#ప్రెస్‌రివ్యూ: Facebook కూడా ఆధార్ అడుగుతోంది

  • 28 డిసెంబర్ 2017
యువతి Image copyright Getty Images

ఫేస్‌బుక్ కూడా ఆధార్ అడుగుతోంది

ఫేస్‌బుక్‌కూ ఆధార్.. అంటూ సాక్షి దిన పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో..

నకిలీ ఖాతాలను అరికట్టడంలో భాగంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ ద్వారా కొత్తగా ఫేస్‌బుక్ ఖాతాలు తెరిచే వారిని ఆధార్ కార్డులో ఉన్న పేరును ఇవ్వాల్సిందిగా ఆ సంస్థ కోరుతోంది.

ఆధార్ కార్డులోని అసలు పేరు ఇవ్వడం వల్ల నకిలీల బెడద తగ్గుతుందన్న మెసేజ్.. తెరపై ప్రత్యక్షమవుతోంది.

అయితే.. ఆధార్ కార్డులోని అసలు పేరును ఇవ్వడం తప్పనిసరి కాదని, దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నాం అని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి చెప్పారు.

పేర్లు తప్ప ఆధార్‌లోని ఎలాంటి వివరాలనూ అడగటం లేదన్నారు. దీంతో వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లదని ఆయన తెలిపారు.

Image copyright High court website

అమరావతికే హైకోర్టు

అమరావతిలో హైకోర్టు! అంటూ ఈనాడు దిన పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో..

అమరావతిలో ఏపీ హైకోర్టును తాత్కాలిక భవనంలో ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతోంది. 2018 మే నాటికి అన్నీ సిద్ధం చేసి జూన్ కల్లా ప్రారంభించాలని ప్రభుత్వం సంకల్పంతో ఉంది.

ఇందుకు ప్రతిపాదించిన రెండు మూడు తాత్కాలిక భవనాల్ని పరిశీలించి అభిప్రాయం తెలియజేయాలని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌ను కోరుతూ ప్రభుత్వం ఓ లేఖను సిద్ధం చేసింది.

ఈ లేఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేసినట్లు తెలిసింది. శాశ్వత హైకోర్టుకు సంబంధించిన నమూనా ఖరారు కూడా తుది దశలో ఉంది.

ఉమ్మడి హైకోర్టు హైదరాబాద్‌లో ఉండటంతో ఆంధ్రప్రదేశ్ నుంచి కక్షిదారులు అక్కడకి వెళ్లాల్సి వస్తోంది.

వారిని దృష్టిలో పెట్టుకొని ఏపీ హైకోర్టును అమరావతిలో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Image copyright facebook

వెల్‌కమ్ టు దావోస్

మంత్రి కేటీఆర్‌కు దావోస్ వరల్డ్ ఎకానమిక్ ఫోరం నుంచి ఆహ్వానం అందిందని ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

స్విడ్జర్లాండ్ దేశంలోని దావోస్‌లో జనవరి 23 నుంచి 26 వరకు ఈ సదస్సులు జరుగుతాయి.

ప్రపంచ దేశాలకు చెందిన 2,500 మంది వ్యాపార - వాణిజ్య, ఆర్థిక, రాజకీయ రంగాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు.

సాధారణంగా కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులకు మాత్రమే ఈ సదస్సుకు ఆహ్వానం లభిస్తుంది. తొలిసారిగా రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను ఈ సదస్సులకు ఆహ్వానించడం విశేషం.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో తెలంగాణను అగ్ర స్థానంలో నిలిపిన కేటీఆర్‌ను ఫోరం అభినందించింది.

దిల్లీలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడం, వరల్డ్ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించిన తీరులో కేటీఆర్ భాగస్వామ్యాన్ని ప్రత్యేకంగా పరిగణించి ఈ సదస్సుకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

Image copyright Getty Images

ఏపీలో 14,300 పోస్టుల భర్తీకి షెడ్యూల్

ఏపీ టెట్ పరీక్షలను ఫిబ్రవరి 5కు వాయిదా వేశారంటూ సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం మేరకు..

ఉపాధ్యాయ అర్హత పరీక్షను ప్రభుత్వం మూడు వారాల పాటు వాయిదా వేసింది. ఈ పరీక్షలు ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు జరుగనున్నాయి.

