ప్రెస్ రివ్యూ : ఫోర్బ్స్ జాబితాలో సల్మాన్ ముందు.. తర్వాత రాజమౌళి

దీపిక పడుకోన్, ప్రియాంక చోప్రా

ఫొటో సోర్స్, Getty Images

ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో వంద మంది అత్యధిక సంపాదనాపరుల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించిందని సాక్షి దిన పత్రిక ఓ కథనంలో పేర్కొంది. ఈ కథనంలో..

ఈ జాబితాలో రాజమౌళి 15వ స్థానం దక్కించుకుంటే ప్రభాస్ 22వ స్థానం దక్కించుకున్నారు. ఇక రానా 36వ స్థానంలో నిలిచారు.

మహేశ్ బాబు 37వ స్థానం, పవన్ కల్యాణ్ 69, అల్లు అర్జున్ 81 స్థానాల్లో నిలిచారు.

అయితే.. సల్మాన్ ఖాన్ మొదటి స్థానం సంపాదించారు. తర్వాతి స్థానాల్లో షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్ వరుసగా 2, 4, 6 స్థానాల్లో నిలిచారు.

ఇక ప్రియాంక చోప్రా 8, దీపికా పదుకొనె 11 స్థానాల్లో నిలిచారు. తమిళ హీరోలు సూర్య 25, విజయ్ 31 స్థానాలు దక్కించుకున్నారని సాక్షి కథనం.

ఫొటో సోర్స్, Getty Images

14,300 ఉపాధ్యాయ పోస్టులు

ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించిన ఓ వార్తాకథనాన్ని ఈనాడు దినపత్రిక ప్రచురించింది. ఆ కథనంలో..

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో భర్తీ చేయనున్న ఉపాధ్యాయుల ఖాళీల సంఖ్య 14,300గా తేలింది.

ఈ నెల 6న డీఎస్సీ ప్రకటన సందర్భంగా వెల్లడించిన 12,370 పోస్టులకు అదనంగా 1,930 ఉద్యోగాలు చేరాయి. మొత్తం ఉద్యోగాల్లో 4,101 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి లభించాల్సి ఉంది.

ఖాళీలపై విద్యాశాఖ కార్యాలయంలో శుక్రవారం జిల్లా విద్యాధికారులతో కమిషనర్ సంధ్యారాణి సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీలు ఎన్ని ఉన్నాయో తేలినప్పటికీ, రిజర్వేషన్ విభాగం, ఇతర ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంది. ఆదర్శ పాఠశాలల్లో నేరుగా నియామకాలకు 938 ఖాళీలున్నట్లు ఆ విభాగం లెక్క తేల్చింది.

మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేసిన డీఎస్సీ షెడ్యూల్ ప్రకారం 1,197 ఖాళీలున్నట్లు ప్రకటించారు.

ఆదర్శ పాఠశాలల నిర్వహణను కేంద్రం ఈ ఏడాది నుంచి రాష్ట్రానికి అప్పగించింది.

వీరికి ప్రత్యేకంగా సర్వీసు నిబంధనలు రూపొందించి పదోన్నతులు కల్పించాలా? లేదా రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలా? అనే అంశాలపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు.

ఫొటో సోర్స్, Telangana CMO

'శాలరీ ప్యాకేజీ'

'శాలరీ ప్యాకేజీ' పేరిట ఆంధ్రజ్యోతి తెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో..

ఉద్యోగులు.. తమ ఖాతాలో నగదు లేకున్నా ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవచ్చు.. రెండు నెలల వేతనాన్ని ముందస్తు రుణంగా పొందొచ్చు. గృహ, విద్యా రుణాలు, లాకర్ల వంటి సౌకర్యాల్లో రాయితీలు పొందొచ్చు.

వీటన్నిటికీ తోడు ప్రీమియం చెల్లించకుండానే బీమా పరిధిలోకి రావచ్చు. ఇవీ.. ప్రభుత్వ ఉద్యోగులకు అందుబాటులోకి రానున్న ప్రయోజనాలు.

ఇందుకు కారణం బ్యాంకర్లు అమలు చేస్తోన్న స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ విధానం. రాష్ట్రంలో మొత్తం మూడున్నర లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారు.

ఈ విధానంలోకి చేరడం, చేరకపోవడం అన్నది ఉద్యోగుల విచక్షణకే వదిలేస్తారు. ఉద్యోగులకు ప్రతి నెలా సేవింగ్స్ ఖాతాల నుంచే వేతనాలు అందుతాయి.

కొత్త విధానంలో సేవింగ్స్ ఖాతాలను శాలరీ ప్యాకేజీ అకౌంట్లుగా మార్చుకునేందుకు వెసులుబాటు ఏర్పడింది. ఈ ఖాతాలను జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఖాతాలుగా ఇస్తారు.

ఈ విధానంలో ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణకు పరిమితి ఉండబోదు. ఖాతాల్లో నగదు లేకపోయినా ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తారు.

