ప్రెస్‌రివ్యూ: మార్పులు తేవడంలో మావోయిస్టులు విఫలమయ్యారు - జంపన్న

మావోయిస్టులు

ఫొటో సోర్స్, Alok Putul

భారతదేశంలో ప్రస్తుతం వచ్చిన మార్పులకు తగ్గట్లుగా మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల్లో మార్పులు రావటం లేదని పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న చెప్పారు.

సైద్ధాంతిక సమస్యలతోనే తాను విప్లవ జీవితాన్ని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సోమవారం పోలీస్ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ డీజీపీ సమక్షంలో తన భార్య రజితతో కలసి పోలీసుల ఎదుట లొంగిపోయిన జంపన్న.. ఈ సందర్భంగా మీడియాకు పలు విషయాలు వెల్లడించారు.

‘‘పీపుల్స్ ‌వార్, ఆ తర్వాత సీపీఐ మావోయిస్టు లైన్ ఆనాటి పరిస్థితులకు సరైనదే. అయితే గత 10, 15 ఏండ్లలో దేశంలో అనేక సామాజిక మార్పులు వచ్చాయి.. వస్తున్నాయి. ప్రత్యేకంగా మావోయిస్టు పార్టీ ప్రజాయుత పోరాట పంథాకు మూలమైన అర్థ భూస్వామ్య విధానం ఇప్పుడు లేదు. అయితే, మారిన పరిస్థితులకు అనుగుణంగా పార్టీలో మార్పులు రావటం లేదు. రైతాంగం, కార్మిక వర్గాలు, ఉద్యోగస్తులు, విద్యార్థులకు చేరువవడంలో, ప్రజలతో కలసి పనిచేయటంలో పార్టీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నది. ఇప్పుడున్న విధానాలకు తగ్గట్టుగా మార్పులు తేవటంలో మావోయిస్టులు విఫలమయ్యారు’’ అని జంపన్న చెప్పినట్లు ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ప్రచురించింది.

తెలుగు సినీ పరిశ్రమ(టాలీవుడ్‌)ను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సినిమాలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చి ఆకర్షించాలని యత్నిస్తోంది.

ఈ మేరకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) ప్రతిపాదనలు సిద్ధం చేసిందని 'సాక్షి' పత్రిక తెలిపింది.

''ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. అనంతవరంలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలోని 5,167 ఎకరాల్లో మీడియా సిటీని ప్రభుత్వం ప్రతిపాదించింది. అక్కడ సినీ-టెలివిజన్‌ పరిశ్రమ, యానిమేషన్‌-వీఎఫ్‌ఎక్స్‌-గేమింగ్, డిజిటల్‌ యాడ్‌-సోషల్‌ మీడియా, టెలికం రంగాలను ప్రోత్సహించనుంది. అమరావతిలో 20 నుంచి 30 ఎకరాల్లో స్టూడియో నెలకొల్పడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీన్ని ఏర్పాటు చేసే సంస్థలకు నామమాత్రపు ధర(ఎకరం రూ. 50 లక్షలు)కు భూములిస్తామని ప్రకటించింది. సినిమాలకు సింగిల్‌ విండో అనుమతులిచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది. అమరావతిలో ప్రారంభించే తెలుగు వార్తాఛానళ్లకు తక్కువ ధరకే భూములివ్వాలని నిర్ణయించింది'' అని పత్రిక రాసింది.

ఫొటో సోర్స్, nizamabad.telangana.gov.in

30 గౌడ కుటుంబాల బహిష్కరణ

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం వడ్యాట్ గ్రామ అభివృద్ధి కమిటీ(వీడీసీ) 30 గౌడ కుటుంబాలను ఊరి నుంచి బహిష్కరిస్తున్నట్లు తీర్మానం చేసిందని 'నవ తెలంగాణ' పత్రిక తెలిపింది. వారికి గ్రామంలో ఎవరూ సహకరించవద్దని హుకుం జారీచేసిందని తెలిపింది.

