ప్రెస్ రివ్యూ: నారా లోకేష్ లాంటి మంత్రి దొరకడం ఆంధ్రప్రదేశ్ అదృష్టం - బాలకృష్ణ

  • 25 డిసెంబర్ 2017
నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ Image copyright NARA LOKESH/FACEBOOK

''నాన్నగారు ఏ కొత్త ప్రయత్నం చేసినా.. అభిమానుల అనుమతి తీసుకోలేదు. కానీ ప్రేక్షకులు ఆదరించారు. నేనూ అంతే’’ అని సినీ నటుడు బాలకృష్ణ అన్నారు.

విజయవాడలో ఆదివారం సాయంత్రం 'జై సింహా' చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. బాలకృష్ణ అల్లుడు, ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘మా అల్లుడు నారా లోకేష్‌ ప్రతిభావంతుడు. ఇంత మంచి అల్లుడు దొరకడం నా అదృష్టం. ఇలాంటి మంత్రి దొరకడం ఆంధ్రప్రదేశ్‌ అదృష్టం. ఇలాంటి యువకులు రావాలి.. కొత్త కొత్త ఆలోచనలతో అహర్నిశలూ సమాజం కోసం పాటుపడాలి'' అని చెప్పారు.

అంతకు ముందు నారా లోకేశ్ మాట్లాడుతూ.. ''సినిమా పరిశ్రమలో చాలా మంది హీరోలున్నారు. కానీ మనసులో ఉన్న మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ఏకైక కథానాయకుడు బాలకృష్ణ. హిందూపురం శాసన సభ్యుడిగా ఆయన సమర్థవంతంగా పనిచేస్తున్నారు. బసవతారకం కేన్సర్‌ ఆసుపత్రి నిర్వహణ కూడా చక్కగా చూసుకుంటున్నారు. త్వరలో అమరావతిలో కూడా కేన్సర్‌ ఆసుపత్రిని ప్రారంభించబోతున్నారు'' అన్నారు అని ఈనాడు పత్రిక పేర్కొంది.

చిరునామా మార్చినా ఐటీ పట్టేస్తుంది

‘‘చిరునామా మార్చి ఆదాయపు పన్ను ఎగవేయాలనుకుంటే ఇక ఆ పప్పులు ఉడకవు. బ్యాంకులు, బీమా కంపెనీలు లేదా మున్సిపల్‌ కార్పొరేషన్ల వంటి స్థానిక సంస్థల డేటా బేస్‌ల నుంచీ ఐటీ అధికారులు ఎగవేతదారుల చిరునామాలు సంపాదించి ముక్కుపిండి మరీ పన్నులు వసూలు చేస్తారు. ఇంకా అవసరమైతే డ్రైవింగ్‌ లైసెన్సు, ఓటర్ల గుర్తింపు కార్డుల్లో ఉన్న వివరాల ఆధారంగానూ పన్ను ఎగవేతదారుల చిరునామాలు కనుక్కుని నోటీసులు జారీ చేసి మరీ పన్నులు వసూలు చేస్తారు’’ అని ఆంధ్రజ్యోతి రాసింది.

ఇప్పటివరకు ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లించకపోయినా లేదా ఏవైనా తప్పులు చేస్తే పాన్‌ కార్డు, ఐటీ రిటర్న్స్‌లో పేర్కొన్న చిరునామాలకే నోటీసులు పంపించేవారు. కొంత మంది పన్నులు ఎగవేసేందుకు చిరునామా మార్చి నోటీసులు అందుకోకుండా ఐటీ శాఖను ఏమార్చారు. దీంతో ఐటీ చట్టంలో అవసరమైన మార్పులు చేశారు. ఈ మార్పులతో.. అడ్రస్‌లు మార్చి ఆదాయ పన్ను ఎగవేసే వారికి, నోటీసులు అందుకోకుండా తప్పించుకునే వారికి ఇక తిప్పలు తప్పవు.

Image copyright SAM PANTHAKY/AFP/Getty Images

పులికాట్‌కు రొయ్యకాటు

పులికాట్‌ సరస్సును రొయ్యల సాగు రూపంలో కాలుష్య భూతం కాటేస్తోందని 'సాక్షి' తన కథనంలో పేర్కొంది.

