నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లో ఆరు మార్పులివే!

  • 26 డిసెంబర్ 2017
ఏబీ డివిలియర్స్ Image copyright Getty Images

దక్షిణాఫ్రికా-జింబాబ్వేల మధ్య ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ మంగళవారం మొదలైంది. దీంతో టెస్టు క్రికెట్ భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన ఘట్టానికి ఐసీసీ తెరతీసింది.

దక్షిణాఫ్రికాలోని పోర్ట్ ఎలిజబెత్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచ్.. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అంకానికి పునాది వేసింది.

ఓ పక్క టీ20 క్రికెట్‌కి ఆదరణ పెరిగిపోయింది. మరోపక్క చాలా టెస్టు మ్యాచుల్లో ప్రేక్షకులు లేక గ్యాలరీలు వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెస్టు క్రికెట్‌కు ఆదరణ పెంచే ప్రయత్నాల్లో భాగంగా ఐసీసీ ఈ కొత్త ఫార్మాట్‌కు ప్రయోగాత్మకంగా అనుమతిచ్చింది.

దీనికి వచ్చే స్పందన ఆధారంగా భవిష్యత్తులో టెస్టుల నిర్వహణ తీరుపై ఐసీసీ కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Image copyright Getty Images

ఈ నాలుగు రోజుల మ్యాచ్ నిబంధనల్లో 6 తేడాలున్నాయి. అవేంటంటే..

  • రోజూ ఆట ఆరున్నర గంటలపాటు సాగుతుంది. ఐదు రోజుల టెస్టుల్లో ఆరు గంటల ఆట మాత్రమే సాగుతుంది.
  • రోజులో 98 ఓవర్లు వేయాలి. ఐదు రోజుల ఫార్మాట్‌లో అది 90 ఓవర్లకే పరిమితం.
  • రోజులో తొలి రెండు సెషన్లూ 2గంటల 15నిమిషాల పాటు సాగుతాయి. రెంటికీ మధ్యలో లంచ్ బ్రేక్‌కి బదులుగా 20 నిమిషాల టీ విరామం ఉంటుంది. ఐదు రోజుల ఫార్మాట్‌లో సెషన్ వ్యవధి 2 గంటలు, విరామం 30 నిమిషాలుగా ఉంటుంది.
  • ఈ ఫార్మాట్‌లో రెండో సెషన్ పూర్తయ్యాక 40 నిమిషాల భోజన విరామం ఉంటుంది.
  • ముందు రోజు ఆటలో వృథా అయిన సమయాన్ని మరుసటి రోజు ఆటలో కలిపే సౌలభ్యం ఈ ఫార్మాట్‌లో లేదు.
  • 150 పరుగుల ఆధిక్యం ఉన్నా ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఈ ఫార్మాట్‌లో ఉంది. ఐదు రోజుల టెస్టులో ఆ పరిమితి 200 పరుగులు.

ఒకప్పుడు టెస్టు మ్యాచ్‌లు ఫలితం తేలేదాకా ఎన్ని రోజులపాటైనా జరిగేవి. కొన్నేళ్ల క్రితం మూడ్రోజులు, ఆర్రోజుల టెస్టులు కూడా జరిగాయి. కానీ ఇటీవలి కాలంలో నాలుగు రోజుల టెస్టు జరగడం ఇదే తొలిసారి.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)