దాణా కుంభకోణంలో లాలూను దోషిగా తేల్చిన కోర్టు, పోలీసు కస్టడీలో లాలూ

  • 23 డిసెంబర్ 2017
లాలూ ప్రసాద్ యాదవ్ Image copyright Getty Images

పశుదాణా కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా నిర్ధారించింది.

1991 నుంచి 1994 మధ్య దేవ్‌ఘర్ ప్రభుత్వ ఖజానా నుంచి రూ. 89 లక్షలు కాజేశారన్న కేసులో లాలూను కోర్టు దోషిగా నిర్ధారించింది.

కోర్టు ఆవరణలోనే లాలూను పోలీసు కస్టడీకి తీసుకున్నారు. జనవరి 3న కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.

తన చిన్న కుమారుడు, బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో కలిసి లాలూ ప్రసాద్ శనివారం నాడు ఉదయమే కోర్టుకు చేరుకున్నారు. శాంతిని కాపాడాలని ఆయన తన మద్దతుదారులను కోరారు.

తీర్పు సమయంలో లాలూ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో కోర్టు బయట గుమిగూడారు. తీర్పు వెలువడడానికి ముందు రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) చీఫ్ లాలూ విలేకరులతో మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం తనను అపఖ్యాతి పాలు చేయాలని చూస్తోందని అన్నారు.

ఈ కేసులో కోర్టు మొత్తం 15 మందిని దోషులుగా నిర్ధారించినట్టు స్థానిక జర్నలిస్టు నీరజ్ సిన్హా తెలిపారు. మరో ఆరుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వీరిలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా కూడా ఉన్నారు.

కాగా, కోర్టు తీర్పుపై రాజకీయ ప్రతిస్పందనల క్రమం మొదలైంది. "ఏ విత్తు నాటితే అదే చెట్టు మొలకెత్తుతుంది. తుమ్మ విత్తనం నాటి మామిడి పండు పండాలని కోరుకుంటే ఎలా? ఏది జరగాలో అదే జరిగింది" అని బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ అన్నారు.

మరోవైపు ఆర్‌జేడీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ కోర్టు తీర్పుపై మాట్లాడుతూ, "జగన్నాథ్‌కు బెయిల్, లాలూకు జెయిల్. అంతా ఓ ఆట. చివరి దాకా పోరాడుతాం" అని అన్నారు.

మరోవైపు, నెల్సన్ మండేలా, మార్టిన లూథర్ కింగ్, బాబా సాహెబ్ అంబేడ్కర్‌లను ఉదాహరిస్తూ లాలూ ఓ ట్వీట్ చేశారు. తీర్పు అనంతరం ఆయన వరుసగా పలు ట్వీట్స్ చేశారు.

బిహార్ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా లాలూ యాదవ్ ఈ కుంభకోణంలో కుట్రదారులపై విచారణకు సంబంధించిన ఫైల్‌లను తన వద్దే దాచి పెట్టారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

అధికారులు అభ్యంతరం చెబుతున్నప్పటికీ ముగ్గురు అధికారులకు ఎక్స్‌టెన్షన్ ఇచ్చారన్న ఆరోపణలు కూడా లాలూపై ఉన్నాయి. ఈ కుంభకోణం గురించి తెలిసినప్పటికీ లాలూ ఈ దోపిడీని అడ్డుకోలేదనే ఆరోపణలు కూడా లాలూ ఎదుర్కొన్నారు.

Image copyright NEERAJ SINHA

లాలూ యాదవ్‌తో పాటు బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా, మరో 19 మంది ఈ కేసులో నిందితులుగా ఉండగా కోర్టు జగన్నాథ్ మిశ్రాను నిర్దోషిగా ప్రకటించింది.

మొదట్లో 34 మందిపై ఆరోపణలు ఖరారు చేయగా వారిలో 11 మంది కేసు విచారణ క్రమంలో వేర్వేరు సమయాల్లో మృతి చెందారు. 13 డిసెంబర్‌న సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి శివపాల్ సింగ్ కేసు విచారణ ముగించారు.

Image copyright Getty Images

2013 అక్టోబర్‌లో లాలూ ప్రసాద్‌ను ఒక కేసులో దోషిగా ఖరారు చేశారు. అది రూ. 37 కోట్ల కుంభకోణానికి సంబంధించినది. ఆ తీర్పు కారణంగా లాలూ యాదవ్‌ను లోక్‌సభ సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించారు. ఈ కేసులో లాలూ రెండు నెలలు జైలులో ఉన్న తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

2014లో ఝార్ఖండ్ హైకోర్టు లాలూ యాదవ్ తదితరులకు ఊరటనిస్తూ నేరపూరిత కుట్ర ఆరోపణలను కొట్టివేసింది. ఒక వ్యక్తిని ఒక కేసులో దోషిగా నిర్ధారించినప్పుడు మళ్లీ అదే కేసులో, ఆ సాక్షులు, ప్రత్యక్ష సాక్షులతోనే మళ్లీ విచారణ జరిపించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది.

Image copyright NEERAJ SINHA
చిత్రం శీర్షిక బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా

ఈ కుంభకోణానికి సంబంధించిన ఇతర కేసుల్లోనూ లాలూ యాదవ్ నిందితుడిగా ఉన్నారు. నకిలీ మందులు, పశు దాణాలో రూ. 900 కోట్లు దిగమింగారన్న ఆరోపణలు మోపారు. సీబీఐ ఈ ఆరోపణలపై 1996లోనే దర్యాప్తు ప్రారంభించింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

టర్కీలో భూకంపం.. భవనం కూలి 18 మంది మృతి.. వందలాది మందికి గాయాలు

వీడియో: షాహీన్‌బాగ్‌ నిరసనల్లో పాల్గొంటున్న మూడు తరాల ముస్లిం మహిళలు

కరోనా వైరస్: 'తుమ్మినా, దగ్గినా ఇతరులకు సోకుతుంది.. దగ్గు, జ్వరంతో మొదలై అవయవాలు పనిచేయకుండా చేస్తుంది'

ప్రతి శుక్రవారం ఏదో ఒక కారణం చెబుతారేం.. ఈసారి రాకపోతే చర్యలు తప్పవు - సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం

కరోనా వైరస్: చేపల మార్కెట్లో మొదలైంది.. చైనా మొత్తం పాకింది

అంగోలాను ఆఫ్రికా అత్యంత సంపన్న మహిళ ఇజాబెల్ ఎలా ‘దోచేశారు’

మాస్క్‌లు వైరస్‌ల వ్యాప్తిని అడ్డుకోగలవా

డిస్కో రాజా సినిమా రివ్యూ : రవితేజ సైన్స్ ఫిక్షన్ ప్రయోగం ఫలించిందా..

'సముద్రంలో చేప ఎగిరొచ్చి నా మెడకు గుచ్చుకుంది'