''తమిళనాడులో విచ్చలవిడిగా సాగిస్తున్న రొయ్యల సాగుతో సరస్సు దెబ్బతింటోంది. మత్స్య సంపద నశిస్తోంది. ఈ సరస్సుపై ఆధారపడిన 17 గ్రామాలకు చెందిన 10 వేల మందికి పైగా ఆంధ్రా మత్స్యకారుల ఉపాధికి గండి పడుతోంది. ఆంధ్రా-తమిళనాడు సరిహద్దుల్లో సుమారు 620 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పులికాట్‌ సరస్సు విస్తరించి ఉంది. ఆంధ్రా పరిధిలో 500 చ.కి.మీటర్లలో.. తమిళనాడులో 120 చ.కి.మీటర్ల పరిధిలో ఉంది. దీనికి సుమారు ఐదు కిలోమీటర్ల వరకు కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌ ఉంటుంది. దీని పరిధిలో ఎక్కడా రొయ్యలు సాగు చేపట్టకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అమలవుతుండగా.. తమిళనాడులో పట్టించుకునే దిక్కులేదు. ఆంధ్రా-తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన పన్నంగాడు గ్రామానికి సమీపంలోని తమిళనాడు భూభాగంలో సుమారు 100 ఎకరాలకు పైగా అక్కడి వ్యాపారులు రొయ్యల సాగు చేస్తున్నారు. ఇందులో నుంచి వచ్చే వ్యర్థ జలాలన్నీ పులికాట్‌ సరస్సులో నేరుగా వదిలేస్తున్నారు'' అని సాక్షి రాసింది.

పులికాట్‌ వన్యప్రాణి సంరక్షణ విభాగ చట్టాన్ని సైతం అతిక్రమించి సున్నపుగుల్ల కంపెనీలనూ ఏర్పాటు చేశారని పత్రిక తెలిపింది. పులికాట్‌ సరస్సులో 2001 సంవత్సరం నుంచి చేపల ఉత్పత్తి కూడా తగ్గుతూ వస్తోందని చెప్పింది.

Image copyright Getty Images

'ఆలస్యమే ఆ రైళ్ల ప్రత్యేకత'

సెలవుల్లో ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రత్యేక రైళ్లు వేస్తున్నామని ఘనంగా చెబుతున్న రైల్వే శాఖ సమయపాలనలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోందని 'ఈనాడు' పేర్కొంది.

కనీసం మూడు నుంచి నాలుగు గంటలు ఆలస్యంగా రైళ్లు బయల్దేరుతున్నాయని తెలిపింది. ''విచారణ కేంద్రంలో అడిగినా ఏ రైలు ఎప్పుడు, ఏ ప్లాట్‌ఫాంపై వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. చిన్నపిల్లలు, వృద్ధులు నానా అగచాట్ల పాలవుతున్నారు'' అని వివరించింది.

కాచిగూడ నుంచి కాకినాడకు శనివారం రాత్రి 7:50 గంటలకు బయల్దేరాల్సిన ప్రత్యేక రైలు రాత్రి 11 గంటలకు బయల్దేరిందని పత్రిక రాసింది. రోజూ నడిచే రైళ్ల కంటే ప్రత్యేక రైళ్లలో ఛార్జీలు రూ.90 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని పేర్కొంది.

మహిళా ఖైదీలకు భరోసా కరువు

దేశంలో మహిళా ఖైదీలు మానసిక క్షోభను అనుభవిస్తున్నారని 'నవ తెలంగాణ' పేర్కొంది. వారికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నా నాన్చుడు ధోరణినే అనుసరిస్తోందని తెలిపింది.

''పిల్లలను వదిలి ఉండలేక ఆవేదన చెందుతున్న మహిళలు కొందరైతే.. మరికొందరు ఆప్తులకు దూరమై ఒంటరి జీవితం గడపాల్సి వస్తోందన్న బాధలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 1,401 జైళ్లు ఉంటే.. కేవలం 18 మంది సైక్రియాట్రిస్టులు, సైకాలజిస్టులు పని చేస్తుండటం కారాగారాల దుస్థితికి అద్దం పడుతున్నది. సరిపడా మానసిక వైద్య నిపుణులను నియమించి మహిళా ఖైదీలకు కౌన్సెలింగ్‌ ఇప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది'' అంటూ బీజేపీ ఎంపీ బిజోయా చక్రవర్తి నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ శుక్రవారం లోక్‌సభకు ఒక నివేదికను అందించింది.

2015 జైళ్ల గణాంకాలు, తాజా వివరాల ప్రకారం దేశంలోని జైళ్లలో 17,834 మంది మహిళలు శిక్షను అనుభవిస్తున్నారు. వీరిలో 347 మంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)