BBC SPECIAL: దిల్లీలో ‘రేపిస్ట్ బాబా’... కలవరపెడుతున్న నిజాలు!

  • సర్వప్రియ సాంగ్వాన్
  • బీబీసీ ప్రతినిధి
బాబా వీరేందర్ దేవ్ దీక్షిత్
ఫొటో క్యాప్షన్,

బాబా వీరేందర్ దేవ్ దీక్షిత్

తనను తాను 'బాబా' అని చెప్పుకునే వీరేందర్ దేవ్ దీక్షిత్, దిల్లీలోని రోహిణి ప్రాంతంలో దాదాపు పాతికేళ్లుగా నిర్వహిస్తున్న ఓ ఆశ్రమంపై పోలీసులు దాడి చేశారు. అక్కడి నుంచి 41 మంది మైనర్ అమ్మాయిలను విడిపించారు.

ఈ బాబా పలు కేసుల్లో నిందితుడు. వాటిలో ఎక్కువ కేసులు లైంగిక అత్యాచారానికి సంబంధించినవే. 1998లోనే ఈయనపై నాలుగు గ్యాంగ్ రేప్ కేసులు నమోదైనట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.

డేరా బాబా గుర్మీత్ సింగ్ తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ తాజా ఉదంతం ముఖ్యంగా ఉత్తరాదిలో కలకలం రేపింది. ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం పేరుతో నడుస్తున్న ఓ ఆశ్రమం గురించి, దాని నిర్వాహకుడైన వీరేందర్ బాబా గురించి వివరాలు సేకరించడం కోసం బీబీసీ పలువురితో మాట్లాడింది.

"మూడేళ్ల కిందట కూడా పోలీసులు దీనిపై రైడ్ చేశారు. ఆ తర్వాత మళ్లీ సద్దు మణిగింది. ఈసారి ఆశ్రమం తలుపుల్ని తెరవగా ఒక యువతి శవం లభ్యమైంది. పోలీసులొచ్చి శవాన్ని తీసుకెళ్లారు" అని స్థానికులు చెప్పారు.

ఈ ఆశ్రమంలో అమ్మాయిలను ఖైదీలుగా ఉంచుతారనీ, వారికి మత్తు మందులిస్తారనీ, లైంగికంగా వేధిస్తారనేది 70 ఏళ్ల వీరేందర్ దేవ్ దీక్షిత్‌పై ఉన్న ముఖ్య ఆరోపణ.

'నువ్వు నా పదహారు వేల గోపికల్లో ఒకతివి'

ఈ వ్యవహారంలో ఫౌండేషన్ ఫర్ సోషల్ ఎంపవర్‌మెంట్ అనే ఎన్జీవో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసింది. వీరేందర్ దేవ్ దీక్షిత్ తనను తాను శివుడి అవతారంగా చెప్పుకుంటారని ఈ సంస్థ తరఫు న్యాయవాది తెలిపారు.

"శివ లింగాన్ని పూజించినట్టుగానే తన లింగానికి కూడా పూజ చేయాలని వీరేందర్ కోరుతాడు. అక్కడ ఉండే యువతులకు మత్తు మందులిస్తారు. మొట్టమొదట అమ్మాయిలతో 'భట్టీ' అని పిలిచే ఒక తంతు చేయిస్తారు. ఈ తంతులో అమ్మాయిలను ఏడు రోజుల పాటు ఏకాంతవాసంలో ఉంచుతారు. ఆ సమయంలో వారితో ఆశ్రమంలో ఉన్న ఎవరూ కలవడానికి వీల్లేదు. ఈ తంతు పూర్తి చేసిన యువతులను వేరే పట్టణాల్లో ఉన్న ఆశ్రమాలకు పంపిస్తారు. మైనర్ అమ్మాయిలను మభ్యపెట్టి వారిని ఆయన తన గోపికలుగా చేసుకుంటాడు. అలా ఈ అమ్మాయిలు తమపై లైంగిక దోపిడీ జరుగుతున్నా సహిస్తారు. నువ్వు నా పదహారు వేల గోపికల్లో ఒకతివి అని అంటూ వారిని ఆయన లోబర్చుకుంటాడు" అని న్యాయవాది చెప్పారు.

1998 నుంచి నమోదవుతున్న రేప్ కేసులు

ఈ బాబాపై ఇప్పటి వరకు వేర్వేరు పోలీసు స్టేషన్లలో 10 ఎఫ్‌ఐఆర్‌లు నమోదై ఉన్నాయి. వీటిలో చాలా వరకు రేప్ కేసులే. 1998 నుంచి ఇప్పటి వరకూ వివిధ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి.

