ఆర్కే నగర్‌: బీజేపీ కంటే నోటాకే ఎక్కువ ఓట్లు!

  • 24 డిసెంబర్ 2017
దినకరన్
చిత్రం శీర్షిక టీటీవీ దినకరన్

తమిళనాడులోని ఆర్కే నగర్‌లో జరిగిన ఉపఎన్నికలో శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ భారీ ఆధిక్యంతో విజయం సాధించారు.

మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఈ స్థానం ఖాళీ కాగా ఈ ఉపఎన్నిక జరిగింది. ఆదివారం వెలువడిన ఈ ఉపఎన్నిక ఫలితాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం.

జయలలితకు మించిన మెజార్టీ

2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్కే నగర్ నియోజకవర్గంలో జయలలితకు 97,218 ఓట్లు పోలయ్యాయి. ఆమె ప్రత్యర్థి పార్టీ డీఎంకే తరఫున పోటీచేసిన షిమ్లా ముత్తుచోళన్‌కు 57,673 ఓట్లు వచ్చాయి.

జయలలిత 39,545 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తాజా ఉప ఎన్నికలో దినకరన్ 40,707 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన టీటీవీ దినకరన్‌కు 89,013 ఓట్లు పడగా, రెండో స్థానంలో నిలిచిన ఏఐఏడీఎంకే అభ్యర్థి మధుసూధనన్‌కు 48,306 ఓట్లు పోలయ్యాయి.

పోస్టల్ ఓట్లు

ఈ ఉప ఎన్నికలో అత్యంత ఆసక్తికర విషయం పోస్టు ద్వారా ఒకే ఒక్క ఓటు పోలైంది. అది డీఎంకే అభ్యర్థి మారుధు గణేష్‌కు పడింది.

బీజేపీ కంటే నోటాకే ఎక్కువ!

బీజేపీ అభ్యర్థికి పడిన మొత్తం ఓట్ల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 1,417 ఓట్లు పడగా, నోటాకు 2,373 ఓట్లు వచ్చాయి.

దశాబ్దం తర్వాత స్వతంత్ర అభ్యర్థి విజయం

దశాబ్ద కాలం తర్వాత తమిళనాడులో ఓ స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. 2006లో జరిగిన ఎన్నికల్లో 'తల్లీ' నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌గా పోటీచేసిన రామచంద్రన్ విజయం సాధించారు.

57 మంది డిపాజిట్లు గల్లంతు

ఈ ఉపఎన్నికలో డీఎంకే తరఫున పోటీచేసిన మారుధు గణేష్ డిపాజిట్ కోల్పోయారు. మూడో స్థానంలో నిలిచిన ఆయనకు 24,651 ఓట్లు పడ్డాయి.

గణేష్‌ సహా ఈ ఎన్నికలో మొత్తం 57 మంది డిపాజిట్లు కోల్పోయారు.

19 రౌండ్లలోనూ అదే దూకుడు

ఓట్ల లెక్కింపు జరిగిన మొత్తం 19 రౌండ్లలోనూ టీటీవీ దినకరన్ ఆధిక్యంతో దూసుకెళ్లారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)