నా కొడుకు తప్పు చేశాడు సరే! కానీ..

  • 24 డిసెంబర్ 2017
సంధ్యారాణి ఫోటోకు పూల మాల వేసిన చిత్రం

''అక్కా నేను చచ్చిపోతానని తెలుస్తోంది..! కానీ ప్లీజ్.. వాడిని మాత్రం వదలొద్దు'' ఇవీ.. సంధ్యా రాణి తన అక్కతో చెప్పిన చివరి మాటలు..!

హైదరాబాద్‌లో 22 సంవత్సరాల సంధ్యారాణిపై కార్తీక్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. డిసెంబర్ 21 సాయంత్రం జరిగిన ఈ ఘటన హైదరాబాద్‌లో సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సంధ్యారాణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 22న కన్నుమూసింది.

అసలు సంధ్య, కార్తీక్‌లు ఎవరు?.. ఈ దుర్ఘటనకు కారణాలేమిటి? అని తెలుసుకోవడానికి బీబీసీ ప్రతినిధి బత్తిని దీప్తి ప్రయత్నించారు. ఇరువురి కుటుంబ సభ్యులు, సహోద్యోగులను కలిసి వివరాలు తెలుసుకున్నారు.

సికింద్రాబాద్‌ లాలాపేట గల్లీలో రెండు ఇరుకు గదుల ఇల్లు. గేట్ తట్టి లోపలికి వెళ్తే.. సంధ్యారాణి తల్లి సావిత్రి రెండు చేతులెత్తి నమస్కరించారు.

''మా రాణమ్మ కోసం వచ్చారా? ఇంక లేదు నా రాణమ్మ.. చంపేశాడు నా బిడ్డను'' అంటూ విలపిస్తూ పక్కనే ఉన్న కుర్చీలో కుప్పకూలిపోయింది ఆ తల్లి.

ఇంతలో ఓ పెంపుడు కుక్క పిల్ల ఏదో వెతుకుతూ తిరుగుతోంది. సంధ్యారాణి ఫోటో కనపడగానే ఏదో గుర్తుకొచ్చినట్టు మొరిగింది.

''సంధ్య కోసం వెతుకుతోంది మా టామీ. నిన్నటి నుంచి ఇలాగే తిరుగుతోంది. సంధ్య రోజూ దీనికి స్నానం చేయించి, తినిపించి ఆఫీసుకు వెళ్లేది'' అంటూ సంధ్య అన్నయ్య కిరణ్ కంట తడి పెట్టుకున్నారు.

తల్లి సావిత్రి.. లోపల ఉన్న సంధ్య ఫోటో తెప్పించి.. ''చూడు బిడ్డా.. నా కూతురు ఎంత సక్కగా ఉందో! వాడు పెట్రోల్ పోసి తగలబెట్టిండు. ఎంత బాధ పడి ఉంటది నా బిడ్డ..వాడిని వదలొద్దు. వాడికి కఠిన శిక్ష పడాలే'' అంది.

సంధ్య భుజాలపైనే కుటుంబ భారం

సావిత్రి, దాస్ దంపతులకు ఆరుగురు సంతానం. ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. అందరికంటే చిన్నది సంధ్య. నాలుగు సంవత్సరాల క్రితం తండ్రి దాస్ అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి కుటుంబ అవసరాల కోసం ఓ బ్యాంకులో చిన్న ఉద్యోగంలో చేరింది సంధ్య.

సంధ్య అక్క సరిత కళ్లు తుడుచుకుంటూ.. కుటుంబం పట్ల చెల్లి ఎంతో బాధ్యతతో వ్యవహరించేదంటూ చెప్పుకొచ్చారు.

''మా చెల్లి జీతం తెచ్చి మా అమ్మకు ఇచ్చేది. ఇంట్లోకి కావాల్సిన సరుకులు కానీ, బట్టలు కానీ ఇతర సామాన్లు కానీ అన్నీ తానే ప్లాన్ చేసి తెచ్చేది.'' అన్నారు.

