#MeetToSleep: దిల్లీ అమ్మాయిలు పార్కుల్లో ఒంటరిగా ఎందుకు పడుకుంటున్నారు?

  • పద్మ మీనాక్షి
  • బీబీసీ ప్రతినిధి
#మీట్‌టూస్లీప్

ఫొటో సోర్స్, Blanknoise/Twitter

నిర్భయ రేప్ జరిగి డిసెంబర్ 16 నాటికి సరిగ్గా 5 సంవత్సరాలు. కానీ ఈ భయానక సంఘటన జ్ఞాపకాలు మాత్రం ప్రతి ఒక్కరిలో వణుకు పుట్టిస్తాయి.

ఆ తర్వాత దేశవ్యాప్తంగా మహిళ రక్షణపై నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మహిళలకు భద్రత పెరిగిందా? అన్నది పక్కన పెడితే , మహిళలు గొంతు వినిపించే అవకాశం మాత్రం మెరుగైందని చెప్పుకోవచ్చు. నిర్భయ చట్టం పటిష్టం చేయడం ఇందుకు ఒక ఉదాహరణ.

నిర్భయ అత్యాచార సంఘటన జరిగి ఐదేళ్లు గడిచిన నేపథ్యంలో దిల్లీలో కొన్ని స్వచ్చంద సంస్థలు #మీట్టూస్లీప్ క్యాంపెయిన్‌ నిర్వహించాయి.

ఇందులో భాగంగా మహిళలు పబ్లిక్ పార్కుల్లో ఒంటరిగా పడుకుని, మహిళలకి కూడా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని తెలియచేశారు.

ఫొటో సోర్స్, Breakthrough

"గృహిణిగా, తల్లిగా, ఉద్యోగస్థురాలిగా.. మహిళ ఇప్పటికే చాలా బాధ్యతలు మోస్తుంది. ఇవి కాక, నన్ను నేను సంరక్షించుకునే బాధ్యత కూడా మోయాలంటే నాకు చాలా కష్టం’’ అని వ్యాఖ్యానించారు 22 సంవత్సరాలుగా దిల్లీ లో ఉంటున్న సోహిని.

"ఒక అమ్మాయి ఒంటరిగా రెస్టారంట్‌కి వెళితేనే తప్పుగా చూసే మనుషులు ఉన్న పరిస్థితుల్లో, ఒంటరిగా ఒక పబ్లిక్ పార్క్ లో పడుకోవడానికి రావడమనేది నిజంగా సాహసమే. కానీ ఈ ప్రయత్నాన్ని నేను సమర్థిస్తాను" అని ఆమె అన్నారు.

పబ్లిక్ పార్కుల్లో పడుకోవడం ఎంత వరకు సురక్షితం అని అడిగినపుడు.. "ఇదే పనిని రాత్రి చేస్తే ఎలా ఉండేదో నాకు తెలియదు, కానీ పగలు కాబట్టి నాకు ఏమి ఇబ్బంది అనిపించలేదు. కాకపోతే సమాజం ఆమోదం దొరకడం కష్టం" అని అభిప్రాయపడ్డారు.

"దిల్లీ పూర్తిగా సురక్షితం అని చెప్పలేను, అలా అని సురక్షితం కాదని కూడా తీర్మానించలేను" అని అంటారామె.

ఫొటో సోర్స్, Blanknoise/Twitter

‘ఆ గిరిజన మహిళ చాలా స్వేచ్ఛగా జీవిస్తోంది’