టెట్‌కు సిద్ధమవ్వడానికి తగినంత వ్యవధి లేదని, సిలబస్ కూడా ఎక్కువ ఉందని అభ్యర్థుల నుంచి ఆందోళన వ్యక్తమవడంతో గడువు పొడిగించినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం తెలిపారు.

టెట్‌ను వాయిదా వేసినప్పటికీ డీఎస్సీ నిర్వహణపై ఎలాంటి ప్రభావం ఉండదని మంత్రి గంటా స్పష్టం చేశారు.

ఏపీపీఎస్సీ ద్వారా పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని, దాదాపు 14,300 పోస్టుల భర్తీకి షెడ్యూల్ ఖరారైందని జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేయొచ్చని చెప్పారు.

రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లో 1,385 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించామన్నారు. తొలివిడతగా భర్తీ చేయాలనుకున్న 1104 పోస్టుల్లో 90 ప్రొఫెసర్, 168 అసోసియేట్ ప్రొఫెసర్, 846 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులున్నాయి.

ఫిబ్రవరిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని చెప్పారు.

జనవరి 6 లోగా నోటిఫికేషన్లు వెలువడేలా అన్ని వర్సిటీలకు సూచించామని గంటా తెలిపారు.

Image copyright Getty Images

తెలుగు విద్యార్థులకు తెలుగు రాదట

టెన్త్ విద్యార్థులకూ తెలుగు రావట్లేదంటూ.. ఆంధ్ర జ్యోతి దిన పత్రిక ఓ వార్తను ప్రచురించింది. అందులో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి చేసిన సర్వేను ప్రస్తావించింది.

ప్రస్తుతం తెలుగు విద్యార్థిలోకమే మాతృ భాష పట్ల ఆసక్తి చూపని పరిస్థితి ఈ సర్వేలో వెల్లడైంది.

దేశవ్యాప్తంగా నవంబరులో నిర్వహించిన సర్వేలో.. 10వ తరగతి విద్యార్థులు సైతం తెలుగులోనే వెనుకబడి ఉన్నారని తేలింది.

తెలుగు, ఇంగ్లీష్, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో ఈ సర్వే నిర్వహించారు. జాతీయ సగటు 250గా నిర్ధరించారు. దీంతో పోలిస్తే మని విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్, సైన్స్‌లో తక్కువ సగటు నమోదు చేశారు.

అన్నిటికన్నా తెలుగులో వెనకబడ్డారు. ప్రభుత్వ స్కూళ్లతో పోలిస్తే ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లోనూ జాతీయ సగటును దాటారు.

తెలుగులో కూడా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 231 సగటుతో ఉండగా ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 257తో సత్తా చాటడం విశేషమని ఆంధ్ర జ్యోతి ప్రచురించింది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

విక్టోరియా మహారాణి, ఆమె భారత గుమస్తా అబ్దుల్ కరీమ్ మధ్య అంతుపట్టని ఆ బంధాన్ని ఏమనాలి

భర్త వైద్యం కోసం.. 65 ఏళ్ల వయసులో ఆమె పరుగు పందేల్లో పోటీ పడుతున్నారు

ఉత్తర కొరియా భారీ ఎత్తున రిసార్టులు, స్పాలు ఎందుకు నిర్మిస్తోంది

కరోనా వైరస్-వుహాన్ : ఒక నగరాన్ని మూసేయడం సాధ్యమా.. చైనా చర్యతో వైరస్ వ్యాప్తి ఆగిపోతుందా

INDvsNZ: రెండో టీ20లో న్యూజీలాండ్‌పై భారత్ విజయం

‘వీళ్లు అధికారంలో లేకపోతే ప్రపంచం మెరుగ్గా ఉండేది’.. ట్రంప్, జిన్‌పింగ్‌ పాలనపై జార్జ్ సోరస్ విమర్శలు

తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం.. ఫలితాలు ఏం చెబుతున్నాయి

రోడ్డుపై వేగంగా వెళ్లడానికి కారులో అస్థిపంజరాన్ని పక్కన కూర్చోబెట్టుకున్నాడు

పద్మ అవార్డ్స్ 2020 : జైట్లీ, సుష్మా స్వరాజ్‌లకు మరణానంతరం పద్మ విభూషణ్.. పీవీ సింధుకు పద్మభూషణ్