విజయ్ రూపానీపై బీజేపీకి ఎందుకంత నమ్మకం?

విజయ్ రూపానీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

విజయ్ రూపానీ

విజయ్ రూపానీ మరోసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు గాంధీనగర్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.

ఈసారి గుజరాత్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో సఫలమైనా, పోయిన ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీకి తక్కువ సీట్లు వచ్చాయి. దీంతో ఈసారి ముఖ్యమంత్రిని మారుస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి.

అయితే 99 సీట్లు మాత్రమే వచ్చినా, బీజేపీ మాత్రం మళ్లీ విజయ్ రూపానీపైనే నమ్మకం ఉంచింది. దీనికి కారణం ఏమిటి? ఇది తెలుసుకునేందుకు బీబీసీ ప్రతినిధి ఆదర్శ్ రాథోడ్, సీనియర్ జర్నలిస్ట్ అజయ్ ఉమట్‌తో సంభాషించారు. ఆయన అభిప్రాయం ఏంటంటే:

ఫొటో సోర్స్, Getty Images

రూపానీకి అనుకూలంగా నాలుగు అంశాలు

మొదటిది, రూపానీ నేతృత్వంలో బీజేపీ ఈసారి 49.1 శాతం ఓట్లు సంపాదించింది. గత ఎన్నికలతో పోలిస్తే ఇది 1.25 శాతం ఎక్కువ.

రెండోది, ఎన్నికలకు ముందే అమిత్ షా ఈ ఎన్నికలు రూపానీ నేతృత్వంలో జరుగుతున్నాయని, గెలిస్తే ఆయనే సీఎం అని స్పష్టం చేశారు.

మూడో కారణం, ఇప్పుడు రూపానీని తొలగిస్తే, ఈ ఫలితాలతో తమకు ఎదురుదెబ్బ తగిలిందనే సంకేతాలు వెళ్లడం బీజేపీకి ఇష్టం లేదు.

నాలుగోది, రూపానీని తొలగించి కుల సమీకరణలపరంగా పాటీదార్లకు చెందిన వారిని సీఎంగా నియమిస్తే, ఇతర వర్గాల వారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఓబీసీకి చెందిన వారిని సీఎంగా నియమిస్తే దళితుల నుంచి, పాటిదార్ల పాటీదార్ల నుంచి నిరసనను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో 2019 ఎన్నికల వరకు రూపానీని సీఎంగా కొనసాగించడం ఉత్తమం.

ఇవే కాకుండా.. వ్యక్తిగతంగా కూడా విజయ్ రూపానీకి మంచి పేరుంది. అందువల్లే సీఎంగా రూపానీని, డిప్యూటీ సీఎంగా నితిన్ భాయ్ పటేల్‌ను కొనసాగించాలని బీజేపీ నిర్ణయించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

నితిన్ భాయ్ పటేల్

రూపానీ అవసరం.. నితిన్ పటేల్ అనివార్యత..

ఆనందీ బేన్ పటేల్‌ను తొలగించి, జైన్ వర్గానికి చెందిన విజయ్ రూపానీని సీఎంగా చేసినప్పుడు, పటేల్ వర్గం ఆగ్రహాన్ని తప్పించుకోవడానికి, నితిన్ భాయ్ పటేల్‌ను డిప్యూటీ సీఎంగా చేశారు. ప్రస్తుతం బీజేపీ ఆలోచనా విధానం అలాగే కొనసాగుతోంది. ఇప్పుడు నితిన్ భాయ్‌ను తొలగిస్తే, బీజేపీ పాటీదార్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందనే సంకేతాలు వెలువడే అవకాశం ఉంది.

అందుకే సీఎంగా రూపానీని కొనసాగించడం బీజేపీకి అవసరం కాగా.. డిప్యూటీ సీఎంగా నితిన్ భాయ్ పటేల్‌ను కొనసాగించడం అనివార్యత మారింది.

ఫొటో సోర్స్, Getty Images

పాటీదార్ వర్గం ఈసారి బీజేపీకి దూరమైందన్నది స్పష్టం. అందుకే గుజరాత్‌లోని మొత్తం 33 జిల్లాలలో ఈసారి బీజేపీకి ఏడు జిల్లాలలో ఒక్క సీటూ రాలేదు. మరో తొమ్మిది జిల్లాలలో ఒక్కో సీటు మాత్రమే గెలుచుకోగలిగింది.

అందుకే ప్రధాని బీజేపీ కార్యాలయానికి వెళ్లి సమాజంలోని ఏయే వర్గాలు మన పట్ల ఆగ్రహంగా ఉన్నాయో, వాళ్లను మనవైపు తిప్పుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పాల్సి వచ్చింది.

రూపానీ ప్రమాణ స్వీకారోత్సవానికి 18 రాష్ట్రాల సీఎంలతో పాటు ఆరుగురు పాటీదార్ నేతలను ఆహ్వానించడం కూడా అందుకే. ఆ విధంగా బీజేపీ పాటీదార్ వర్గాన్ని తమవైపే ఉంచుకోవడానికి ప్రయత్నిస్తోంది.

అదే సమయంలో - పాటీదార్ వర్గాన్ని సంతృప్తిపరచి, ఇతర వర్గాల ఆగ్రహానికి గురి కావడానికి తాము సిద్ధంగా లేమనే సంకేతాలనూ ఇస్తోంది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)