''వడ్యాట్ గ్రామంలోని 325, 326(బీ), 329 సర్వే నంబర్లలో గొల్లపల్లి పద్మ, ఆంజనేయులు(గౌడ సామాజిక తరగతి)కు పట్టా భూమి ఉంది. కొద్ది దూరంలో చెక్‌డ్యామ్ ఉండటంతో వారి పట్టాభూమిలో మట్టికట్టలు వెడల్పుగా ఉన్నాయి. స్థలం వృథా అవుతోందని మట్టికట్టను ఇటీవలే కొంత మేర తొలగించారు. వీడీసీ జోక్యం చేసుకొని, ఆ భూమి గ్రామానిదని, తిరిగి కట్టను నిర్మించాలని ఆ రెండు కుటుంబాలపై ఒత్తిడి తెచ్చింది. భూమి తమదేనని బాధితులు చెప్పారు. గ్రామంలోని ఇతర గౌడ కుటుంబాలు వారికి అండగా నిలిచాయి. మా ఆదేశాన్ని ధిక్కరిస్తారా అంటూ, 30 గౌడ కుటుంబాలను బహిష్కరిస్తూ వీడీసీ తీర్మానం చేసింది'' అని పత్రిక రాసింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫొటో సోర్స్, Sridhr Raju

తిరుమల: ఆన్‌లైన్ టికెట్లలో చేతివాటం

తిరుమలలో రూ.300 దర్శన టికెట్లకు నకళ్లు తీసి, వాటితో భక్తలను మోసగిస్తూ, టీటీడీ ఆదాయానికి గండి కొడుతున్న ముగ్గురిని అధికారులు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారని 'ఆంధ్రజ్యోతి' పత్రిక తెలిపింది.

''రూ.300 ఆన్‌లైన్‌ టికెట్ల స్కానింగ్‌ కౌంటర్‌లో పనిచేసే సురేంద్ర, కనకరాజు దళారీ వాసుతో చేతులు కలిపారు. తిరుపతిలోని ఓ లాడ్జిలో దిగే భక్తులకు దర్శనం చేయిస్తానని వాసు తిరుమల తీసుకొచ్చాడు. కౌంటర్‌లోని సిబ్బంది సహకారంతో డిసెంబరు 25వ తేదీకి సంబంధించిన రూ.300 ఆన్‌లైన్‌ టికెట్‌ను జిరాక్సు తీయించారు. 25 మంది భక్తులకు ఒక్కొక్కటి రూ.1,000 చొప్పున విక్రయించారు. టికెట్‌పై ఉన్న బార్‌ కోడ్‌ను ఒకసారి స్కాన్‌ చేస్తే.. మరోసారి స్కాన్‌ కాదు. స్కాన్‌ కాకపోతే భక్తులను ఆలయంలోకి అనుమతించరు. కనకరాజు, సురేంద్ర జిరాక్స్‌ చేసిన టికెట్లను స్కాన్‌ చేసినట్లు నటించి తొలుత 10 మందిని ఆలయంలోకి పంపారు. తర్వాత మరో 15 మందినీ దర్శనానికి అనుమతిస్తుండగా.. విజిలెన్స్‌ సిబ్బంది పట్టుకున్నారు'' అని పత్రిక రాసింది.

ఫొటో సోర్స్, బీబీసీ

పంచాయతీ ఎన్నికల్లో ఓటుకు నోటిస్తే ఏడాది జైలు

పంచాయతీ ఎన్నికల్లో ఓటుకు నోటు ఎర వేస్తే జిల్లా స్థాయిలోనే అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని, ఇందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి అవసరం లేదని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని వెలువరించిందని 'ఈనాడు' పత్రిక తెలిపింది.

ఈ ఎన్నికల్లో ఓట్లను కొన్నట్లు నేరం రుజువైతే ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. వీటిని 2018 ఆగస్టు లేదా అంతకంటే ముందుగానే నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తంచేస్తోంది.

మా కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)