అభిప్రాయం: భీమా-కోరెగాంలో దళితులు విజయోత్సవం ఎందుకు జరుపుకొంటారు?

  • రాజేశ్ జోషీ
  • రేడియో సంపాదకుడు, బీబీసీ హిందీ
పూణేలో పేష్వా సామ్రాజ్యపు పెయింటింగ్

ఫొటో సోర్స్, ALASTAIR GRANT/AFP/Getty Images

ఫొటో క్యాప్షన్,

పూణేలో పేష్వా సామ్రాజ్యపు పెయింటింగ్

ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను అంతమొందించడానికి 1857లో దాదాపు దేశమంతటా తిరుగుబాటు జరిగింది. కానీ ఇప్పుడు అదే ఈస్ట్ ఇండియా కంపెనీ 200 ఏళ్ల కిందట సాధించిన ఓ విజయాన్ని ఉత్సవంగా జరుపుకోవడం కోసం దళితులు ఏకమవుతుంటే అందరూ ఉలిక్కి పడుతున్నారు.

పుణేకు సమీపంలోని కోరెగాం-భీమాలో దళితులు ప్రతి ఏటా విజయోత్సవం జరుపుకుంటారు. ఈసారి సందర్భం 200వ వార్షికోత్సవం కాబట్టి లక్షలాది దళితులు అక్కడికి చేరుకుంటారని భావిస్తున్నారు. అయితే వారిపై దేశద్రోహులనే ముద్ర వేసే సాహసం మాత్రం ఇప్పటి వరకూ ఏ 'జాతీయవాదీ' చేయలేకపోయాడు.

ఇప్పుడు.. పేష్వాల ముఖద్వారమైన 'శనివార్ బాడా'లో ప్రదర్శన నిర్వహించడానికి దళితులకు అనుమతి ఇవ్వగూడదంటూ అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘం పోలీసులకు విజ్ఞప్తి చేసింది. "ఇలాంటి ఉత్సవాల ద్వారా కుల విభేదాలు పెరుగుతాయి" అని బ్రాహ్మణ మహాసంఘం ప్రతినిధి ఆనంద్ దవే మీడియాతో అన్నారు.

ఇంతకూ దళితులు నిర్వహించే ఈ ఉత్సవం పట్ల బ్రాహ్మణ మహాసంఘానికి అభ్యంతరం ఎందుకు?

ఫొటో సోర్స్, SAM PANTHAKY/AFP/Getty Images

ఫొటో క్యాప్షన్,

గుజరాత్ విధానసభకు ఎన్నికైన యువ దళిత నేత జిగ్నేష్ మేవానీ దళితుల విజయోత్సవంలో పాల్గొంటారు.

దళితుల ఉత్సవం

ఇది అర్థం కావాలంటే పేష్వా పాలకులు పంచములైన (అంటే చాతుర్వర్ణ వ్యవస్థకు వెలుపల ఉండే కులాలు) మహార్లను ఎలా చూసేవారో తెలుసుకోవాలి. మహార్ల సామాజిక, ఆర్థిక దుస్థితికి కారణమైన సామాజిక వ్యవస్థను నిలిపి ఉంచడం కోసం వారు కుల వివక్ష నియమాలను ఎంత కఠినంగా అమలు చేశారో కూడా అర్థం చేసుకోవాలి.

సరిగ్గా రెండు వందల సంవత్సరాల క్రితం, 1818 జనవరి 1న అంటరానివారిగా పిలిచే దాదాపు 800 మంది మహార్లు చిత్పావన్ బ్రాహ్మణుడైన పేష్వా బాజీరావు-2కు చెందిన 28 వేల సైన్యాన్ని చిత్తుగా ఓడించారు. ఆ మహార్ సైనికులంతా ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున పోరాడారు. ఈ యుద్ధం తర్వాతే పేష్వాల రాజ్యం అంతమైంది.

వీడియో క్యాప్షన్,

జిన్నీ మాహీ: పాప్‌ సంగీతంలో దళిత గొంతుక!

