చెన్నంపల్లి కోట: గుప్తనిధుల కోసం తవ్వకాల వెనుక అసలు కథ!

  • డీఎల్ నరసింహ
  • బీబీసీ కోసం
చెన్నంపల్లి కోట

‘రాజుల కోటలూ పురాతన ఆలయాలూ.. గుప్త నిధుల భాండాగారాలు' అన్న భావన ఇంకా చాలా మందిలో ఉంది. పురాతన ఆలయాలు, పాడుపడిన కోటల్లో గుప్తనిధుల కోసం తరచుగా జరిగే తవ్వకాలే ఇందుకు నిదర్శనం.

తాజాగా కర్నూలు జిల్లాలోనూ అలాంటి తవ్వకాలే జరిగాయి. అది కూడా రాత్రి పూటే. కానీ.. అక్కడ తవ్వకాలు జరుపిస్తోంది మాత్రం.. సాక్షాత్తూ ప్రభుత్వ ప్రతినిధులైన పోలీసులు, రెవెన్యూ సిబ్బంది! ఇది చూసి గ్రామస్తులు అవాక్కయ్యారు!!

కర్నూలు జిల్లా చెన్నంపల్లి గ్రామంలో విజయనగర రాజుల కాలం నాటి కోట ఉంది. ఇటీవల ఆ కోటలో తవ్వకాలు జరగటం వివాదాస్పదమైంది. ఈ తవ్వకాల వార్త దావానలంలా వ్యాపించింది. గుప్తనిధుల కోసం ప్రభుత్వమే ఆ తవ్వకాలు జరుపుతోందని స్థానిక మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి.

ఆ తవ్వకాల్లో లంకె బిందెలు, బంగారు నాణేలు దొరికాయన్న వార్తలు సామాజిక మాథ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయమై చెన్నంపల్లి గ్రామస్తులతోపాటు రెవెన్యూ, ఆర్కియాలజీ అధికారుల నుంచి సమాచారం సేకరించాం.

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో రెండు వారాలుగా రెవెన్యూ, పోలీసు అధికారుల పర్యవేక్షణలో మైనింగ్ శాఖ తవ్వకాలు జరుపుతోంది. ఈ తవ్వకాల గురించి గ్రామస్థుడు శబాసప్ప మాట్లాడుతూ.. ‘‘ఆ రోజు.. నవంబర్ 13. రాత్రి కోటలో ఎవరో తవ్వకాలు జరుపుతున్నారని తెలిసింది. వెంటనే ఊర్లో దండోరా వేయించి దాదాపు వెయ్యి మందిమి కోటలోకి వచ్చినాం. అక్కడ స్పెషల్ కలెక్టర్, ఆర్‌డీఓ, డీఎస్‌పీ ఉన్నారు. వారిని విచారిస్తే.. మేమంతా గవర్నమెంటు ఆఫీసర్లము, ఇక్కడ గుప్తనిధులు ఉన్నాయని చానా కాలం నుండీ అపోహలున్నాయి. ఆ అపోహలను తొలగించటానికి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి తవ్వకాలు జరుపుతున్నామని చెప్పారు’’ అని వివరించారు.

అయినా.. తమకు చెప్పకుండా తవ్వకాలు ఎలా జరుపుతారని గ్రామస్థులు ప్రశ్నించారు. దీంతో మరుసటి రోజు చెన్నంపల్లిలో అధికారులు గ్రామ సభ నిర్వహించారు. 12 మంది గ్రామస్థులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి, వారి సమక్షంలోనే తవ్వకాలు జరపడం మొదలుపెట్టారు.

కోటలో గుప్త నిధుల అపోహల గురించి అక్బర్ వలీ అనే మరో గ్రామస్తుడిని ప్రశ్నిస్తే.. ''2002లో అనంతపురం నుంచి కాళేశ్వర్ వచ్చినారు. ఈ కొండను చూసి.. ఈ కోటలో భారీగా నిధులున్నాయని, తవ్వడంలో సహాయం చేస్తే ఇంటింటికీ సేరు బంగారం ఇస్తానని అన్నారు. గ్రామస్థుల సహాయంతో అప్పుడే ఇక్కడ తవ్వకాలు జరిగినాయి. డిపార్ట్‌మెంట్ వారికి విషయం తెలిసి ఆ గుంతను మూసేశారు. 10-12 సంవత్సరాల నుంచి ఎంతో మంది ఇక్కడ తవ్వడమూ, అధికారులు ఆ గుంతను మూసేయడమూ జరుగుతోంది'' అని చెప్పారు.

అయితే.. ప్రస్తుతం తవ్వకాలు జరుపుతున్నా ఫలితం కనపడటం లేదంటున్నారు. ఆ ప్రాంతం చూడటానికి ఓ నీటి గుంతలా కనిపిస్తోందే తప్ప, ఇంకేమీ కనిపించడం లేదని అక్బర్ పేర్కొన్నారు.

‘‘కొందరు బాబాలు, అక్రమార్కులు గుప్తనిధుల కోసం రాత్రిళ్ళు కోటలో తవ్వకాలు జరపుతున్నారంటూ కలెక్టరుకు ఫిర్యాదులు అందాయి. వారిని అడ్డుకునేందుకు, ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు కలెక్టర్ గారే తవ్వకాలకు ఆదేశించారు’’ అని చెన్నంపల్లికోటలో తవ్వకాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఆర్‌డీఓ ఓబులేసు తెలిపారు. విలువైన ఖనిజ సంపదకూడా ఉండవచ్చన్న పురావస్తుశాఖ అధికారుల సూచనలతో మైనింగ్ యాక్ట్ ప్రకారం తవ్వకాలు జరుపుతున్నామని ఆయన చెప్పారు.

రాష్ట్ర పురావస్తుశాఖ అధికారులు మాత్రం చన్నంపల్లికోట తమ శాఖ పరిధిలోలేనందున, అక్కడ తవ్వకాలు జరపాలని కానీ, ఆపాలని కానీ చెప్పే అధికారం తమకు లేదని అంటున్నారు. కోటలో జరుగుతున్న తవ్వకాలకు తమకు ఎలాంటి సంబంధంలేదంటున్న ఈ అధికారులు.. తవ్వకాల్లో బయటపడ్డ ఎముకలు, ఇటుకలను పరిశీలిస్తున్నారు. వాటిలో ఏమైనా విలువైన పురాతన వస్తువులున్నాయేమోనని పరిశీలించేందుకు మాత్రమే తాము కమీషనర్ ఆదేశాలమేరకు వచ్చామని వారు చెప్పారు.

అయితే.. పురాతన కట్టడాల్లో తవ్వకాలు జరపాలంటే తప్పనిసరిగా కేంద్ర పురావస్తుశాఖ అనుమతి ఉండాలని స్పష్టం చేశారు రాష్ట్ర పురావస్తుశాఖ ఈడీ గంగాధర్. కేంద్ర పురావస్తు శాఖకు చెందిన అధికారులు కూడా చెన్నంపల్లికోట తమ పరిధిలో లేదని, తవ్వకాలకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదని పేర్కొన్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)