పోలవరం ప్రాజెక్టు: ఎప్పుడు మొదలైంది? ఇప్పుడు ఎక్కడుంది?
- వరికూటి రామకృష్ణ
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Twitter/Nara Lokesh
పోలవరం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న సుదీర్ఘ గాథ!
గోదావరి మాదిరిగానే దీని ప్రయాణంలోనూ ఎన్నో మలుపులు.
ఎన్నో అభ్యంతరాలను, అవరోధాలను అధిగమిస్తూ చివరకు జాతీయ హోదాను పొందింది.
అయినా కథ సాఫీగా నడవడం లేదు. అనేక ఒడుదొడుకుల మధ్య పయనిస్తోంది.
సకాలంలో నిధులు ఇవ్వడం లేదంటోంది రాష్ట్రం. ఇచ్చినవాటికి లెక్కలు అడుగుతోంది కేంద్రం. తాను కోరుకున్న పద్ధతిలో పనులు సాగాలంటోంది.
ఇంతకు పోలవరం ఆవశ్యకత ఏమిటి? ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా అభివర్ణిస్తున్న పోలవరం స్వరూపం ఏమిటి?
దీని ద్వారా ఎటువంటి ప్రయోజనాలు కలగనున్నాయి? ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం పదండి..
ఫొటో సోర్స్, NAlle sivakumar
ఇలా ప్రారంభం
పోలవరం ప్రాజెక్ట్ ఆలోచనకు పునాది కొన్ని దశాబ్దాల కిందట పడింది.
1941లో నాటి నీటిపారుదల ముఖ్య ఇంజినీరు ఎల్.వెంకటకృష్ణ అయ్యర్, పోలవరం సమీపంలో గోదావరిపై రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఈ ప్రతిపాదనలను క్షుణ్నంగా పరిశీలించాక ఒక నివేదికను రూపొందించారు. ఈ ప్రాజెక్ట్‌కు రామపాదసాగర్ అని పేరు పెట్టారు.
దీని అంచనా వ్యయం రూ.129 కోట్లు.
విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల అవసరాలకు నీటి తరలింపు.
పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల సాగు, తాగు నీటి అవసరాలను తీర్చడం.
విజయవాడ నుంచి గుండ్లకమ్మ నది వరకు మరో 143 కిలోమీటర్ల కాలువ నిర్మించడం దీని ప్రధాన లక్ష్యాలు.
వెనకడుగు
రామపాదసాగర్ ప్రాజెక్ట్ డిజైన్ పూర్తి అయినప్పటికీ నిర్మాణపరంగా అడుగు ముందుకు పడలేదు.
ఇందుకు ప్రధానంగా రెండు కారణాలున్నాయి.
ఒకటి వ్యయం.. రెండు నిర్మాణంలో ఉన్న సంక్లిష్టత.
పోలవరం నిర్మించాలన్న ప్రాంతంలో భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా లేవు.
డ్యాం కట్టాల్సిన చోట ఎంతో లోతుకు వెళ్తే కానీ భూమిలో గట్టితనం ఉండటం లేదు. మరోవైపు కొండలు, గుట్టలు.
ఖర్చును తట్టుకునే పరిస్థితి లేక ఆనాడు ప్రభుత్వాలు దీనిపై ముందడుగు వేయలేదు.
1953 వరదలు
1953లో గోదావరికి వరదలు వచ్చాయి. ఎంతో నీరు వృథాగా సముద్రంలోకి పోయింది.
మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంటుకు నీటి అవసరాలు అంతకంతకూ పెరిగాయి.
దీంతో గోదావరిపై రిజర్వాయర్ కట్టాలన్న ప్రతిపాదనకు మళ్లీ కదలిక వచ్చింది.
ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాలతో కొన్ని ఒప్పందాలు జరిగాయి.
ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు
బచావత్ ట్రైబ్యునల్ అవార్డులో భాగంగా పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి కొన్ని ఒప్పందాలు జరిగాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశాలు 1980 ఏప్రిల్ 2న ఒక ఒప్పందం చేసుకున్నాయి.
ఈ ఒప్పందం ప్రకారం..
- పూర్తి నీటి మట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్) 150 అడుగులు ఉండేలా రిజర్వాయర్ నిర్మాణం
- స్పిల్‌వే సామర్థ్యం 36 లక్షల క్యూసెక్కులు
- పోలవరం రిజర్వాయర్ కారణంగా ఒడిశా, మధ్యప్రదేశ్ (ఇప్పుడు ఛత్తీస్‌గఢ్) రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. వీటికి ఆంధ్రప్రదేశ్ తగిన పరిహారం చెల్లించాలి.
