జవాబు: ఉన్న ఉద్యోగాల్లోనే ఎన్ని వస్తే అన్ని పంచుకుంటాం. మా కేటగిరీకి ఎన్ని వస్తే అన్ని తీసుకుంటాం. తెలంగాణలో మాధిరిగా ఆంధ్రప్రదేశ్‌లోనూ జిల్లాలను పెంచాల్సిన అవసరం ఉంది. పెంచితే కొత్త ఉద్యోగాలు చాలా వస్తాయి.

ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం హయాంలో వేల ఉద్యోగాలు భర్తీ చేశారు. రిజర్వేషన్లు లేక వాటిలో అవకాశాలు కోల్పోయాం. వచ్చే ఎన్నికల్లోపు మరో పది, పదిహేను వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

ప్రశ్న:మీకు చిరంజీవి మద్దతు ఎలా ఉంది?

జవాబు: చిరంజీవి మాత్రమే కాదు, దాసరి నారాయణరావు కూడా మాకు ఎప్పుడూ భరోసా ఇస్తూ ఉండేవారు. ఆయన మాకు కొండంత అండ. ఓ పెద్ద పులిలా మా ఉద్యమానికి వారు అండగా నిలిచారు.

ఇంకా పలువురు సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, మాజీ ఉన్నతాధికారులు కూడా మా వెనక ఉన్నారు.

ఫొటో సోర్స్, Janasena Party/Facebook

ప్రశ్న:పవన్ కల్యాణ్ మద్దతు ఎలా ఉంది?

జవాబు: పవన్ కల్యాణ్ ఎప్పుడూ మాకు మద్దతు తెలపలేదు. కానీ, ఇటీవల కాపులకు బీసీ రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందేనని, ఒక వేళ ఇవ్వకుంటే అందుకు కారణం చెప్పాలని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నా.

ప్రశ్న: వైకాపా నేత కరుణాకర్ రెడ్డి మిమ్మల్ని కలిశారని, కాపుల ఓట్లను చీల్చేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని అధికార పక్షం అంటోంది. మీరేమంటారు?

జవాబు: నాకు అన్ని పార్టీల్లోనూ స్నేహితులున్నారు. అన్ని పార్టీల్లోనూ పనిచేశాను. 1994లో ఉద్యమం ప్రారంభమైంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఉద్యమం నడిపాను. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుతో పాటు, ఆయన పార్టీ నేతలంతా నాకు మద్దతు తెలిపారు.

ఇప్పుడు జగన్ దగ్గర డబ్బు తీసుకుని నేను ఉద్యమం నడుపుతున్నానని ఆరోపణలు చేస్తున్నారు. మరైతే, 1994లో చంద్రబాబు నాకు డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదు కదా.

ప్రశ్న:మీరు మంత్రిగా ఉన్నప్పడు ఆఫీసు బయట 'కాపులకు ప్రవేశం లేదు' అని బోర్డు పెట్టేవారట. నిజమేనా?

జవాబు: ఇవన్నీ ఉద్యమాన్ని నీరుగార్చాలని, పక్కదారి పట్టించాలని చేసే ప్రయత్నాలు.

జగన్ దగ్గర నేను డబ్బులు తీసుకోకున్నా, తీసుకున్నాడని అంటున్నారు. జగన్ సలహాతో ఉద్యమం చేస్తున్నాడని ఆరోపణలు చేస్తున్నారు. జగన్ వయసెంత? నా వయసెంత?

నా రాజకీయ జీవితమంత లేదు జగన్ వయసు.

ఒక వ్యక్తిని ఉద్యమం నుంచి పక్కకు తప్పించడం కోసం.. అవమానిస్తే, ఆరోపణలు చేస్తే.. పక్కకు పోతాడని.. ఈ తలపోటు తగ్గిపోతుందని చేసిన కుట్ర ఇది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)