అభిప్రాయం: 'లవ్ జిహాద్', ప్రేమ - 'ప్రత్యేక వివాహం'

  • 28 డిసెంబర్ 2017
ముస్లిం వధువు Image copyright Getty Images

ఢిల్లీ సమీపంలోని ఘాజియాబాద్‌ నగరంలో ఒక ముస్లిం పురుషుడు, ఒక హిందూ యువతి మధ్య జరిగిన వివాహాన్ని 'లవ్ జిహాద్'గా అభివర్ణిస్తూ గత వారం వందలాది మంది నిరసకారులు ఆందోళనకు దిగటంతో అది వార్తా పత్రికలకు ఎక్కింది.

ఆ వార్తలను మీరు వివరంగా చదివి ఉంటే.. ఆ వివాహం 'లవ్ జిహాద్' అన్న ఆరోపణలను ఆ నవ దంపతులిద్దరి కుటుంబాలూ తీవ్రంగా ఖండించాయన్న విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది.

Image copyright Getty Images

'లవ్ జిహాద్'

'లవ్ జిహాద్' అనేది.. హిందుత్వ సంస్థలు పెట్టిన పేరు. హిందూ మహిళలను ముస్లిం పురుషులు బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నట్టుగా ఈ పదం సూచిస్తుంది. ఇలాంటి పెళ్లిళ్ల ద్వారా హిందూ మహిళలను ఇస్లాం మతంలోకి మారుస్తున్నారని ఆ సంస్థలు ఆరోపణ.

ఈ వివాహం ఉమ్మడి అంగీకారంతోనే జరిగిందని, పెళ్లికూతురు కానీ, పెళ్లికొడుకు కానీ ఈ వివాహం కోసం మతం మార్చుకోలేదని ఘాజియాబాద్‌లోని యువతి కుటుంబం మీడియాకు విస్పష్టంగా చెప్పింది.

తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరి అని నిర్దేశించే 'ప్రత్యేక వివాహాల చట్టం' కింద ఈ వివాహాన్ని జరిపించామని, కాబట్టి బలవంతపు పెళ్లి అనే ప్రశ్నకు తావే లేదని పెళ్లికూతురు తండ్రి 'స్క్రోల్' వార్తా వెబ్‌సైట్‌తో చెప్పారు.

అయితే.. 'ప్రత్యేక వివాహాల చట్టం' నిబంధనలను పాటించటం వల్ల తలెత్తిన పరిస్థితుల కారణంగా ఈ నిరసన, ఆందోళనలు రేగి ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు.

Image copyright Getty Images

'ప్రత్యేక వివాహాల చట్టం 1954'ఏమిటసలు?

భారతదేశంలో చాలా వివాహాలు వివిధ మత నియమాళులు, వ్యక్తిగత చట్టాలు (పర్సనల్ లా) కింద జరుగుతాయి. అయితే.. దానికి వధువు, వరుడు ఇద్దరూ ఒకే మతానికి సంబంధించిన వారై ఉండాలి. అలాగైతేనే వారి మతానికి సంబంధించిన నియమావళి, పర్సనల్ లా వారి వివాహానికి వర్తిస్తుంది.

దీని అర్థం.. వధువు, వరుడు వేర్వేరు మతాలకు చెందిన వారైనట్లయితే.. వారు ఈ నియమావళులు లేదా పర్సనల్ లాల కింద పెళ్లి చేసుకోవాలంటే.. ఇద్దరిలో ఎవరో ఒకరు మతం మారాల్సి ఉంటుంది.

కానీ.. ఒక వ్యక్తి తన వివాహం కోసం తన మతాన్ని విడిచిపెట్టటానికి సుముఖంగా ఉండకపోవచ్చు. ఈ సమస్యను పరిష్కరించటానికి పార్లమెంటు 'ప్రత్యేక వివాహాల చట్టం' చేసింది. ఇది.. వేర్వేరు మతాలను ఆచరించే స్త్రీ, పురుషులు తమ మతాలను మార్చుకోకుండానే చట్టబద్ధంగా వివాహం చేసుకోవటానికి వీలు కల్పిస్తోంది.

సాధారణ కోర్టు వివాహాలు 'హిందూ వివాహ చట్టం' కింద నమోదవుతుంటాయి. దానికన్నా 'ప్రత్యేక వివాహాల చట్టం' ఇంకా ఎక్కువ సంక్లిష్టమైనది. నిజానికి.. ఈ చట్టంలోని నిబంధనలు ఇలాంటి జంటలకు కొత్త సవాలు విసురుతున్నాయి.

Image copyright Getty Images

సాధారణ 'కోర్టు వివాహాని'కి, దీనికి తేడా ఏమిటి?

సాధారణ కోర్టు వివాహంలో అదే రోజు వివాహ ధృవపత్రం పొందాలంటే.. వరుడు, వధువు ఇద్దరూ తమ ఫొటోలు, గుర్తింపు, చిరునామా ఆధారాలు, పెళ్లికి సాక్షులను తీసుకెళ్లాల్సి ఉంటుంది.