మధ్యలో సంధ్య అన్న కిరణ్ కల్పించుకుంటూ.. ''ఇంత బాధ పెట్టినవాడి గురించి మాతో ఏనాడూ చెప్పలేదు. మాకు తెలిసుంటే అప్పుడే మందలించో, బెదిరించో మా చెల్లిని కాపాడుకునేవాళ్లం'' అన్నారు.

సంధ్యకు ఆ సెల్‌ ఫోన్ ఎవరిచ్చారు?

లక్కీ ట్రేడర్స్‌లో సంధ్యకు ఉద్యోగం ఎవరు ఇప్పించారు?..

అసలు కార్తీక్ సంధ్యతో ఎలా ప్రవర్తించేవాడు?

గురువారం.. డిసెంబర్ 21న ఏం జరిగింది..?

ఈ ప్రశ్నలతో లాలాపేటలో సంధ్య ఇంటికి 15 నిమిషాల దూరంలో ఉన్న సంధ్య ఆఫీస్‌కు వెళ్లాం.

సంధ్య ప్రతి రోజూ ఉదయం 10:30కు వచ్చి సాయంత్రం 6:00 - 6:30కు నడుచుకుంటూ ఇల్లు చేరేది.

''నిన్న సంధ్య అంత్యక్రియలు కదా.. అందుకని శుక్రవారం పూజ చేయలేకపోయాం. అందుకే ఇవాళ చేస్తున్నాం'' అన్నారు లక్కీ ట్రేడర్స్ యజమాని జగన్ రెడ్డి.

పూజ ముగించి కుర్చీలో కూర్చుంటూ.. పక్కనే ఉన్న కుర్చీ, కంప్యూటర్ టేబుల్ చూపిస్తూ..

''ఇక్కడే కూర్చునేది సంధ్య. మా కస్టమర్లు కూడా ఫోన్ చేసి బాధపడుతున్నారు. ఎంతో కష్టపడి పనిచేసేది. నాకిప్పుడు చెయ్యి నరికేసినట్లుంది. బ్యాంకు పాస్‌వర్డ్స్ కానీ మెయిల్ పాస్‌వర్డ్స్ కానీ అన్నీ తనకే తెలుసు'' అంటూ బాధపడ్డారు ఓనర్ జగన్.

'లక్కీ ట్రేడర్స్' అల్యూమినియం సరఫరా చేసే సంస్థ. ఇందులో సంధ్య కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసేది. ఇదే ఆఫీసులో కార్తీక్ కూడా నాలుగు నెలలపాటు పనిచేశాడు.

కానీ సక్రమంగా పని చేయకపోవడంతో పనిలోంచి తీసేశామన్నారు జగన్.

''మా వద్ద జాయిన్ అయిన నెల రోజులకి తనకు తెలిసిన ఓ అమ్మాయి ఉంది.. కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉద్యోగం ఇస్తారా? అని అడిగాడు కార్తీక్.

సంధ్యను తీసుకువచ్చాడు. ఆ అమ్మాయి పనితీరు నచ్చి, పనిలో పెట్టుకున్నాము. సంధ్య జాయిన్ అయిన మూడు నెలలకు కార్తీక్‌ను ఉద్యోగంలోంచి తీసేశాము'' అన్నారు.

అయితే కార్తీక్ సంధ్యకు ఎలా పరిచయమో తెలీదని, ఆఫీస్‌లో పని చేసేటపుడు ఎటువంటి సమస్యా రాలేదంటున్నారు జగన్.

కానీ మంగళవారం డిసెంబర్ 19న ఇంటికి వెళ్లిపోయే ముందు కార్తీక్ తనని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నట్టు జగన్‌కు చెప్పింది సంధ్య.

''అంకుల్.. ఇలా నన్ను సతాయిస్తున్నాడు. ఇంట్లో వాళ్లకు తెలియదు. తెలిస్తే గొడవ అయితది. మీరే కార్తీక్‌ను పిలిచి మందలించండి'' అంటూ వేడుకుందని జగన్ అన్నారు.

బుధవారం డిసెంబర్ 20న జగన్ కార్తీక్‌కు ఫోన్ చేసి పిలిపించారు.