బర్ష చక్రబర్తి మాట్లాడుతూ.. "నేను చిన్నపుడు ఒడిశాలోని మల్కాన్‌గిరి అనే ఒక గిరిజన ప్రాంతానికి వెళ్లినప్పుడు, అక్కడ అటవీ ప్రాంతంలో స్వేచ్ఛగా నిద్రపోతున్న మహిళని చూశాను. దిల్లీ వీధుల్లో నడుస్తూ ఆ సంఘటన గుర్తు తెచ్చుకున్నప్పుడు.. అంత స్వేచ్ఛ ఈ నగరంలో నేను తీసుకోలేనని అనిపించింది. నాకెందుకో ఆ గిరిజన మహిళ చాలా స్వేచ్ఛగా జీవిస్తుందని అనిపించింది. నేను కూడా అలా జీవించాలని కోరుకుంటున్నాను. పార్కులో పడుకోవడం ఇబ్బందిగానే ఉంది కానీ, నాతో పాటు స్నేహితులు ఉండటం వల్ల పెద్దగా భయపడలేదు. ఇదే పనిని ఒంటరిగా చేయమంటే చేయగలనో లేదో తెలియదు’’ అన్నారు.

రక్షణ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారని అడిగినపుడు.. హెల్ప్‌లైన్ నెంబర్‌లు తనతో ఉంచుకోవడంతో పాటు సురక్షితంగా ఉండే రవాణా మార్గాన్ని ఎంచుకోవడం, రద్దీగా ఉండే ప్రాంతాలలోకి వెళ్లడం మానుకోవడం వంటివి చేస్తానని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Breakthrough

‘నేను నా లాగా, ఒక వ్యక్తిగా.. స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటున్నా’

‘‘ఒక మహిళగా పార్కులో నిద్రపోవడం అంటే అంత సౌకర్యంగా ఉండే ఆలోచన ఏమి కాదు. నాకు చాలా కష్టంగా అనిపించింది పార్క్‌లో పడుకోవడానికి. కానీ, నాలో దాగి ఉన్న భయాలను పారద్రోలడానికి ఇదొక ప్రారంభం మాత్రమే! పూర్తిగా భయం పోయేవరకు ప్రయత్నిస్తూ ఉంటాను’’ అని రిచా సింగ్ అన్నారు.

నిజంగా ఏదైనా ఆపద సంభవిస్తే ఆ సమయానికి నేను ఏ హెల్ప్‌లైన్‌కి కాల్ చేయాలి? ఎవరి సహాయం తీసుకోవాలి? దాడి చేసిన వ్యక్తిని ఎలా ఎదుర్కోవాలి? అనే ఆలోచన వస్తుందో రాదో కూడా తెలియదని రిచా సింగ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

"అమ్మాయి జాగ్రత్తగా ఎలా ఉండాలో చెప్పే మాటలు విని విని అలిసిపోయాను. ఈ హెల్ప్‌లైన్ నెంబర్‌లు గుర్తు పెట్టుకోవడం.. పెప్పర్ స్ప్రే ని బ్యాగ్‌లో ఉంచుకోవడం.. ఇవన్నీ నేను చేయలేను. నేను స్వేచ్ఛగా బతకాలనుకుంటున్నా.. అదనపు బరువులు ఏమీ లేకుండా.. సురక్షితంగా.. నేను నా లాగా.. ఒక వ్యక్తిగా" అని అనిక వర్మ అన్నారు.

ఫొటో సోర్స్, Blanknoise/Facebook

‘..కాస్త టెన్షన్‌తోనే పడుకున్నాను’

"ఇక్కడ పడుకున్నా.. కానీ, నాకు చాలా టెన్షన్ ఉంది. నా డ్రెస్ సరిగ్గా ఉందో లేదో.. దారిన వెళ్లే వాళ్ళు నన్ను చూస్తున్నారేమో.. ఎవరైనా నా శరీరంపై చేయి వేస్తారేమో అని... కాస్త టెన్షన్‌తోనే పడుకున్నాను. కాకపోతే, కాసేపు మాత్రం గాఢ నిద్ర పట్టింది. ఇదొక ప్రయత్నం మాత్రమే. మహిళల స్వేచ్ఛ, రక్షణ దిశగా‌‌’’ అని గురుగ్రామ్‌కి చెందిన కృతి అన్నారు.

ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా వ్యవహరించిన జాస్మీన్ పతేజ మాట్లాడుతూ.. మహిళకి కూడా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని తెలియచేసే ప్రయత్నమే #మీట్‌టూస్లీప్ అని తెలిపారు. పబ్లిక్ స్థలాలు పురుషుడికి మాత్రమే కాదు.. స్త్రీకి కూడా సమాన స్వేచ్ఛని ఇచ్చేవిగా ఉండాలని మహిళలంతా కలిసికట్టుగా చేసిన ప్రయత్నమే అని చెప్పారు.

మహిళలకు ఉన్న భయాలను ధైర్యంగా ఎదుర్కొనేందుకు, రక్షణ అవకాశాలు కల్పించుకునేందుకు ఇదొక అవకాశమని అభిప్రాయపడ్డారు.

పబ్లిక్ పార్క్‌లో ఒక అమ్మాయి ఒంటరిగా సేదతీరటం అనే చిన్న విషయాన్ని తప్పుగా చూసే సమాజపు పోకడ మారాలని కాంపెయిన్ నిర్వాహకుల్లో ఒకరైన అనురాగ్ అన్నారు.

అసలు అమ్మాయిలే ఎందుకు ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకీ వివక్ష అని ఆయన బాధను వ్యక్తం చేశారు. మహిళలకి ఉండే సమస్యలు అందరికి అర్థం కావని అన్నారు. ఇటువంటి చిన్న ప్రయత్నాలు మహిళల లోపల దాగి ఉన్న భయాలను రూపుమాపడానికి పనికి వస్తాయని అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Breakthrough

ఫొటో క్యాప్షన్,

అనురాగ్

నిర్భయ చట్టం - పకాలు

- 2013 ఏప్రిల్ 2వ తేదీన నిర్భయ చట్టం అమలులోకి వచ్చింది.

- ఈ చట్టం కింద సుమారు రూ.3000 కోట్ల నిధులు కేటాయించారు.

- మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ చట్టం కింద మూడు పథకాలను ప్రవేశపెట్టింది.

- దేశవ్యాప్తంగా 84 వన్ స్టాప్ సెంటర్లు నెలకొల్పారు. న్యాయ, చట్టం, వైద్యం, కౌన్సిలింగ్ సేవలు ఒకే చోట అందించేందుకు ఇవి ఉపయోగపడతాయి.

- మహిళల కోసం కేంద్రీకృత హెల్ప్‌లైన్‌ను 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రారంభించాయి.

- మహిళా పోలీస్ వలంటీర్‌లు పలు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్‌లు నిర్వహిస్తున్నారు.

సెక్యూరిటీ యాప్‌ల వివరాలు

దిల్లీ:

- హిమ్మత్ యాప్. ఇది ఇంగ్లీష్, హిందీల్లో లభ్యమవుతుంది. గూగుల్ యాప్‌ స్టోర్ లేదా దిల్లీ పోలీసు వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు

- ఆపదలో ఉన్న మహిళల కోసం హెల్ప్‌లైన్ నెంబర్ 1091

ఆంధ్రప్రదేశ్:

- అభయం యాప్. ఇది ఇంగ్లీష్‌లో లభిస్తుంది. ఆపదలో ఉన్న వారి ప్రదేశాన్ని జీపీఎస్ ద్వారా కనుగొని, వారి సంబంధీకులకు సమాచారాన్ని అందిస్తుంది. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కూడా సందేశం పంపిస్తుంది.

- ఆపదలో ఉన్న మహిళల కోసం హెల్ప్‌లైన్ నెంబర్ 1091

తెలంగాణ:

- హాక్ ఐ. ఈ యాప్ ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలు, నేరాలు, మహిళలపై జరిగే నేరాలు రిపోర్ట్ చేయవచ్చు.

- హైదరాబాద్‌ షీ టీం హెల్ప్ లైన్ నెంబర్ 100.

- ఆపదలో ఉన్న మహిళల కోసం హెల్ప్‌లైన్ నెంబర్ 181

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)