ఈసారి, కొత్త సంవత్సరం 2018 తొలి రోజున దేశంలోని అనేక ప్రాంతాల నుంచి దళితులు వేల సంఖ్యలో కోరెగాం-భీమాకు చేరుకొని తమ విజయపు 200వ వార్షికోత్సవం జరుపుకోవాలనుకుంటున్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో అచ్చయిన కథనం ప్రకారం, గుజరాత్‌లోని వడగాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన యువ దళిత నేత జిగ్నేష్ మేవానీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.

ఫొటో సోర్స్, DOUGLAS E. CURRAN/AFP/Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

ఆత్మగౌరవం కోసం జరిగిన పోరాటం

మహార్లకూ, పేష్వా సైన్యాలకూ మధ్య జరిగిన ఈ యుద్ధాన్ని విదేశీ ఆక్రమణదారులైన ఆంగ్లేయులకు వ్యతిరేకంగా భారతీయ పాలకులు చేసిన యుద్ధంగా చరిత్రకారులు చెప్పేది కూడా వాస్తవ విరుద్ధమైందేమీ కాదు. అయితే, మహార్లు ఆంగ్లేయులతో చేయి కలిపి బ్రాహ్మణ పేష్వాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందనే ప్రశ్న మాత్రం తప్పక వేసుకోవాల్సిందే.

మహార్ల దృష్టితో చూసినపుడు ఇది ఆంగ్లేయుల కోసం చేసిన యుద్ధం కాదు, తమ ఆత్మ గౌరవం కోసం చేసిన యుద్ధం. దీనిని చిత్పావన్ బ్రాహ్మణ వ్యవస్థపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం లభించిన అవకాశంగా వారు భావించారు. ఎందుకంటే, రెండు వందల యేళ్ల క్రితం పేష్వా పాలకులు మహార్లను పశువులకన్నా హీనంగా చూశారు.

ఫొటో సోర్స్, Getty Images

పంచములు, అంటే వర్ణవ్యవస్థకు వెలుపలి వారిగా భావించే 'అంటరాని' వారి పట్ల ప్రాచీన భారతదేశంలో మిగతా అన్ని చోట్లలో ఎలా వ్యవహరించారో పేష్వా పాలకులు కూడా మహార్లతో అలాగే వ్యవహరించారు.

చరిత్రకారులు పలు సందర్భాలలో ఇచ్చిన వివరాల ప్రకారం, మహార్లు నగరం లోపలికి ప్రవేశించేటప్పుడు నడుముకు చీపురుకట్ట కట్టుకోవాల్సి వచ్చేది. అలా వారు తాము నడవడం వల్ల ఏర్పడ్డ 'కాలుష్యాన్ని', తమ కాలి అడుగుల వల్ల జరిగిన 'అపవిత్రత'నూ వారే ఊడ్చేసుకునేవారన్న మాట. అంతేకాదు, వారు తమ మెడలో ఎప్పుడూ ఓ ముంతను వేలాడేసుకోవాల్సి వచ్చేది. ఎప్పుడైనా ఉమ్మి వేయాల్సి వస్తే ఆ ముంతలోనే వెయ్యాలి. ఎందుకంటే వారి ఉమ్మి వల్ల సవర్ణులు 'కలుషితం', 'అపవిత్రం' అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి. ఇక ఆనాడు సవర్ణులు ఉపయోగించే బావుల నుంచి లేదా కొలనుల నుంచి నీరు తోడుకోవడం అన్నది ఊహకు కూడా అందనిది.

ఫొటో సోర్స్, CLASSIC IMAGE ALAMY

ఫొటో క్యాప్షన్,

1680లో ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్‌లో స్థాపించిన ఓ ఫ్యాక్టరీ

బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ

ఇవన్నీ ప్రాచీన భారతదేశంలో అమలైన ఆచారాలు. వీటికి వ్యతిరేకంగా బౌద్ధులు, జైనులు లేదా అజిత కేసకంబాలి వంటి వారు అనేకసార్లు తిరుగుబాటు చేశారు. అయితే ప్రతి తిరుగుబాటు తర్వాత దళిత వ్యతిరేక వ్యవస్థలనే మళ్లీ మళ్లీ నెలకొల్పారు.

ఇలాంటి వ్యవస్థలో మగ్గిపోయిన మహార్ దళితులు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో చేరి పోరాడారు. అలా వారు పేష్వా సైనికులతో పాటు చిత్పావన్ బ్రాహ్మణ పాలకుల క్రూర వ్యవస్థపై కూడా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు.