''ఆ రోజు కార్తీక్ ఆవేశంగా.. అసలు సంధ్యకు తాను ఇష్టం లేకపోతే అతను ఇచ్చిన మొబైల్ ఫోన్ ఎందుకు తీసుకుంది అని వాదించాడు'' అని జగన్ గుర్తు చేసుకున్నారు.

డిసెంబర్ 21 ఉదయం ఆఫీస్‌కు వచ్చాక.. మొబైల్ ఫోన్ గురించి సంధ్యను అడిగారు జగన్.

''మొబైల్ ఫోన్ తానే కొన్నదని, 'ఒకవేళ ఈ మొబైల్ ఫోన్ కోసమే అయితే మీరే కార్తీక్‌కు ఇచ్చేయండి' అని నాకు ఫోన్ ఇచ్చింది సంధ్య'' అన్నారు జగన్.

సాయంత్రం కార్తీక్‌ జగన్‌కు ఫోన్ చేసి అసలు సంధ్య దగ్గర మొబైల్ ఫోన్ తీసుకోవడానికి నువ్వు ఎవర్రా.. అని బెదిరించాడని జగన్ చెబుతున్నారు.

''అలా కాదు.. నువ్వు ఆఫీస్‌కి రా మాట్లాడుకుందాం అని అన్నాను. నాకు అప్పుడు తెలీదు సంధ్య అక్కడే ఉందని. తెలిసుంటే వెంటనే మనుషులను పంపించేవాడిని.

అప్పుడు ఈ ఘటన కూడా జరిగేది కాదేమో'' అంటూ ఆలోచనల్లో పడ్డారు జగన్.

ఆఫీస్‌లోని సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే.. తన మొబైల్ ఫోన్‌ను సంధ్య టేబుల్ అరాలో పెట్టి వెళ్తున్నట్టు కనిపించింది'' అని జగన్ అన్నారు. ఇప్పుడు మొబైల్ ఫోన్ పోలీసుల స్వాధీనంలో ఉంది.

అసలు మొబైల్ ఫోన్ తన చెల్లి ఇన్‌స్టాల్మెంట్‌లో కొనుక్కుందని, తనకు ఎవరూ ఉద్యోగం ఇప్పించలేదని గట్టిగా వాదించారు సంధ్య అన్న కిరణ్.

''అందరూ చెబుతున్నట్టు ఈ ఉద్యోగం కార్తీక్ ఇప్పించలేదు. తాను బ్యాంకులో పనిచేసేది. బ్యాంకు ఇంటికి దూరం అవుతుందని మానేసింది. ఇంటికి దగ్గర్లో ఉన్న లక్కీ ట్రేడర్స్‌లో జాబ్ గురించి ప్రకటన చూసింది. ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నపుడు కూడా నేను తన పక్కనే ఉన్నాను. అలాంటిది.. తనకు కార్తీక్ ఉద్యోగం ఇప్పించాడని ఎలా అనుకుంటున్నారో తెలీదు'' అన్నారు కిరణ్.

పైకి చిన్న చిన్న విషయాలుగా కనిపిస్తున్నా.. సంధ్యను హత్య చేసేంత దారుణానికి ఒడిగట్టాడంటే అసలు ఏమి జరుగుంటుందోనన్న అనుమానాలతో కార్తీక్ ఇంటికి బయలుదేరాం.

నా కొడుకు చేసింది తప్పే! కానీ...

కార్తీక్ ఇల్లు వెతుకుతూ వెళ్లాం. సంధ్య ఇంటి నుంచి కాస్త దూరంలో అదే లాలాపేటలోనే కార్తీక్ ఇల్లు ఉన్నట్లు తెలిసింది. కార్తీక్ పేరు వెతుకుతూ వెళితే అక్కడి వారు ఇల్లు చూపించారు. ఇంటికి తాళం వేసుంది. ఎదురుగా ఉన్న కిరాణా దుకాణంలో అడిగితే.. గురువారం నుంచి తాళం వేసుందని అన్నారు.

ఓ ఇంటి బయట కూర్చున్న మహిళతో మాట్లాడి కార్తీక్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాం.

''వాళ్లు ఐదుగురు ఉండే వాళ్లు. ఇదే ఇల్లు. చుట్టుపక్కల వాళ్లతో పెద్దగా మాట్లాడే వాళ్లు కాదు'' అని చెప్పారు ఆ మహిళ.

