పోలవరం గ్రౌండ్ రిపోర్ట్: ఏం జరుగుతోంది? రాజకీయ వివాదంగా ఎలా మారింది?

 • దీప్తి బత్తిని
 • బీబీసీ ప్రతినిధి
పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతం

ఫొటో సోర్స్, Facebook/Chandrababu Naidu

గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు సాగు, తాగు నీరు అవసరాలు తీరుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో చెప్పారు.

మరి ఈ ప్రాజెక్ట్ పనులు ఎలా జరుగుతున్నాయి? పోలవరం రాజకీయ అంశంగా ఎందుకు మారింది?

ఈ అంశాలపై గ్రౌండ్ రిపోర్ట్.

వీడియో క్యాప్షన్,

పోలవరం ఆంధ్రప్రదేశ్‌‌లోని పలు జిల్లాలకు నీటి అవసరాలు తీరుస్తుందని చంద్ర బాబు చెప్పారు.

రద్దీ పెరిగింది

పోలవరం బస్‌స్టాండ్ నుంచి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతం ఒక కిలోమీటరు దూరంలో ఉంది. "నిర్మానుష్యంగా, ఊళ్లో వాళ్లు తప్ప బయట వాళ్ల రద్దీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు రద్దీ పెరిగింది, వ్యాపారాలు పెరిగాయి. వచ్చే పోయే వాళ్లు పెరిగారు" అంటూ బస్‌స్టాప్ పక్కనే టెలిఫోన్ సెంటర్ నడుపుతున్న వ్యక్తి అన్నారు.

ఇంతలోనే వచ్చే పోయే లారీలు చూపించి ఇదే దానికి నిదర్శనం అన్నారు. టీ తాగుతూ పోలవరం గ్రామానికి చెందిన సుబ్బయ్య.

ట్రాన్స్‌ట్రాయ్ కాంట్రాక్టర్‌గా 2010లో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు మొదలు అయ్యాయి.

ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తి అయితే సుమారు 2.91 లక్షల హెక్టార్ల భూమి సాగులోకి వస్తుందని, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని అంచనా. "ఆంధ్రప్రదేశ్‌ని కరవు రహిత రాష్ట్రంగా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు" చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు.

2014లో రాష్ట్ర విభజనతో పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా కూడా దక్కింది.

ఈ ప్రాజెక్టుకు తాము పూర్తి బాధ్యత వహిస్తామని, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనులు త్వరిత గతిన పూర్తయ్యేలా చూస్తామని కేంద్రం ప్రకటించగా, నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వెలిబుచ్చింది.

నిధుల వివరాలివి..

 • నిర్మాణ అంచనా వ్యయం: రూ.16,010.45 కోట్లు (2010-11)
 • ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు: రూ.12,567.22 కోట్లు (2017 నాటికి)
 • జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన తర్వాత పెట్టిన ఖర్చు: రూ 7,431.35 కోట్లు
 • కేంద్రం నుంచి లభించిన నిధులు : రూ 4,329.06 కోట్లు (2017 నాటికి)
 • కేంద్రం విడుదల చేయాల్సిన నిధులు : రూ 3,102.29 కోట్లు (2017 నాటికి)
 • పునరావాస వ్యయం అంచనా: రూ 32,000 కోట్లు. (2017 నాటికి)

ఫొటో సోర్స్, BBC/Naveen Kumar K

ఫొటో క్యాప్షన్,

పోలవరాన్ని పూర్తి చేయడం తన జీవిత లక్ష్యమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు

ప్రాజెక్ట్ ప్రధాన భాగాలు

ప్రాజెక్ట్ ప్రధాన భాగాలు స్పిల్‌వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రం‌ వాల్, ఎర్త్-కమ్-రాక్ ఫిల్ డ్యామ్.

ఇప్పటి వరకు స్పిల్‌వే పనులు 30%, డయాఫ్రం వాల్ పనులు 53%, కాఫర్ డ్యామ్ పనులు 22% అయినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

ప్రతి సోమవారం ప్రాజెక్ట్ పనులు ఆయన సమీక్షిస్తున్నారు.