1976లో పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
1981లో నాటి ముఖ్యమంత్రి టి.అంజయ్య పోలవరం ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు.
అనేక రకాల పరిశీలనల తర్వాత 1986లో తుది నివేదికను రూపొందించారు.
1985-86 ధరల ప్రకారం నాడు ఈ ప్రాజెక్టు వ్యయం రూ.2,665 కోట్లుగా అంచనా వేశారు.
ఆ తరువాత మరుగున పడిన ఈ ప్రాజెక్టులో తిరిగి 2004లో కదలిక వచ్చింది.
నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దీని నిర్మాణాన్ని ప్రారంభించారు.
ఫొటో సోర్స్, NAlle sivakumar
పోలవరం మౌలిక స్వరూపం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానంగా మూడు భాగాలున్నాయి.
1. రిజర్వాయర్
2. స్పిల్‌వే
3. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం
రిజర్వాయర్: ఇందులో నీటిని నిల్వ చేస్తారు.
స్పిల్‌వే: రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు స్పిల్‌వే ఉపయోగడుతుంది. రెండు కొండల నడుమ దీన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 48 గేట్లు ఏర్పాటు చేయనున్నారు.
కాలువలు: రిజర్వాయర్‌కు రెండు కాలువలు ఉంటాయి. ఒకటి కుడి వైపు. రెండోది ఎడమ వైపు. వీటి ద్వారా నీటిని తరలిస్తారు.
ఆనకట్ట: ఇది రిజర్వాయర్ ఆనకట్ట. ఇందులో అనేక భాగాలున్నాయి.
డయాఫ్రం వాల్.. నది మధ్యలో దాదాపు 300 అడుగుల లోతులో కడుతున్న కాంక్రీటు గోడ. నీరు లీకేజీ కాకుండా ఇది కాపాడుతుంది. దీని పొడవు 2.454 కిలోమీటర్లు.
రాతి, మట్టి కట్టడం.. డయాఫ్రం వాల్‌కు ఇరువైపులా రాతి, మట్టి కట్డడం (ఎర్త్-కం-రాక్ ఫిల్ డ్యాం) నిర్మిస్తారు.
కాఫర్ డ్యాం: ప్రధాన డ్యాంను నిర్మించేటప్పుడు నీరు అడ్డు తగలకుండా ఉండేందుకు తాత్కాలికంగా నిర్మించే కట్టడాన్ని కాఫర్ డ్యాం అంటారు.
పోలవరం విషయంలో రెండు కాఫర్ డ్యామ్‌లు ప్రతిపాదించారు.
నది ప్రవాహం అడ్డుతగలకుండా ఎగువన ఒకటి, ధవళేశ్వరం బ్యారేజీ బ్యాక్ వాటర్ అవరోధం కలిగించకుండా దిగువున ఒక డ్యాం నిర్మించాలని నిర్ణయించారు.
ప్రస్తుతం ఇలా..
రామపాదసాగర్ నిర్మించాలని ప్రతిపాదించిన ప్రాంతానికి 2 కిలోమీటర్ల ఎగువున పోలవరం ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.
2,454 మీటర్ల పొడవైన ఎర్త్-కమ్-రాక్ ఫిల్ డ్యాం, 1,128 మీటర్ల పొడవైన స్పిల్ వేను నిర్మించేందుకు నిర్ణయించారు.
ఎడమ కాలువ: 181.50 కిలోమీటర్ల పొడవు. తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలలో దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని చెబుతున్నారు. అలాగే విశాఖపట్నం నగరానికి తాగు నీరు ఇవ్వనున్నారు. ఈ కాలువను జలరవాణాకు కూడా ఉపయోగించనున్నారు.
కుడి కాలువ: 174 కిలోమీటర్ల పొడవు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు.
అలాగే 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించనున్నారు.
జలవిద్యుత్: 960 మెగావాట్ల సామర్థ్యం గల జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మించనున్నారు.
ఫొటో సోర్స్, APTDC
ప్రయోజనాలు
విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో సుమారు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.
విశాఖపట్నంలో కర్మాగారాల నీటి అవసరాలను తీర్చనున్నారు.
విశాఖపట్నం నగరానికి తాగు నీరు అందించనున్నారు.
కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత తగ్గుతున్నందున బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా పోలవరం ఉపయోగపడుతుంది.
నిధులు-వ్యయం
- 2017 ఆగస్టులో పోలవరానికి సంబంధించి కొత్త అంచనాలను సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించింది.