కార్తీక్ గురించి అడుగుతున్నామని తెలిసి.. పక్కనే ఉన్న ఒకాయన వచ్చారు.

''మాకే షాకింగ్‌గా ఉంది. అమ్మాయిని అన్యాయంగా చంపేశాడు. కానీ అతను ఎప్పుడూ అలా కనిపించలేదు. వాళ్ల పనేదో వాళ్లు చేసుకునే వారు'' అని బాబు అనే వ్యక్తి అన్నారు.

కార్తీక్ సోదరి నదియా మొబైల్ నంబర్ దొరికింది. ఆ నెంబర్‌కు ఫోన్ చేస్తే కార్తీక్ తల్లి ఉర్మిళ మాట్లాడారు.

''మాకు తెలిసినోళ్లింటికి వచ్చేశాం. అక్కడ ఉండలేకపోయాం'' అన్నారు.

''నా కొడుకు చేసింది తప్పే. నేనే తీసుకుపోయి పోలీసులకు అప్పగించాను. కానీ.. ఇట్ల ఎందుకు జరిగిందని ఎవరూ అడగట్లేదు. ఆ అమ్మాయి మీద నిందలు వేస్తున్నానని అనుకోవచ్చు. కానీ ఆ అమ్మాయి నా కొడుకుతో తిరగకుండానే నా కొడుకు వెంటపడ్డాడా?'' అని ప్రశ్నించారు.

కార్తీక్ ప్రవర్తన గురించి, సంధ్యతో పరిచయం గురించి అన్ని వివరాలు ఊర్మిళను అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నించాం.

తాను చెప్పినదాని ప్రకారం.. ఎటువంటి చిన్న తప్పు జరిగినా కార్తీక్‌కు చాలా కోపం వచ్చేది. కార్తీక్‌కు రెండు సంవత్సరాలుగా సంధ్య తెలుసు.

సంధ్య బ్యాంకులో పనిచేసేటపుడు ఇద్దరూ ఒకే బస్‌ స్టాప్‌లో నించునేవాళ్లు.

''ఒకసారి వాళ్లిద్దరూ మాట్లాడుకోవడం నేను చూశాను. అదే రోజు ఆ అమ్మాయి ఎవరని కార్తీక్‌ను అడిగాను. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని కార్తీక్ నాతో అన్నాడని ఊర్మిళ చెప్పింది.

కార్తీక్ తండ్రి ఎప్పుడూ తాగుతూ.. ఉండటంతో కార్తీక్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఊర్మిళ మాటలనుబట్టి.. కార్తీక్, సంధ్యలు ప్రేమించుకున్నారు. 2016 దసరా పండగ నాడు ఇద్దరికీ గొడవ జరిగింది. దాంతో కార్తీక్ ఆత్మహత్యకు కూడా ప్రయత్నించినట్టు ఊర్మిళ చెబుతున్నారు.

''నా కొడుకు ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించాడు. వాళ్లకి గొడవైందని నాకు చెప్పినపుడు ఆ అమ్మాయి జోలికి వెళ్లొద్దని వారించాను కూడా. కానీ నా మాట వినకుండా సంధ్యతో స్నేహం కొనసాగించాడు'' అన్నారు.

సంధ్యతో ఫోన్లో మాట్లాడితే బానే ఉంటాడని, లేకపోతే పిచ్చోడిలా ప్రవర్తిస్తాడని చెప్పారామె.

అయితే.. నెల రోజుల క్రితం తమ ఇంటికి వచ్చి, కార్తీక్‌ను తనతో మాట్లాడొద్దని చెప్పమంటూ ఊర్మిళతో అంది.

మళ్లీ డిసెంబర్ 18న తనకు ఫోన్ చేసి.. ''ఆంటీ మీ అబ్బాయికి నా వెంట పడొద్దని చెప్పండి. నన్నెందుకు ఇలా సతాయిస్తున్నాడని అడిగింది'' అంటూ ఏడుస్తూ చెప్పుకొచ్చింది ఊర్మిళ.

