ఈతగాడు: 300 సార్లు ఎముకలు విరిగాయి.. ఈతలో 23 స్వర్ణాలు వచ్చాయి

  • 22 డిసెంబర్ 2017
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionతుమ్మినా ఎముకలు విరుగుతాయి.. అయినా ఈతలో ఛాంపియన్

ఒక్క ఎముక విరిగితేనే నొప్పిని తట్టుకోలేం. అలాంటిది మోయిన్ శరీరంలో 300కు పైగా ఫ్రాక్చర్లున్నాయి. అయినా అతడు కుంగి పోకుండా ఈత కొలనులో దిగాడు. దేశ విదేశాల్లో జరిగిన పోటీల్లో 23 బంగారు పతకాలు గెలుచుకున్నాడు.

గట్టిగా తుమ్మినా చాలు.. మోయిన్ శరీరంలో ఎముకలు విరిగిపోతాయి. అలాంటి కుర్రాడు ప్రస్తుతం ఈత కొలనులో సంచలనాలు సృష్టిస్తున్నాడు. జాతీయ అంతర్జాతీయ స్థాయి 50మీటర్ల ఈత పోటీల్లో పాల్గొంటూ దేశానికి పతకాలు తెస్తున్నాడు.

కర్ణాటకలోని బెల్‌గావ్ మోయిన్ స్వస్థలం. ఆస్టియోజెనిసిస్ ఇంపర్ఫెక్టా అనే అరుదైన వ్యాధితో అతడు జన్మించాడు. అందుకే అతడి ఎముకలు చాలా సున్నితంగా ఉంటాయి. చిన్నపాటి గాయాలకే అవి విరిగిపోతాయి. అతడి ఎదుగుదల కూడా ఆగిపోయింది.

అందరిలా జీవించలేనేమోనని భయపడే మోయిన్‌కి తన సత్తా నిరూపించుకోవడానికి ఈత కొలనే వేదికైంది. కోచ్ ఉమేష్ సాయంతో అతడు ప్రొఫెషనల్ స్విమ్మర్‌గా ఎదుగుతున్నాడు.

చిత్రం శీర్షిక 'బయట ఉంటేనే నాకు రిస్క్ ఎక్కువ. ఈత కొలనులో చాలా సేఫ్‌గా అనిపిస్తుంది'

‘మొదటిసారి నేను ఈత పోటీల్లో పాల్గొన్నప్పుడు గెలవలేననీ, ఈదలేక మునిగిపోతాననీ అనుకున్నా. చూసేవాళ్లు నా గురించి ఏమనుకుంటారోనని భయపడ్డా. కానీ ఉమేష్ సార్‌ని కలిశాక నా ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆయన దగ్గర శిక్షణ తీసుకొని పాల్గొన్న తొలి ఈత పోటీలోనే రెండు బంగారు పతకాలు గెలుచుకున్నా’ అంటాడు మోయిన్.

పదో తరగతి పూర్తిచేసిన మోయిన్, బీ.కాం. పాసవ్వడమే తన లక్ష్యం అంటున్నాడు. మరోపక్క ఒలింపిక్స్, కామన్ వెల్త్ గేమ్స్‌లో పాల్గొని పతకాలు సాధించాలన్నది అతడి కోరిక.

తల్లి కౌసర్ ప్రోత్సాహంతోనే తనకిన్ని విజయాలు సాధ్యమయ్యాయని మోయిన్ చెబుతాడు. ‘మా ఇంటికీ స్విమ్మింగ్ పూల్‌కీ 14కి.మీ. దూరం. రోజూ మూడు బస్సులు మారి అక్కడికి వెళ్లాలి. ఆ ప్రయాణం నాకు చాలా రిస్క్. కానీ అమ్మ జాగ్రత్తగా నన్ను తీసుకొస్తుంది’ అని మోయిన్ చెబుతాడు.

‘20ఏళ్లు వచ్చినా ఇప్పటికీ మోయిన్‌ని చంటి పిల్లాడిలా జాగ్రత్తగా చూసుకోవాలి. తన ఎముకలు చాలా సున్నితంగా ఉంటాయి. అందుకే నిత్యం అప్రమత్తంగా ఉండాలి’ అంటారు మోయిన్ తల్లి కౌసర్.

చిత్రం శీర్షిక చిన్నపాటి గాయాలకే మోయిన్ ఎముకలు విరుగుతాయి

కొడుకుకి చికిత్స చేయించాలని కౌసర్ ఎంతోమంది వైద్యుల్ని సంప్రదించినా అది సాధ్యపడలేదు. ‘మోయిన్ చికిత్స కోసం చాలామంది వైద్యుల్ని కలిశాను. ఎవరూ తన వ్యాధికి పరిష్కారం చూపలేకపోయారు. కొంతమందైతే తను మూడు నాలుగేళ్లకంటే ఎక్కువ బతికే అవకాశం లేదని చెప్పారు’ అని ఆ బాధను ఆమె తెలియజేస్తారు.

‘మోయిన్ నేలపై ఉంటే వీల్ చైర్ కావాలి. కానీ నీళ్లలో మాత్రం అతడు చేపలా కదుల్తాడు’ అని గర్వంగా చెబుతారు అతడి కోచ్ ఉమేష్.

‘ఓసారి మోయిన్‌ని అమెరికాలోని పోర్టో రికోలో ఓ పోటీలో పాల్గొనడానికి తీసుకెళ్లాం. దానికోసం మూడు విమానాలు మారాల్సొచ్చింది. ఆ సమయంలో అతడికి రెండు సార్లు గాయాలై ఎముకలు విరిగాయి. అయినా మోయిన్ బ్యాండేజ్ వేసుకొని పోటీలో పాల్గొని దేశానికి పతకాన్ని తెచ్చాడు’ అని శిష్యుడి ఘనతను వివరిస్తారు కోచ్ ఉమేష్.

‘బయట ఉంటేనే నాకు రిస్క్ ఎక్కువ. ఈత కొలనులో చాలా సేఫ్‌గా అనిపిస్తుంది’ అన్నది మోయిన్ మాట.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)