ప్రకాశ్ ఆమ్టే: పులులు, ఎలుగుబంట్లు, మొసళ్లు ఈయన నేస్తాలు

వీడియో క్యాప్షన్,

క్రూర జంతువులు ఈయనకు నేస్తాలు!

మహారాష్ట్రలోని మారుమూల ఆదివాసీ గ్రామంలో ఓ ప్రైవేటు జంతు సంరక్షణ కేంద్రం ఉంది.

కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులే కాదు.. క్రూర జంతువులుగా భావించే చిరుతలు.. హైనాలు.. పాములు కూడా మనుషులతో ఎంతో ప్రేమగా మెలుగుతాయన్న విషయం అక్కడికి వెళ్తే అర్థమవుతుంది. అది యానిమల్ ఆర్క్.

ఆదివాసీల సంక్షేమం కోసం గడ్చిరోలి జిల్లాలోని మారూమూల హేమల్కాస గ్రామంలో 44 ఏళ్ల క్రితం(1972లో) డాక్టర్ ప్రకాశ్ ఆమ్టే, తన సన్నిహితులకో కలిసి సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. ఆయన బాబా ఆమ్టే కుమారుడు అని ఇవాళ ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు, తండ్రి నుంచి వచ్చిన సేవా వారసత్వాన్ని కొనసాగించడమే కాదు, దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు ప్రకాశ్ ఆమ్టే. నగరాల నొదిలి తన మెడికల్ పరిజ్ఞానాన్ని ఆదివాసీలకు ఉపయోగించడానికి గడ్చిరోలి ప్రాంతాన్ని కార్యక్షేత్రంగా మలుచుకున్న సేవాజీవి. తాను ఎంచుకున్న రంగంలో తాను ఎంచుకున్న పరిధిలో నిశ్శబ్దంగా పనిచేసుకుపోయే అరుదైన కోవకు చెందిన మనిషి. అడవి బిడ్డలకే కాదు, అదే అడవి జీవులకు, అందులోనూ క్రూరమృగాలుగా పిలుచుకునే వాటికి సైతం నాన్నగా మారారు.

కళ్లు తెరవకముందే తల్లికి దూరమైన జంతువుల కూనలను చేరదీసి సంరక్షించేందుకు 1973లో ఒక కేంద్రాన్ని ప్రారంభించారు.

దాదాపు 50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ జంతుశాలలో అనేక రకాల వన్యప్రాణులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. 1991లో దానికి జంతు సంరక్షణ కేంద్రంగా ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది.

ఫొటో క్యాప్షన్,

ఈ సంరక్షణ కేంద్రంలో దాదాపు 100 రకాల జంతువులు, పక్షులు ఉన్నాయి

పాములతో చిన్నారులస్నేహం

ప్రస్తుతం చిరుతలు, హైనాలు.. జింకలు.. బ్లూ బుల్స్.. ఎలుగు బంట్లు.. మొసళ్లు.. నక్కలు.. ఉడుములు.. పాములు.. నెమళ్లు.. గుడ్ల గూబలు.. ఇలా దాదాపు 100 రకాల జంతువులు.. పక్షులు ఉన్నాయి.

చిరుత పులులు, హైనాలు క్రూర జంతువులన్న భయం చాలా మందికి ఉంటుంది. కానీ, ప్రకాశ్ ఆమ్టే మాత్రం వాటితోనే స్నేహం చేస్తారు. రోజూ వాటి మధ్యే తిరుగుతారు. పాములతో చిన్నారులు సరదాగా ఆడుకుంటారు.

ఈ నాలుగు దశాబ్దాల కాలంలో ఏనాడూ ఈ జంతువులు తమపై దాడి చేయలేదని నిర్వాహకులు చెబుతున్నారు.

ఇతర పెంపుడు జంతువుల్లాగే ఇవి కూడా మనుషులతో ఎంతో ప్రేమను చూపిస్తాయని అంటున్నారు.

వన్యప్రాణుల సంరక్షణ కోసం చేస్తున్న సేవకు గుర్తింపుగా ప్రకాశ్ ఆమ్టేను రామన్ మెగసెసె అవార్డు వరించింది.

ఫొటో సోర్స్, LOKBIRADARI PRAKALP

అడ్డంకిగా మారుతున్న ప్రభుత్వ నిబంధనలు

అయితే, 2009లో కేంద్ర అటవీ శాఖ ప్రవేశపెట్టిన నిబంధనలు ఈ జూ నిర్వహణకు అడ్డంకిగా మారుతున్నాయి.

ఆ నిబంధనల ప్రకారం వన్యప్రాణులను తాకడం నిశిద్ధం. అలా చేసిన వారు శిక్షార్హులవుతారు.

అందుకే, ప్రకాశ్ ఆమ్టేకు 2017 అక్టోబర్‌లో సెంట్రల్ జూ అథారిటీ నోటీసులు పంపింది. అధికారులను ఎన్ని సార్లు కలిసినా ఫలితం లేదని ప్రకాశ్ ఆమ్టే చెబుతున్నారు.

ఈ విషయంపై సెంట్రల్ జూ అథారిటీ అధికారులను బీబీసీ సంప్రదించగా.. జూ నిర్వాహకులకు జారీ చేసిన నోటీసును మాత్రమే చూపించారు. ఇతర వివారాలేవీ వెల్లడించలేదు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)