చిత్రం శీర్షిక కార్తీక్ తల్లి ఊర్మిళ

డిసెంబర్ 21న ఏం జరిగింది

''కార్తీక్‌కి మందు తాగే అలవాటుంది. వారం రోజులుగా కొంచెం ఎక్కువయ్యింది. ఆ రోజు పొద్దున్నే ఆఫీస్ పని ఉందని వెళ్లిపోయాడు. మధ్యాహ్నం ఒక బీర్ తెచ్చుకుని తాగాడు. భోజనం చేసి కూర్చున్నాడు.

5:30కు ఆఫీస్ నుంచి సంధ్యను ఇంటి దగ్గర దింపి వస్తానని వెళ్లాడు. నేను వద్దు.. అన్నా వినిపించుకోలేదు. గంట గడిచినా ఇంటికి రాకపోయేసరికి ఫోన్ చేశాను. సంధ్యను కలిశాను, ఇంటికే వస్తున్నానన్నాడు.

మళ్లీ 5 నిమిషాలకే ఫోన్ చేసి, అమ్మా.. సంధ్య మీద పెట్రోల్ పోసి తగలబెట్టేశా.. అన్నాడు'' అని చెప్పుకొచ్చారు ఊర్మిళ.

అదే రోజు పోలీసులు కార్తీక్‌ను అరెస్ట్ చేశారు. ఐపిసి 302, 354, 354 (D), సెక్షన్ 3(ii) ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు పెట్టారు. ప్రస్తుతం కార్తీక్ చంచల్‌గూడ జైలులో ఉన్నాడు.

డిసెంబర్ 21న 5 నిమిషాల్లో అంతా అయిపోయింది. ఇద్దరి ఇళ్లకూ కేవలం 15 నిమిషాల దూరంలో ఈ సంఘటన జరిగింది. సంఘటన జరిగిన ప్రాంతంలో సంధ్య ఫోటో పెట్టారు.

''ఆరోజు మేము లోపల పనిలో ఉన్నాం. అమాంతంగా మంటలు కనిపించి ఓ అరుపు వినిపించింది. వెంటనే బయటకు పరిగెత్తాం. అక్కడ ఓ అమ్మాయి కాలిపోతోంది. మంటలార్పేందుకు ప్రయత్నించాం. ఈలోపు ఆంబులెన్స్ వచ్చింది'' అని ఆ ఘటనను చూసిన ఓ పెద్దాయన వివరించారు.

అంబులెన్స్‌లో 108 సిబ్బంది రికార్డ్ చేసినపుడు, గాంధీ ఆసుపత్రిలో మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలం, కుటుంబ సభ్యులు అడిగినపుడు సంధ్య అన్న ఒకే మాట...

''కార్తీక్ ఈ పని చేశాడు''...

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి: 'ఈ పేద రాష్ట్రానికి మండలి అవసరమా'

'ఇంగ్లిష్ మీడియం బిల్లు'కు రెండోసారి ఏపీ అసెంబ్లీ ఆమోదం.. ఇప్పుడు మండలిలో ఏం జరుగుతుంది..

కరోనా వైరస్‌: చైనాలో మరో నగరానికి రాకపోకలు నిలిపివేత

‘రోహింజ్యాలపై మారణహోమం ఆపేందుకు చర్యలు తీసుకోండి’- మయన్మార్‌కు ఐసీజే ఆదేశం

ఆంధ్రప్రదేశ్: శాసన మండలిలో అసలేం జరిగింది? సెలెక్ట్ కమిటీ ఏం చేస్తుంది

చనిపోయిన వ్యక్తి నుంచి వీర్యం సేకరించి పిల్లలు పుట్టించొచ్చా

పీవీ సింధు విజయాల వెనుక పీబీఎల్‌ పాత్ర కూడా ఉందా

రజినీకాంత్ చెప్పిన దాంట్లో నిజమెంత... సీతారాముల నగ్నవిగ్రహాలకు పెరియార్ చెప్పుల దండలు వేసి ఊరేగించారా..

బెజోస్ ఫోన్ హ్యాకింగ్: అమెజాన్ బిలియనీర్ ఫోన్‌ని సౌదీ యువరాజు హ్యాక్ చేశారా?