2018 కల్లా డయాఫ్రం వాల్, కాఫర్ డ్యామ్ వాల్ పనులు పూర్తి చేసి నీళ్లు విడుదల చేయాలన్నదే ముఖ్య ఆశయమని పలుసార్లు ముఖ్యమంత్రి అన్నారు.

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/gettyimages

ఫొటో క్యాప్షన్,

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పోలవరం ప్రాజెక్ట్‌ పురోగతిని సమీక్షించనున్నట్లు తెలిపారు

లెక్క చెప్పండి!

అయితే పోలవరం ప్రాజెక్ట్ కట్టడం‌లో ప్రైమరీ కాంట్రాక్టర్ ట్రాన్స్‌ట్రాయ్ చేపట్టిన స్పిల్‌వే పనుల జాప్యం మూలంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త కాంట్రాక్టర్ల కోసం టెండర్లు పిలవాలని నిర్ణయించింది.

కానీ కాంట్రాక్టర్‌ను మార్చటానికి లేదూ అంటూ, అసలు ఇచ్చిన నిధులు ఎక్కడ వాడారో చెప్పాలి అంటూ కేంద్ర ప్రభుత్వం లేఖ పంపింది.

నిధుల విడుదల అంశం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమస్యాత్మకంగా మారింది.

దీంతో రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు 2017 అక్టోబరులో అసెంబ్లీ‌‌లో ప్రాజెక్టు అంశం‌పై మాట్లాడారు. అవసరం అయితే పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ కావటం‌తో దాని నిర్మాణ పనులు 'వెంటనే' కేంద్రానికి అప్పగించేస్తామని ఆయన తెలిపారు. డిసెంబర్ 11 న పోలవరం ప్రాజెక్ట్ సైట్ వద్ద మాట్లాడుతూ.. "బీజేపీ, టీడీపీ రాజకీయ మిత్ర పక్షాలు కావటం వల్లనే నిగ్రహం‌తో వ్యవహరిస్తున్నాం" అని అన్నారు.

ఈ నేపథ్యం‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నారు.

ఫొటో సోర్స్, BBC/Naveen Kumar K

ప్రాజెక్ట్ బడ్జెట్

2010-11 ధరల ప్రకారం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అయ్యే అంచనా వ్యయంతో పోలిస్తే ఇప్పుడు అనేక రెట్లు పెరిగింది.

కొత్త అంచనాల ప్రకారం దాదాపు రూ.58,000 కోట్లు. అయితే ఇందులో ఎక్కువ భాగం పునరావాసానికి, భూసేకరణ‌కే అవుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా వివరించారు.

"నిర్వాసితులకు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం.. భూసేకరణ, పునరావాసం కల్పించాలి. దీంతో ఖర్చు పెరిగింది" అని దేవినేని ఉమా అన్నారు.

ఫొటో సోర్స్, BBC/Naveen Kumar K

నిరాశ్రయులు

 • నిరాశ్రయులయ్యే కుటుంబాలు: 95,578
 • ఇప్పటి వరకు తరలించిన కుటుంబాలు: 3,446
 • ప్రాజెక్ట్‌కు అవసరమైన భూమి: 1,62,753 ఎకరాలు
 • ఇప్పటి వరకు సేకరించిన భూమి: 1,24,061 ఎకరాలు

ప్రాజెక్ట్ పనులు సకాలం‌లో పూర్తి చేయాలంటే పునరావాసం, నిర్మాణ పనులు ఏకకాలంలో జరగాలి.

అలా జరగాలంటే కేంద్రం నుంచి రావల్సిన నిధులు సక్రమంగా రావాలి. అప్పుడే పనులు అనుకున్నట్లు పూర్తి చేయవచ్చని పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ అభిప్రాయపడ్డారు.

"నిధులు రానిదే ఏమి చేస్తాం. అందరూ సహకరించి నిధులు వచ్చేలా చూస్తే పనులు వేగంగా అవుతాయి. ఇక్కడికి రాజకీయ నాయకులు వచ్చినపుడు పనులు ఆగి పోవటమే తప్ప మరేం జరగడం లేదు" అని స్థానిక అధికారులు వాపోతున్నారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)