గమ్యం: రానున్న పదేళ్లలో ITలో ఈ ఆరు కోర్సులతోనే అవకాశాలు!

  • అనిల్ కుమార్
  • బీబీసీ ప్రతినిధి
వీడియో క్యాప్షన్,

ఏం చదివితే ఉద్యోగం వస్తుంది?

ఇంజనీరింగ్, మెడిసిన్... ఇవేనా ఉన్న అవకాశాలు? అసలు ఏం చదివితే మంచి ఉద్యోగ అవకాశాలుంటాయి? జీవితంలో మంచి స్థాయికి చేరాలంటే ఏ రంగంపై దృష్టి సారిస్తే మంచిది? అనేవి చాలామంది విద్యార్థులనే కాదు, తల్లిదండ్రులకూ సమాధానం దొరకని ప్రశ్నలే.

అందుకే 2020 నుంచి 2030 మధ్య ఏయే రంగాల్లో ఉపాధి అవకాశాలుండబోతున్నాయి అనే అంశంపై Careers360.com, మాన్‌స్టర్ సంయుక్తంగా సర్వే నిర్వహించాయి.

ఈ అధ్యయనంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు బయటకి వచ్చాయి. అందులో కొన్ని ముఖ్యమైన విషయాలను Careers360.comఛైర్మన్ మహేశ్వర్ పేరి మాటల్లో...

ఈ సర్వే నివేదిక ప్రకారం... ఐటీ, ఐటీ ఆధారిత సేవలు... దీంతోపాటే టెక్నాలజీ ఎప్పటికీ అప్‌డేట్ అవుతూనే ఉంటుంది. దానికి తగ్గట్లుగానే ఈ రంగంలో నిపుణులకు డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. సమీప భవిష్యత్తులో ఇది ఆగే ప్రశ్నేలేదు.

ఫొటో సోర్స్, Getty Images

మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్

ఈ మధ్యకాలంలో కంప్యూటర్ వాడకం తగ్గిపోయింది. ప్రతి దానికీ అందరూ స్మార్ట్ ఫోన్లను ఉపయోగించడానికి బాగా అలవాటుపడిపోయారు.

సినిమా టిక్కెట్లు బుకింగ్, సినిమాలు చూడడం, ఆన్‌లైన్ షాపింగ్, పేటీఎం, ... ఇలా అన్నింటికీ మొబైలే మనకు ఆధారం. వీటన్నింటిని బట్టీ చూస్తే మొబైల్ అప్లికేషన్లు రూపొందించేవారికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది.

సీ, సీ++, జావా, ఆబ్జెక్టివ్ సీ వంటి వాటిపై అనుభవం ఉన్నవారికి అవకాశాలు వెల్లువెత్తుతాయి. సాధారణంగా బీఎస్సీ కంప్యూటర్ సైన్సెస్ లేదా బీటెక్ చదివితే వీటిపై మీకు అవగాహన వస్తుంది. కానీ కాలం మారుతోంది. ఈ కోర్సులను అందించే వివిధ సంస్థలు పుట్టుకొచ్చాయి.

నైపుణ్యానికి ఆ సర్టిఫికేషన్ తోడైనా చాలు... ఎన్నో కంపెనీలు కళ్లకద్దుకుని తీసుకుంటున్నాయి. అంతేకాదు... ఏ కంపెనీకైనా యువతే ప్రధాన మార్కెట్. అందుకని యువ డెవలపర్లకు మంచి మార్కెట్ ఉంటుందనడంలో సందేహం లేదు.

ఫొటో సోర్స్, Getty Images

బిల్డింగ్ ఆటోమేషన్

ప్రతి రంగంలోనూ మనుషులు, మెషీన్ల స్థానాన్ని ఆటోమేషన్ ఆక్రమించడం మొదలైపోయింది. ఇది మరింత ఎక్కువ కానుంది. షాపింగ్ మాల్స్, కాలనీలు, అపార్ట్‌మెంట్ల సంస్కృతి పెరిగిపోయిన నేటి కాలంలో ఆటోమేషన్‌కూ ప్రాధాన్యం పెరుగుతోంది.

భవనాల్లో లిఫ్టులు, ఎస్కలేటర్లు, సెక్యూరిటీ కెమెరాలు, వైఫై సౌకర్యం, వాటర్ పైపు లైన్లు... ఇలా ఒకటేంటి, అన్నీ ఆటోమేటెడే. దీనికి తగ్గట్లుగానే ఈ రంగంలో నిపుణులకు డిమాండ్ పెరగబోతోంది.

ఫొటో సోర్స్, Getty Images

సైబర్ సెక్యూరిటీ

ఈ ఐటీ యుగంలో డేటాకు ఎంత ప్రాముఖ్యం ఉందో, డేటా భద్రతకూ అంతే ప్రాముఖ్యం ఉంది. హ్యాకింగ్, సైబర్ దాడులు పెరిగిపోతున్నాయి.

దీన్ని ఎదుర్కోగల నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. రానున్న కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో ఎన్నో అవకాశాలు రాబోతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

డేటా అనలిటిక్స్

ప్రతి 12-15 నెలలకోసారి ప్రపంచం మొత్తం ఉపయోగిస్తున్న డేటా రెట్టింపు అవుతోంది అని ఇటీవల ఓ అంతర్జాతీయ సర్వే నివేదిక వెల్లడించింది.

ఈ డేటా మొత్తాన్ని విశ్లేషించడం, అవసరమైనట్లుగా నివేదికలు రూపొందించుకోవడం, వాటితో లాభనష్టాలను అంచనా వేసుకోవడం... ఇలాంటివి చేయగలిగేవారికి అవకాశాలు పెరుగుతాయి.

గణితశాస్త్రం చదివినవారికి ఈ రంగంలో మరింత రాణించే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

డిజిటల్ మార్కెటింగ్

మామూలు మార్కెటింగ్‌కు కాలం చెల్లిపోనుంది. డిజిటల్ మార్కెటింగ్ అనేది మరింత పెరగనుంది.

కంపెనీ చిన్నదా పెద్దదా అనేదానితో సంబంధం లేదు... మీ ప్రొడక్ట్‌ను అమ్ముకోవాలంటే డిజిటల్ మాధ్యమం ఒక్కటే ఆధారం కానుంది.

డిజిటల్ మార్కెటింగ్‌కు అర్హతలు లేకపోయినా ఫర్వాలేదు... ఎన్నో సంస్థలు సర్టిఫికేషన్‌ను అందిస్తున్నాయి. వాటితో కూడా డిజిటల్ మార్కెటర్‌గా స్థిరపడవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images

ఈ-లెర్నింగ్

ప్రపంచంలో జనాభా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అందరికీ క్లాస్ రూంలోనే నేర్చుకునేందుకు సౌకర్యాలు కల్పించడం కూడా ప్రభుత్వాలకు కష్టంగా మారుతోంది. అందుకే ఈ-లెర్నింగ్‌ను ప్రోత్సహిస్తున్నాయి. కళాశాలలు, యూనివర్శిటీలు, ఇతర విద్యా సంస్థలు సైతం ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. అందువల్ల ఈ రంగంలో కూడా ఉపాధికి లోటుండదు.

అందువల్ల ఈ రంగాలపై దృష్టి పెట్టి, వాటిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకుంటూ ఉంటే భవిష్యత్‌లో మంచి స్థాయిలో స్థిరపడేందుకు అవకాశాలుంటాయి.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)