మొఘల్ చక్రవర్తుల కాలంలో క్రిస్మస్ ఎలా జరిగేది?

  • ఆర్వీ స్మిత్
  • బీబీసీ కోసం
క్రిస్మస్

ఫొటో సోర్స్, Getty Images

మొఘలుల కాలంలో క్రిస్మస్ జరుపుకునేవారంటే నమ్మగలరా? అవును, దిల్లీలో ఇప్పుడంటే ఎక్కడ చూసినా క్రిస్మస్ హడావుడే కనిపిస్తోంది. కానీ ఇది ఇప్పుడు మొదలైంది కాదు... మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలోనే ఈ సంస్కృతి మొదలైంది.

మధ్యలో ఔరంగజేబు వంటి కొందరి పాలనలో ఈ పండగను జరపడం ఆగిపోయినా తర్వాత షా ఆలమ్ వరకూ ఇది కొనసాగింది.

మొఘలుల కాలంలో ఆగ్రా అంటే అద్భుత నగరం. యూరోపియన్లు ఇక్కడికి వస్తే నగర అందాలు, భవంతులు, యమునా నదిని చూసి పులకించిపోయేవారని థామస్ స్మిత్ అనే రచయిత పేర్కొన్నారు.

ఇదో మహానగరం, ఇటలీ నుంచి నగల వర్తకులు, పోర్చుగీస్, డచ్‌కు చెందిన ఓడల యజమానులు, ఫ్రెంచ్ యాత్రికులు, మధ్య ఆసియా, ఇరాన్‌లకు చెందిన వ్యాపారులు, కళాకారులు, విద్యావేత్తలు ఎందరో ఇక్కడకు వచ్చి వెళ్తుంటారు.

ఇలా ఎన్నో దేశాలవారు ఆగ్రాకు రావడంతో ఆ రోజుల్లోనే క్రిస్మస్‌కు ఇక్కడ ప్రాధాన్యం ఏర్పడింది.

భారత్‌లో మొఘలుల పాలన కన్నా ఎన్నో సంవత్సరాల క్రితమే మధ్య యూరప్‌లో క్రీస్తు పుట్టుకపై వీధి నాటకాలు వేసేవారు. ఆ తర్వాత అక్బర్ ఓ క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ మత పెద్దలను ఆగ్రాకు ఆహ్వానించారు. అలా ఆగ్రాలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి.

పండుగ నాడు మార్కెట్లు, వీధులన్నీ పండగ కళను సంతరించుకునేవి. వివిధ రకాల లైట్ల కాంతుల్లో ఎన్నో దేశాల జెండాలు నగరమంతా రెపరెపలాడేవి.

రకరకాల వాయిద్యాల మోతలు, బాణసంచాల పేలుళ్లు, చర్చి గంటల శబ్దాలతో మారుమోగిపోయేది. ఆ వెలుగుల్లో ఆగ్రా నగరం మరింత అందంగా కనపడేది. నగరంలో ఓ పెద్ద చర్చిని నిర్మించుకునేందుకు అక్బర్ ఆనాడే క్రైస్తవులకు అనుమతినిచ్చారు. ఆ చర్చికి అమర్చిన ఓ పెద్ద గంట తర్వాత జహంగీర్ కాలంలో ఊడి పడిపోయింది.

అక్బర్, ఆ తర్వాత జహంగీర్... ఇద్దరూ క్రిస్మస్ రోజున ఆగ్రా కోటలో క్రైస్తవులతో కలసి భోజనం చేసేవారు. అక్బర్ తన పరివారంతో సహా చర్చికి వచ్చి, క్రైస్తవ మత పెద్దలను కలుసుకునేవారు.

రాణివాస స్త్రీలు కూడా సాయంత్రం సమయంలో చర్చికి వెళ్లి కొవ్వొత్తులను అందజేసేవారు. ఇలా ప్రతి సంవత్సరం చేసేవారు.

యూరోపియన్లలో ఒకరినొకరు తిట్టుకునేవారు, ఒకరిపై ఒకరు అసూయపడేవారు కూడా ఆ రోజున మాత్రం ఈర్ష్యాద్వేషాలు పక్కన పెట్టి కలసి మెలసి క్రిస్మస్‌ను జరుపుకునేవారు.

చీకటి పడిన తర్వాత చిన్నపిల్లలకు దేవకన్యలుగా వేషం వేసి, క్రీస్తు పుట్టుక గురించి నాటకాలు వేయించేవారు. బ్రిటిష్ పాలకుల కార్యాలయం ఉన్న ఫులాట్టి బజార్లో దీనికి సంబంధించిన రిహార్సల్స్ జరిగేవి. ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా అక్బర్, జహంగీర్ కాలంలో సైనికుల్ని కూడా ఏర్పాటుచేసేవారు.

క్రిస్మస్

ఫొటో సోర్స్, Getty Images

పోర్చుగీసు వారితో ఘర్షణల కారణంగా 1632లో షాజహాన్ ఈ చర్చిని కూలగొట్టించాడు. అంతేకాకుండా బహిరంగంగా ప్రార్థనలు చేయకూడదంటూ క్రైస్తవులపై నిషేధం విధించాడు. మళ్లీ 1640లో పోర్చుగీసువారితో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడటంతో ఈ నిషేధాన్ని కొంత మేరకు సడలించారు. మళ్లీ చర్చిని నిర్మించుకునేందుకు అనుమతించారు.

ఆగ్రాలో ఇప్పుడున్న చర్చి అప్పుడు నిర్మించినదే.

తర్వాత కాలంలో కూడా షా ఆలమ్, అక్బర్ షా సైనీ, బహదూర్ షా జాఫర్ చక్రవర్తులు కూడా క్రిస్మస్‌ పండుగను అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులతో కలసి జరుపుకున్నారు. కానీ రాత్రిపూట నాటకాల్ని మాత్రం క్రైస్తవ మత పెద్ద డొమినిక్ ఆర్థాయిడ్ మళ్లీ 1958లో పునరుద్ధరించాడు.

ఆనాటి చక్రవర్తులు ఇప్పుడు లేకపోయినా, వారు అందించిన మత సామరస్య భావాలు మాత్రం ఇంకా ఆగ్రాలోనే కాదు, దేశమంతా నిండి ఉన్నాయి.

అందరూ క్రిస్మస్ పండుగను భక్తితో జరుపుకోవాలనుకుంటున్నారు కానీ క్రీస్తు పుట్టుకపై వీధి నాటకాలు వేసే సంప్రదాయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)