వేర్వేరు స్టేషన్లలో నమోదైన 10 ఎఫ్‌ఐఆర్‌లే కాకుండా, పోలీసుల డైరీలో ఒక మహిళ ఆత్మహత్య కేసు కూడా నమోదై ఉంది. 2016 డిసెంబర్ 7న ఒక మహిళ ఆశ్రమం పై కప్పు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడగా జీటీబీ ఆసుపత్రి యాజమాన్యం ఈ కేసు నమోదు చేయించింది.

2017 మార్చి 4న ఒక మహిళ ఆశ్రమంలో ఉరేసుకొని చనిపోయినట్టు ఆరోపణలున్నాయి. ఆ కేసు విచారణ సందర్భంగా, ఆమెపై భూతప్రేతాల ప్రభావం ఉన్నట్టు ఆశ్రమంలో ఉండే మహిళలు చెప్పారు. అయితే విచారణ ఏ దశకు చేరుకుందనే విషయంపై నేటికీ స్పష్టత లేదు.

ఈ బాబాకు ఎన్నో పేర్లు

ఈ ఆశ్రమం నుంచి తప్పించుకొని వచ్చిన కొందరు అమ్మాయిలను కలిశానని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు సుష్మా సాహు చెప్పారు. వారి నుంచి వాంగ్మూలాలు సేకరించినట్టు ఆమె తెలిపారు.

అమ్మాయిలకు బాబా హార్మోన్లు పెంచే మందులిచ్చేవాడని, అలా వారిని సెక్స్ కోసం వాడుకునేవాడని బాధితులు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తోందని ఆమె అన్నారు. బాబా వారితో మాలిష్ చేయించుకుంటాడనీ, వారితోనే స్నానం చేయించుకుంటాడనీ, తనతో సెక్స్ సంబంధాలు పెట్టుకునేలా రెచ్చగొడతాడనీ ఆ అమ్మాయిలు చెప్పినట్టుగా సుష్మా తెలిపారు. తనను రాజస్థాన్‌కు తీసుకెళ్లి లైంగిక దోపిడీకి గురి చేశాడనీ, ఎదురు చెప్పినందుకు తనను బాగా కొట్టేవాడనీ కాన్‌పూర్‌కు చెందిన ఓ పదమూడేళ్ల అమ్మాయి చెప్పినట్టు సుష్మా తెలిపారు.

బాబా వేర్వేరు పేర్లతో, వేర్వేరు ఐడీ కార్డులతో సంచరిస్తాడనీ, ఈ విచారణ సందర్భంగా తనకు బెదిరింపులు కూడా వచ్చాయని సుష్మా సాహు చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

ఆశ్రమ వెబ్‌సైట్

దేశదేశాల్లో ఉన్న ఆశ్రమాలు

ఈ ఆశ్రమానికి సంబంధించిన వెబ్‌సైట్‌లో ఉన్న వివరాలను బట్టి దిల్లీ, భోపాల్, ముంబయి, హైదరాబాద్ సహా 12 పెద్ద నగరాల్లో ఈ ఆశ్రమ శాఖలున్నాయి. అయితే ఆశ్రమంపై వచ్చిన ఫిర్యాదులను బట్టి చూస్తే ఇవే కాకుండా ఇంకా చాలా పట్టణాల్లో శాఖలున్నట్టు అర్థమవుతోంది. అంతేకాదు, కెనడా, ఇంగ్లాండ్, జర్మనీ, నేపాల్, మలేషియా, అమెరికాలలో కూడా ఈ ఆశ్రమానికి శాఖలున్నాయి.

అమెరికాలో పీహెచ్‌డీ చేస్తున్న ఒక యువతిని ఆమె తల్లిదండ్రులకు తెలియకుండానే ఈ ఆశ్రమంలో చేర్చుకున్నట్టు నమోదైన ఒక ఎఫ్‌ఐఆర్‌ను బట్టి తెలుస్తోంది.

తన బంధువు కూతురిని కలవాలని వస్తే తనను 3 గంటల సేపు కూర్చోబెట్టారని బిహార్‌లోని ఖగడియాకు చెందిన శైలేష్ తెలిపారు. ఆ తర్వాత కూడా తనను ఆ అమ్మాయితో కలవనివ్వలేదని ఆయనన్నారు.

