పాకిస్తాన్లో జాధవ్ భార్య మెడలోంచి మంగళసూత్రం తీయించారు: భారత్

ఫొటో సోర్స్, @ForeignOfficePk
ఇస్లామాబాద్‌లో కుల్‌భూషణ్ జాధవ్ తల్లి అవంతి, భార్య చేతన్‌కుల్
పాకిస్తాన్ ప్రభుత్వ అనుమతితో కుల్‌భూషణ్ జాధవ్‌ను ఆయన భార్య, తల్లి సోమవారం నాడు ఇస్లామాబాద్ జైలుకు వెళ్లి ఆయనను కలిసి వచ్చారు.
అయితే ఈ సందర్భంగా జాధవ్ తల్లి, భార్య పట్ల పాకిస్తాన్ వ్యవహరించిన తీరుతెన్నులపై భారత విదేశాంగ శాఖ మంగళవారం నాడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
పాక్ జైలులో ఉన్న కుల్‌భూషణ్ జాధవ్ (47)తో ఆయన భార్య చేతన్‌కుల్, తల్లి అవంతి 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అయితే వారు నేరుగా కలవలేకుండా అడ్డంగా ఒక అద్దాన్ని ఉంచారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను పాకిస్తాన్ విదేశాంగ శాఖ సోషల్ మీడియాలో విడుదల చేసింది.
ఫొటో సోర్స్, Twitter
ఈ సందర్భంగా పాక్ అనుసరించిన తీరుతెన్నులపై భారత విదేశాంగ శాఖ విచారం వ్యక్తం చేసింది.
పాకిస్తాన్లో గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్న ఆరోపణలపై పాకిస్తాన్ ప్రభుత్వం కుల్‌భూషణ్ జాధవ్‌కు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే.
ఈ భేటీపై భారత విదేశాంగ వెలిబుచ్చిన అభ్యంతరాలివీ:
- కుల్‌భూషణ్ జాధవ్ తల్లి, భార్యలను బట్టలు మార్చుకునేలా పాక్ అధికారులు ఒత్తిడి చేశారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ ప్రెస్ కాన్ఫరెన్సులో వెల్లడి చేశారు.
- వారితో మెడలోని మంగళసూత్రం, బొట్టు తీసేయించారు. అట్లాగే, వారిని తమ మాతృభాషయైన మరాఠీలో మాట్లాడుకోనివ్వలేదు.
- వారిని బూట్లు కూడా తీసేయించారు. వాటిని వాపస్ ఇవ్వలేదు. దానిపై వివరణ కూడా ఇవ్వలేదు.
- కుటుంబ సభ్యులతో సంభాషణ సందర్భంగా కుల్‌భూషణ్ బాగా ఒత్తిడిలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం పట్ల విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
- జాధవ్ తన కుటుంబ సభ్యులను కలిసిన సందర్భంగా తన నేరాల్ని అంగీకరిస్తూ మాట్లాడారు. అయితే పాకిస్తాన్ ఒత్తిడి వల్లే ఆయన అలా చేయాల్సి వచ్చింది.
- జాధవ్ తల్లి, భార్యల పట్ల పాక్ మీడియా వ్యవహరించిన తీరు సరిగా లేదు.
- పాకిస్తానీ మీడియాకు జాధవ్ భార్య, తల్లిని ప్రశ్నలు అడిగేందుకు అనేక సార్లు అనుమతించారు. మీడియా వారు వారిద్దరినీ ఇష్టం వచ్చిన రీతిలో ప్రశ్నలడిగారు. మీడియాను వారితో కలవకుండా ఉంచాలన్నది ఇరు దేశాల మధ్య ముందే కుదిరిన ఒప్పందం.
ఫొటో సోర్స్, Twitter
ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్
సోమవారం నాడు జైలులో జాధవ్‌తో ఆయన తల్లి, భార్యల ములాఖాత్ తర్వాత పాక్ విదేశాంగ శాఖ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది.
ఇస్లామిక్ సాంప్రదాయాలకు లోబడి, మానవత్వ విలువలకు కట్టుబడి కుల్‌భూషణ్ జాధవ్‌ను కలిసేందుకు ఆయన భార్యకు, తల్లికి అనుమతినిచ్చామని పాకిస్తాన్ ఆ ప్రెస్ మీట్లో ప్రకటించింది.
ఈ ములాఖాత్ చాలా సానుకూల వాతావరణంలో, బాగా జరిగిందని పాకిస్తాన్ పేర్కొంది.
ఇస్లామాబాద్ జైలులో ములాఖాత్ తర్వాత వెనక్కి వచ్చిన జాధవ్ భార్య, తల్లి మంగళవారం భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలిశారు. వారు సుష్మాను తమ ఇంటికి రావాలని ఆహ్వానించారు.
ఈ భేటీలో పలువురు ఇతర అధికారులు పాల్గొన్నట్టు తెలిస్తోంది. జాధవ్ మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించిన విషయం విదితమే.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)