అభిప్రాయం: భారత్ బానిసత్వంలో ఉన్నది ఎంత కాలం? 150 ఏళ్లా.. 1200 ఏళ్లా?

  • 27 డిసెంబర్ 2017
రణవీర్ సింగ్ Image copyright Padmavati Official Trailer Grab
చిత్రం శీర్షిక అలావుద్దీన్ ఖిల్జీ పాత్రలో రణవీర్ సింగ్

గత కొన్ని రోజులుగా చరిత్రను రకరకాలుగా వక్రీకరిస్తున్నారు. ప్రస్తుతం వీరే పాలకులు కావడం వల్ల వారు చరిత్రను తమదైన కోణంలో చూపించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అసలు చరిత్ర లేదు, కేవలం కొన్ని పౌరాణిక గాథలు మాత్రమే ఉన్నాయి.

చరిత్రను వక్రీకరించాలనుకునేవాళ్లు, రెండు విషయాలను ఎక్కువగా చెబుతుంటారు. వాటిలో ఒకటి భారత సంస్కృతి చాలా పురాతనమైనది అనే వాదన.

ప్రపంచంలో నేడు ఆర్య సిద్ధాంతం చెల్లకుండా పోయింది. అయితే ఇక్కడ మాత్రం ఆర్యులు భారతదేశానికి చెందిన వారేనని, అన్ని విషయాలూ మొదట కనుగొన్నది మనమే అన్న వాదన కొనసాగుతోంది.

గణేశుడిని చూస్తే తొలి ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా మనమే చేశామని తెలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ కూడా అన్నారు.

ఇదే వాదన నాజీలు కూడా చేసేవారు. ఆర్యులు జర్మనీకి చెందిన వారనేది వారి వాదన. అచ్చం అదే విధంగా భారతదేశంలో కూడా నాజీలను అనుసరించడమే జరుగుతోంది.

భారత్ నుంచి బయలుదేరిన ఆర్యులు ప్రపంచానికంతటికీ సంస్కృతిని అందించారని వీరు వాదిస్తున్నారు.

Image copyright Getty Images

'స్వాతంత్ర్య సంగ్రామంలో ఒక్క నాయకుడూ లేరు'

భారతదేశంలో 700 క్రీ.శ. నుంచి బానిసత్వం ఉందని వీరు వాదిస్తున్నారు. 1200 ఏళ్ల పాటు ముస్లింల కింద, ఆ తర్వాత ఆంగ్లేయుల క్రింద బానిసత్వం అనుభవించామనేది వీరి వాదన. అయితే ఎవరైనా కొన్ని తరాలుగా ఒక దేశంలో ఉండిపోతే వారిని పరాయి దేశాల పాలకులుగా భావించరు అన్న సంగతి వీరు మర్చిపోతున్నారు.

బ్రిటిషర్ల కాలంలో 'డ్రెయిన్ ఆఫ్ వెల్త్' (సంపద తరలింపు) జరిగినట్లు, వీరి కాలంలో భారత దేశ సంపత్తిని దేశం బయటకు తరలించలేదు. చాలా మంది ఇంగ్లిష్ ఆర్థికవేత్తలు కూడా దీన్ని గుర్తించారు.

వీళ్లు బ్రిటిష్ పాలకులను, ముస్లిం పాలకులనూ ఒకటిగానే కలిపి చూస్తున్నారు. ఇలా చేయడం వెనుక వీరి ఉద్దేశం ఏమిటంటే - భారత స్వాతంత్ర్యోద్యమంలో తమ పాత్ర ఎలాగూ లేదు కాబట్టి, ఈ వాదనను పొడిగించి బానిసత్వం 150 ఏళ్ల నుంచే కాదని, 1200 ఏళ్ల నుంచే మన దేశం బానిసత్వంలో ఉన్నట్టుగా నిరూపించడం.

చిత్రం శీర్షిక ప్రొఫెసర్ ఇర్ఫాన్ హబీబ్

ఈ రకంగా చరిత్రను వక్రీకరించడం వల్ల వారికి రెండు లాభాలున్నాయి. ఒకటి - దీని ద్వారా ముస్లింలకు వ్యతిరేకమైన వాతావరణాన్ని సృష్టించడం.