కానీ 'ప్రత్యేక వివాహాల చట్టం' కింద ఈ ప్రక్రియ ఇంకా సుదీర్ఘమైనది. ఈ పత్రాలను జిల్లా 'వివాహాల అధికారి' లేదా సబ్-డివిజనల్ మెజిస్ట్రేట్‌కు సమర్పించాల్సి ఉంటుంది. అవి అందుకున్న తర్వాత ఆ అధికారులు ఒక నోటీసును తయారు చేస్తారు.

'ఎక్స్' అనే పురుషుడు, 'వై' అనే మహిళను వివాహం చేసుకోబోతున్నారని.. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే 30 రోజుల లోగా 'వివాహ అధికారి'కి తెలియజేయాలని ఆ నోటీస్‌లో స్పష్టంగా పేర్కొంటారు.

Image copyright Getty Images

ఆ పురుషుడు లేదా మహిళ ఏదైనా మోసానికి పాల్పడినా, వివాహానికి బూటకపు ప్రాతిపదిక ఏదైనా ఉన్నా.. అటువంటివి వెలుగులోకి రావటానికి వీలుగా నెల రోజుల సమయం ఇవ్వటం ఈ నోటీసు ఉద్దేశం. అయితే.. 'హిందూ వివాహ చట్టం'లో ఇటువంటి నోటీసు నిబంధన ఏదీ లేదు.

కానీ.. ప్రత్యేక వివాహాల చట్టం కింద ఇచ్చే నోటీసును కోర్టు ఆవరణలో 30 రోజులు ప్రదర్శిస్తారు. ఆ 30 రోజుల కాలపరిమితిలో ఎటువంటి ఫిర్యాదు, అభ్యంతరం రానట్టయితే, వ్యవధి తర్వాతే ఆ వివాహాన్ని చట్టబద్ధంగా పరిగణిస్తారు. కానీ.. దీనివల్ల పూర్తి వ్యతిరేక ప్రభావం కూడా పడే అవకాశం ఉంది.

మతాంతర వివాహానికి సంబంధించిన సమాచారం బహిరంగంగా అందుబాటులో ఉంటే, అది దుర్వినియోగమవటానికి అవకాశం ఉంటుందని.. ఘాజియాబాద్‌కు చెందిన వధువు తండ్రి చెప్తున్నారు.

ఈ వివాహం ఉమ్మడి అంగీకారంతో జరిగినప్పటికీ.. 'మతాంతర వివాహం' గురించిన సమాచారం బయటకు వెళ్లిన తర్వాతే.. బయటివాళ్లు నిరసన ప్రదర్శనలు నిర్వహించారని.. దానివల్ల వివాహ కార్యక్రమానికి హాజరయేందుకు వచ్చిన అతిథులను తాము తిప్పి పంపించాల్సి వచ్చిందని ఆ కుటుంబం ఆరోపిస్తోంది.

Image copyright Getty Images

'ప్రత్యేక వివాహల చట్టం' అంటే భయమెందుకు?

ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాం. వేర్వేరు మతాలను ఆచరించే ఒక పురుషుడు, ఒక స్త్రీ పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకోగా, దానిని వారి కుటుంబాలు వ్యతిరేకిస్తున్నయితే అప్పుడు ఏమవుతుంది?

పేరు వెల్లడించరాదన్న షరతు మీద ఒక హిందూ వ్యక్తి నాతో మాట్లాడుతూ.. 'ప్రత్యేక వివాహాల చట్టం' తనకు, తన ముస్లిం ప్రియురాలికి సాయపడటం లేదని తెలిపారు.

ఆ పురుషుడు, మహిళ ఇద్దరూ వయోజనులే. తమ మతాలు మార్చుకోకుండానే పెళ్లి చేసుకోవాలని వారు కోరుకుంటున్నారు. కానీ ఆ సమాచారాన్ని 30 రోజుల పాటు నోటీస్ ద్వారా ప్రదర్శించాలన్న నిబంధన వారి మెడపై కత్తిలా వేలాడుతోంది.

తల్లిదండ్రుల ఆమోదం తప్పనిసరి అని.. ఆ సమాచారాన్ని ప్రచారం చేయటమే ఈ నోటీస్ ప్రదర్శన ఉద్దేశమని వారికి అధికారులు చెప్పారు. ఆ మహిళ వేరే నగర నివాసి. కాబట్టి సదరు జిల్లా కోర్టులో కూడా ఆ నోటీస్ ప్రతిని ప్రదర్శిస్తారు.

Image copyright Getty Images

ఈ కారణంగా.. హిందూ లేదా ముస్లిం మత నియమావళుల్లో ఏదో ఒక దాని కింద వివాహం చేసుకోవటానికి వీలుగా.. తమద్దరిలో ఒకరు మతం మార్చుకోవాలని వారు ఆలోచిస్తున్నారు. కానీ.. అలా మార్చుకోవటం వారికి నిజంగా ఇష్టం లేదు.

'ప్రత్యేక వివాహాల చట్టం' నిబంధనల కింద కూడా తాము వివాహం చేసుకోలేకపోతున్నామని వారు ఆందోళన చెందుతున్నారు.

'లవ్ జిహాద్' అనే మానసిక రుగ్మతల మధ్య వారి ప్రేమకథ 'ప్రత్యేక వివాహాల చట్టం'లోని సంక్లిష్టతల్లో చిక్కుముడి పడిపోయింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)