- 2013-14 ధరల ప్రకారం ప్రాజెక్ట్ బడ్జెట్ రూ.58,319 కోట్లకు చేరినట్లు కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.
- ఆంధ్రప్రదేశ్ సమర్పించిన కొత్త అంచనా వ్యయానికి సీడబ్ల్యూసీ ఆమోదం లభించాల్సి ఉంది.
- మొత్తం వ్యయంలో పునరావాసానికి రూ.32,000 కోట్లు అవుతాయని అంచనా.
జాతీయ ప్రాజెక్ట్
పోలవరాన్ని 2014లో జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించారు.
2017 జనవరి నాటికి పోలవరంపై రూ.8,898 కోట్లు ఖర్చు పెట్టారు.
జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత అంటే 2014 మార్చి నుంచి 2017 జనవరి వరకు ఖర్చు పెట్టిన నిధులు రూ.3,349.70 కోట్లు.
2014 మార్చి నుంచి 2017 జనవరి నాటికి పోలవరం అథారిటీ ద్వారా కేంద్రం ఇచ్చిన నిధులు రూ.2,916.54 కోట్లు.
పోలవరం నిర్మాణానికి అయ్యే నిధులను నాబార్డు కేంద్రానికి రుణంగా ఇస్తుంది. వీటిని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా ఖర్చు చేస్తున్నారు.
2014 జనవరి 1 నాటి అంచనాల ప్రకారమే ప్రాజెక్ట్ వ్యయాన్ని పూర్తిగా భరిస్తామని కేంద్రం తెలిపింది.
అంటే ఈ అంచనాల కన్నా అదనంగా ఖర్చు అయితే దానిని రాష్ట్రమే భరించాలి.
ఫొటో సోర్స్, PAdma Meenakshi
పాపి కొండల వద్ద గోదావరి
అనుమతులు
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం 2004లో ప్రారంభమైంది.
2005లో దీనికి పర్యావరణ అనుమతులు వచ్చాయి.
గిరిజన ప్రాంత ప్రజల తరలింపు, వారికి పునరావాసం కల్పించడానికి సంబంధించి కేంద్ర గిరిజనశాఖ అనుమతులు 2007లో లభించాయి.
అటవీ ప్రాంత వినియోగానికి సంబంధించిన తుది అనుమతులు 2010లో వచ్చాయి.
ఫొటో సోర్స్, PAdma meenakshi
గోదావరి నదిపై కొందరు ఆధారపడి జీవిస్తున్నారు
ముంపు ప్రాంతం
ఆంధ్రప్రదేశ్‌లో 276 గ్రామాలు, ఛత్తీస్‌గఢ్‌లో 4, ఒడిశాలో 8 గ్రామాలు ముంపుకు గురవుతాయి. 3427.52 ఎకరాల అటవీ భూమి మునిగిపోతుంది.
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో ముంపుకు గురవుతున్న మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు.
అవి భద్రాచలం రెవిన్యూ డివిజన్‌లోని కూనవరం, వర రామచంద్రాపురం, చింతూరు, భద్రాచలం మండలాలు.. పాల్వంచ రెవెన్యూ డివిజన్‌లో వేలేరుపాడు, కుక్కునూరు, బూర్గంపాడు మండలాలు.
ఫొటో సోర్స్, NAra chandrababu naidu
పట్టిసీమ ఎత్తిపోతల పథకం
ఎత్తిపోతల పథకాలు
పోలవరం భారీ ప్రాజెక్టు. ఇది పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. ఈలోపు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా నీటిని తరలించేందుకు తాత్కాలిక ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఇందులో భాగంగా పట్టిసీమ, పురుషోత్తమపట్నం ఎత్తిపోతల (లిఫ్ట్ ఇరిగేషన్) పథకాలు చేపట్టింది.
ఈ ఎత్తిపోతల పథకాలు పోలవరం మౌలిక డిజైన్‌లో భాగం కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
వీటిని రాష్ట్రమే తమ సొంత నిధులతో నిర్మిస్తున్నట్లు వెల్లడించింది.
పట్టిసీమ: పోలవరం మండలంలోని పట్టిసం వద్ద ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. 2015లో దీని నిర్మాణం పూర్తయింది. 2015 డిసెంబరు నాటికి దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1299 కోట్లు ఖర్చు చేసింది.
పురుషోత్తమపట్నం: రూ.1,638 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని చేపట్టారు. 2017 ఆగస్టులో తొలి విడత పూర్తి అయింది. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఏలేరు జలాశయానికి తరలిస్తారు.
(ఆధారం: లోక్‌సభ, రాజ్యసభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ, ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ)
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)