ఇప్పుడా యుద్ధం జరిగి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, 2018 జనవరి 1న వందలాది దళిత సంఘాలకు చెందిన వేలాది మంది కోరెగాం-భీమాలో సమీకృతమవుతారు. కానీ వారక్కడ జరుపుకునే ఉత్సవం ఈస్ట్ ఇండియా కంపెనీ సాధించిన విజయాన్ని గుర్తు చేసుకునేందుకు కాదు, వివక్ష ఆధారంగా నడిచిన బ్రాహ్మణవాద పేష్వా వ్యవస్థపై దళితులు సాధించిన విజయాన్ని గుర్తు చేసుకునేందుకే.

వీడియో క్యాప్షన్,

భారతదేశాన్ని చూసి మేము ఎందుకు గర్వపడాలి-రచయిత్రి సుజాత గిడ్ల

కుల వివక్షకు ఆధారాలు

ఈ వేడుకల్లో పాల్గొనే దళితుల దృష్టిలో రెండొందల ఏళ్ల కిందటి చరిత్రకి ఉన్నది కేవలం సాంకేతిక ప్రాధాన్యతే. ఎందుకంటే కుల వివక్షకు సంబంధించిన ఆధారాలు వర్తమాన కాలంలో జరుగుతున్న అనేక వాస్తవిక ఘటనల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వాస్తవిక ఉదాహరణలే వారికి తమవైన రాజకీయ వైఖరులు తీసుకునేలా తోడ్పడుతున్నాయి.

ఉదాహరణకు చెప్పుకోవాలంటే.. సహారన్‌పూర్‌కు చెందిన యువ దళిత నేత చంద్రశేఖర్ ఆజాద్ 'రావణ్'కు కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ యోగి నాయకత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆయనను జైలులోంచి బయటకు రానివ్వకుండా జాతీయ భద్రతా చట్టాన్ని ఎలా ప్రయోగించిందో దళిత యువత చూస్తూనే ఉంది.

మరోవైపు, పహలూ ఖాన్ హత్య కేసులో పట్టుబడిన ఆరుగురు నిందితులపై బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆరోపణలు వెనక్కి తీసుకోవడం వంటి ఉదంతాలను కూడా వారు గమనిస్తున్నారు. దాద్రీలో మహ్మద్ అఖ్లాఖ్ హత్య కేసులో నిందితుడిగా ఉండి అరెస్టైన ఒక వ్యక్తి మరణించగా, అతనికి దేశ సంస్కృతి మంత్రి మహేశ్ శర్మ అమరవీరుల తరహాలో శ్రద్ధాంజలి ఘటించిన ఘటనలూ వారి దృష్టిలో ఉన్నాయి.

మహార్ సైనికుల విజయం

రాజస్థాన్‌లోని రాజసమంద్ పట్టణంలో అఫ్రాజుద్దీన్‌ను అందరి కళ్లెదుటే హత్య చేసిన శంభూలాల్ అనే హిందుత్వ మద్దతుదారుడి గురించి పోలీసులు ఇప్పుడు ఇది కేవలం అపోహ ఫలితంగా జరిగిన హత్యే అని మాట్లాడుతున్నారు.

బహదూర్‌గఢ్ సమీపంలో నడుస్తున్న రైలులో ఒక మూకుమ్మడి దాడిలో ప్రాణాలు కోల్పోయిన జునైద్ కుటుంబ సభ్యులు పోలీసులు చేస్తున్న దర్యాప్తు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కాబట్టి మహార్ సైనికులు సాధించిన విజయానికి రెండొందల ఏళ్లు పూర్తయిన సందర్భంగా కోరెగాం-భీమాలో జరిగే వేడుకల్లో పాల్గొనే దళితులు నేటి రాజకీయాల్లో తమ స్థానాన్ని వెతుక్కునే ప్రయత్నం చేయడంతో పాటు, బ్రాహ్మణవాద పేష్వా వ్యవస్థ తమకు ఆదర్శమని చెప్పుకునే హిందుత్వ భావజాలంపై కూడా దాడికి దిగనున్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)