రెండోది - స్వాతంత్ర్యోద్యమంలో వారికసలు ఎలాంటి పాత్రా లేదన్నది మరుగున పడిపోతుంది.

స్వాతంత్ర్యోద్యమంలోవారికంటూ చెప్పుకోవడానికి నాయకుడెవ్వరూ లేరు. కొన్నిసార్లు సర్దార్ పటేల్ అంటారు, కొన్నిసార్లు భగత్ సింగ్ అంటారు. అసలు భగత్ సింగ్‌తో వీరికి సంబంధం ఏమిటి?

అందువల్లే వీరు చరిత్రతో ఎలాంటి సంబంధమూ లేని ఒక కథను వినిపించాలనుకుంటున్నారు.

Image copyright Getty Images

మీరు కార్పొరేట్ సెక్టర్ మాటలకు తలొగ్గండి. మతాన్ని ప్రస్తావించండి. ఇది ఓటు బ్యాంకు రాజకీయాలకు చాలా మంచి వ్యూహం.

మతం ద్వారా మామూలు ప్రజలను ఆకట్టుకోవచ్చు. అలాగే కార్పొరేట్ మద్దతుతో డబ్బు కూడా పొందొచ్చు. ఎలెక్ట్రోరల్ బాండ్లనే తీసుకోండి. వాటిని ఇప్పుడు తీసుకురావడంలో ఆంతర్యమేమిటి?

ఇప్పుడు కంపెనీలు ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేస్తాయి. కానీ షేర్ హోల్డర్లకు మాత్రం ఆ కంపెనీ ఒక పార్టీకి ఫండింగ్ చేస్తోందన్న సంగతి తెలీనే తెలీదు.

ఇవన్నీ ట్రిక్కులు. ఇలాంటి వాటి ద్వారానే వీళ్లు తమ విధానాలను కొనసాగిస్తున్నారు.

పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీలతో అనేక చిన్న పరిశ్రమలను దెబ్బ తీశాయి. పెద్ద పరిశ్రమలకు వాటి వల్ల ఎక్కువ నష్టమేం జరగలేదు. మూడీస్ రేటింగ్ బీఏఏ3 నుంచి బీఏఏ2కు పెరిగింది. దీనిని బట్టి, ఈ విధానాలతో ప్రైవేట్, కార్పొరేట్ రంగాలు చాలా సంతోషంగా ఉన్నాయని తెలుస్తోంది.

Image copyright PADMAVATI FILM TRAILER GRAB
చిత్రం శీర్షిక 'పద్మావతి'లో రణవీర్ సింగ్

'ముస్లింలకు వ్యతిరేకంగా సినిమాల నిర్మాణం'

పద్మావతి చిత్రం ఒక కాల్పనిక కథే కావచ్చు. కానీ దీని ప్రభావంతో ముస్లింలపైన దాడులు జరుగుతున్నాయి.

పద్మావతిలో అల్లావుద్దీన్ ఖిల్జీని ప్రవేశపెట్టిన విధానం చారిత్రకంగా ప్రామాణికం కాదు. నిజంగా మీరు సినిమా తీయాలనుకుంటే అనేక మంది రాజ్‌పుత్ రాజులున్నారు, రాణులున్నారు. అనేక యుద్ధాలున్నాయి. కానీ వాటిని మీరు తీసుకోరు.

'పద్మావతి'పై తలెత్తిన చర్చ ద్వారా భారత్‌లో నేటికీ కులతత్వం సమసిపోలేదనే విషయం స్పష్టమైంది. ఈ సినిమా రాజ్‌పుత్‌ల ప్రతిష్ఠ దెబ్బ తీసిందని అంటున్నారు. అసలు రాజ్‌పుత్ ప్రతిష్ఠ ఏమిటి? ఒకవైపు కులవివక్షను నిర్మూలించాలంటూనే మరోవైపు ఇలాంటి మాటలేమిటి?

సినిమాలలో ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే భావాలను నేను గమనిస్తూనే ఉన్నాను.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)