వ్యక్తిగత రుణాల తీసుకునే ఉద్యోగులు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.20లక్షలు వరకూ బీమా అందుతుంది. విమాన ప్రమాదంలో మరణిస్తే ఆ ఉద్యోగికి రూ.30లక్షల మొత్తం అందుతుంది.

ఉద్యోగుల వేతనాల ఆధారంగా ఖాతాలను మూడు రకాలుగా విభజించారు. ప్రస్తుతమున్న సేవింగ్స్ ఖాతాల వివరాలతోపాటు సంబంధిత పత్రాలు అందిస్తే కేవలం రెండు, మూడు రోజుల్లోనే ఆ ఖాతాలను ఈ విధానంలోకి మారుస్తారని ఆంధ్రజ్యోతి కథనం.

ఫొటో సోర్స్, Getty Images

లంబసింగిలో 2-4 డిగ్రీలు

రాష్ట్రంలో చలి ప్రభావం మరింత పెరగనుందని సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

దక్షిణ అండమాన్ సముద్రంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఈ నెల 25న అల్పపీడనం ఏర్పడనుంది. ఇది చలి తీవ్రతను మరింతగా పెంచడానికి దోహదపడనుంది.

అల్పపీడనం ఏర్పడిన తర్వాత ఉత్తరాది నుంచి వస్తున్న గాలులు ఊపందుకుంటాయి. దాని ప్రభావం అటు తెలంగాణ, ఇటు ఉత్తర కోస్తాంధ్రపై ఎక్కువగా ఉండనుంది.

ఫలితంగా ఇప్పటికంటే అల్పపీడనం అధికమవుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటికే.. ఏజెన్సీ ప్రజలను చలి వణికిస్తోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉభయగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేస్తోంది.

విశాఖ ఏజెన్సీ లంబసింగిలో నాలుగైదు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రత 2 - 4 డిగ్రీల మధ్య నమోదవుతోంది. తిరుమలలో కూడా చలి తీవ్రత పెరిగిందని.. సాక్షి కథనం.

ఫొటో సోర్స్, facebook/vijay rupani

ఫొటో క్యాప్షన్,

రాజ్‌కోట్ పశ్చిమంలో గెలుపొందిన సీఎం విజయ్ రుపానీ

గుజరాత్ గద్దెపై మళ్లీ విజయ్ రూపానీ

గుజరాత్ ముఖ్యమంత్రిగా రూపానీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో..

గుజరాత్ ముఖ్యమంత్రి ఎన్నికపై ఉత్కంఠ వీడిందని సాక్షి కథనం. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు అత్యంత విధేయుడైన విజయ్ రూపానీనే రెండోసారి గుజరాత్ సీఎం పీఠం వరించింది.

శుక్రవారం గుజరాత్ శాశనసభాపక్షం రూపానీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఎన్నికల్లో వరుసగా ఆరోసారి బీజేపీ అధికారం కైవసం చేసుకున్నా తక్కువ మెజార్టీతో గట్టెక్కింది.

ఈ నేపథ్యంలో రూపానీని మరోసారి సీఎంగా కొనసాగించే అంశంలో ఊహాగానాలు నెలకొన్నాయి.

అయితే.. మచ్చ లేని రాజకీయ జీవితం లాంటి అంశాల వల్ల రూపానీ మళ్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారని సాక్షి ప్రచురించిన కథనం..

ఫొటో సోర్స్, Getty Images

కేంద్రం పరిశీలనలో మరో జాతీయ ప్రాజెక్టు

నాలుగు రాష్ట్రాలకు చెందిన మరో జాతీయ ప్రాజెక్టును నిర్మించేందుకు కేంద్రం సన్నద్దమవుతోందని ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం మేరకు..

గోదావరి వరద నీటిని తమిళనాడులోని కావేరి నదికి అనుసంధానించేందుకు వీలుగా జాతీయ జల అభివృద్ధి సంస్థ సిద్ధం చేసిన తాజా ప్రతిపాదనపై చర్చించేందుకు కేంద్రం జనవరిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించనుంది.

ఈ ప్రతిపాదనను జాతీయ ప్రాజెక్టుగా పట్టాలు ఎక్కించేందుకు ఆసక్తి చూపుతున్న కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్రం ఆయా రాష్ట్రాలకు పంపుతూ.. వాటి అభిప్రాయాలను కోరింది.

వారి అభిప్రాయాల మేరకు నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను దిల్లీకి పిలిచి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు.

తెలంగాణలోని కాళేశ్వరం దిగువన 500టిఎంసీలకు పైగా వరద జలాలు అందుబాటులో ఉన్నాయని లెక్కిస్తూ.. ఇందులోని 247 టీఎంసీలు ఈ ప్రతిపాదనలో వివిధ రాష్ట్రాలు వినియోగించుకునే అవకాశం ఉంది.

ఇందులో తెలంగాణ 102 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 55 టీంసీలు, తమిళనాడు 90 టీఎంసీలు వినియోగించుకునేందుకు వీలుంటుంది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)