ఎంపీలకు ప్రత్యేక కోర్టులు ఎందుకు?

  • 22 డిసెంబర్ 2017
నరేష్ అగర్వాల్ Image copyright RSTV/youtube

నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎంఎల్ఏల కోసం ప్రత్యేక కోర్టులు ఎందుకు నియమించాలి? అని సమాజ్‌వాది పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ ప్రశ్నిస్తున్నారు. రాజ్యసభ శీతాకాల సమవేశాల్లో ఈ సమస్యను లేవనెత్తారు.

ఎంపీలు, ఎంఎల్‌ఏలపై నేరారోపణ కేసులను త్వరితగతిన విచారించటానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనున్నామని కేంద్ర ప్రభుత్వం గతవారం సుప్రీంకోర్టులో ప్రమాణపత్రం సమర్పించింది.

దీనిపై రాజ్యసభలో చర్చ సందర్భంగా సమాజ్‌వాది పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ తన అభ్యంతరాన్ని లేవనెత్తారు.

Image copyright RSTV/ Youtube

ఆయన ఉద్దేశం ప్రకారం.. ‘‘న్యాయవ్యవస్థ ముందు ప్రభుత్వం తలవంచాల్సిన అవసరం లేదు’’. రాజ్యాంగంలోని 14వ అధికరణను ప్రస్తావిస్తూ.. ‘‘దీని ప్రకారం మనమందరం సమానమే, 15వ అధికరణ ప్రకారం జాతిభేదాల వలన ఎవరూ వివక్షకు గురికారాదు’’ అని ఆయన పేర్కొన్నారు.

‘‘ఎంపీలు, ఎంఎల్ఏలు అందరూ ఒక జాతి అని నేను విశ్వసిస్తాను. కానీ, నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎంఎల్ఏల కోసం కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాతిపదిక మీద వేరే కోర్టుని నియమిస్తుంది? దీనికోసం ముందుగా రాజ్యాంగ సవరణ చేయాల్సివస్తుంది" అని ఆయన వ్యాఖ్యానించారు.

నరేష్ అగర్వాల్, తన అభిప్రాయానికి ఒక ఘాటైన వాదనను జతచేశారు. ‘‘దేశంలో ఉగ్రవాదుల కేసులను విచారించటానికి ప్రత్యేకమైన కోర్టులు లేనప్పుడు, ఎంపీలు, ఎంఎల్ఏలకు మాత్రం ఎందుకు?’’ అని ప్రశ్నించారు.

రాజ్యసభ ఎన్నికలలో భాగంగా సమర్పించిన అఫిడవిట్ ప్రకారం నరేష్ అగర్వాల్ మీద ఎటువంటి నేరారోపణలు లేవు.

Image copyright Getty Images

ఈ విషయం న్యాయస్థానానికి ఎలా చేరింది?

ఈ మొత్తం విషయం గురించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది అశ్విని ఉపాధ్యాయతో బీబీసీ మాట్లడింది.

‘‘ఎంపీలు, ఎంఎల్ఏలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు, వాళ్ళకి ప్రత్యేక కోర్టులు మాత్రం ఎందుకుండకూడదు?" అని అశ్విని ఉపాధ్యాయ వాదిస్తున్నారు.

ఆయన వాదన ప్రకారం.. దేశంలో 1,500 మందికి పైగా ఎంపీలు, ఎంఎల్ఏలపై నేరారోపణలు ఉన్నాయి. ఇందులో లాలూయాదవ్, మధుకోడా, సురేష్‌కల్మాడి తదితర మాజీ మంత్రుల పేర్లు లేవు. అవి కూడా చేర్చితే ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది.

అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ ఇచ్చిన నివేదికను కూడా అశ్విని ఉపాధ్యాయ తన వాదనకు మద్దతుగా జతచేశారు. ‘‘ఖచ్చితంగా ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేయాలనే అంశంపై నా వాదన వినిపించడానికే నేను కోర్టు ముందుకెళ్ళాను" అని ఆయన చెప్పారు.

Image copyright Ashwini Upadhyay

కేంద్ర ప్రభుత్వ వాదన ఏమిటి?

ఈ మొత్తం విషయంలో సుప్రీంకోర్టు వైఖరికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించింది. దాని ప్రకారం 12 ప్రత్యేక కోర్టులను రూపొందించి, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల పద్ధతిలో నడిపి, నేరారోపణలు ఉన్న మంత్రులందరి కేసులని త్వరితగతిని విచారించాలి.

అంతేకాదు.. మొత్తం 1,581 కేసులను విచారించటానికి ఒక సంవత్సర కాలం గడువును కూడా కేంద్ర ప్రభుత్వం విధించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటులో ఎటువంటి చట్టపరమైన ప్రక్రియా అవసరం లేదని కూడా పేర్కొంది.

Image copyright ADR

నేరారోపణలున్న ప్రజాప్రతినిధులు

అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం 2014లో లోక్‌సభకు ఎంపికైన 542 మంది ఎంపీల్లో 185 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే దేశంలోని 34 శాతం మంది ఎంపీలపై నేరారోపణలు ఉన్నాయి.

ఇదే నివేదిక ప్రకారం ఆ 185 మందిలో 112 మందిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి.

2009లో నేరారోపణలున్న మంత్రుల సంఖ్య 158 గా నమోదయ్యింది. అది ఇప్పటి సంఖ్య కంటే కొంత తక్కువ.

రాష్ట్రాలపరంగా చూస్తే, అధిక నేరారోపణలు కలిగిన మంత్రులు మహారాష్ట్ర నుండి ఉన్నారు. రెండో స్థానంలో ఉత్తర‌ప్రదేశ్, మూడో స్థానంలో బీహార్ ఉన్నాయి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)