ఆమెను హరియాణాలోని రోహ్‌తక్‌కు పంపించారని ఆ తర్వాత తెలిసిందని ఆయన చెప్పారు. తర్వాత తాను అక్కడికి వెళ్లగా కేవలం 5 నిమిషాల పాటు, ఆశ్రమ సిబ్బంది ఎదుటే ఆమెతో మాట్లాడేందుకు అనుమతించారని శైలేష్ తెలిపారు.

ఫొటో క్యాప్షన్,

ఆశ్రమం నలు వైపులా మూసి ఉంటుంది

అమ్మాయిల అరుపులు విన్నాం: ఇరుగుపొరుగు జనం

బాబా వీరేందర్ దేవ్ దీక్షిత్ ఆశ్రమంలో జరిగే అక్రమాల గురించి గత 22 ఏళ్లలో అనేక సార్లు పోలీసులకు ఫిర్యాదు చేశామని ఈ ఆశ్రమం చుట్టుపక్కల నివసించే ప్రజలు చెప్పారు. అయితే పోలీసులు ఎలాంటి చర్యా తీసుకోలేదని వారు తెలిపారు.

ఇక్కడి నుంచి రాత్రి సమయాల్లో అమ్మాయిలను కార్లలో కూర్చోబెట్టి బైటికి తీసుకెళ్తారని, వాళ్ల ముఖాలు కప్పివేసి ఉంటాయని పొరుగున నివసించే ఓ మహిళ తెలిపారు.

బాల్కనీని కూడా తెల్లటి చద్దరుతో మూసేశారనీ, ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఆవరించి ఉంటుందని ఆమె చెప్పారు.

"కొన్ని సార్లు అమ్మాయిల అరుపులు వినబడతాయి. తమ కూతుళ్లను తీసుకెళ్లడం కోసం తల్లిదండ్రులు వచ్చినా అమ్మాయిలు వారి వెంట వెళ్లడానికి నిరాకరిస్తారు. అంతేకాదు, ఈ ఆశ్రమం పేరును కూడా చాలా సార్లు మార్చారు" అని ఆమె అన్నారు.

తల్లిదండ్రులు భక్తులు అయినప్పుడు వారిని తమ కూతుళ్లను ఆశ్రమానికి సమర్పించాల్సిందిగా ఒత్తిడి చేస్తారని ఒక వ్యక్తి తెలిపారు. ఇక్కడ ప్రతి రెండు, మూడు నెలలకోసారి ఏదో ఒక పోలీసు కేసు జరుగుతుంది. పోలీసులు వచ్చి వెళ్లిన తర్వాత మళ్లీ అంతా మామూలుగానే ఉంటుందని ఆ వ్యక్తి చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

గురువారం నాడు 41 మంది మైనర్ అమ్మాయిలను విడిపించారు.

పట్టుబడిన అభ్యంతరకరమైన లేఖలు, ఇంజెక్షన్లు, సూదులు

గురువారం నాడు సీబీఐ, పోలీసులు 8 గంటల పాటు ఆశ్రమంలో తనిఖీ చేశారు. 41 మంది మైనర్ అమ్మాయిలను ఆశ్రమం నుంచి విడిపించారు.

దిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మలివాల్ ఆశ్రమం లోపలి పరిస్థితిపై మీడియాతో మాట్లాడారు:

"పోలీసులతో పాటు మేం లోపలికి వెళ్లగా ప్రతి చోటా ఇనుప తలుపులు, తాళాలు కనిపించాయి. ఇదసలు ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయమే కాదు. వీరి దగ్గర ఎలాంటి అధికారిక పత్రాలూ లేవు. ఏ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఆమెను ఎటు తీసుకెళ్లారు? వంటి రికార్డులేవీ లేవు. బాబా అని చెప్పుకునే వ్యక్తిని సంబోధిస్తూ అమ్మాయిలతో అభ్యంతరకరమైన తీరులో రాయించిన ఉత్తరాలెన్నో లభించాయి. అక్కడ మాకు పెద్ద సంఖ్యలో మందులు, ఇంజెక్షన్లు, వాడేసిన సిరింజిలు లభ్యమయ్యాయి. ఆశ్రమంలో దాదాపు 200 మంది మహిళలుండగా, వారిలో 41 మందిని విడిపించాం. ఈ అమ్మాయిలు ప్రస్తుతం ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నారు."

ఇప్పటికీ అనేక మంది మహిళలు ఆ ఆశ్రమంలో ఉన్నారు. ఆశ్రమానికి సీలు వేయలేదు. వీరేందర్ దీక్షిత్‌ను శుక్రవారం నాడు కోర్టులో హాజరు కావాలని ఆదేశించగా, ప్రస్తుతం బాబా పరారీలో ఉన్నాడు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)