పోలవరం నిర్వాసితుల గోడు: భూమి లేకుండా ఏం తింటాం? ఎలా బతుకుతాం?

  • 28 డిసెంబర్ 2017
రోదిస్తున్న మహిళ Image copyright BBC/Naveen Kumar K
చిత్రం శీర్షిక మూడేళ్లు అయినా భూమి రాలేదని రమణ అంటున్నారు

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 222 గ్రామాలు ముంపుకు గురవుతాయని అంచనా. ఈ క్రమంలో రెండు లక్షల మంది ప్రజలు నిర్వాసితులు కావొచ్చు.

తొలి విడతలో నిర్వాసితులైన చేగుంటపల్లి గ్రామస్థులతో నేను మాట్లాడాను. ఇక్కడ ఎక్కువ మంది ఆదివాసులే.

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు మొదలు పెట్టాక ఇప్పటికి ముంపు ప్రాంతంలోని 3,446 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. వీరిని 2010-11‌లోనే సర్వే చేసి అప్పటి భూసేకరణ చట్టం కింద పునరావాసం కల్పించారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionపోలవరం ప్రాజెక్టు వల్ల లక్షలాది మంది నిరాశ్రయులు కానున్నారు.

భూ పరిహారం

షెడ్యూల్డ్ తెగలకు:

5 ఎకరాల వరకు భూ పరిహారం

5 ఎకరాల పైనున్న భూమికి నగదు రూపంలో పరిహారం

ఇతరులకు:

సాగులో లేని భూమికి రూ.1.15 లక్షలు

సేద్యపు భూమికి రూ.1.30 లక్షలు


నగదు పరిహారం

18 సంవత్సరాలు పైబడిన ప్రతి గిరిజన కుటుంబ సభ్యుడికి: రూ.1.7 లక్షలు

గిరిజనేతర కుటుంబ సభ్యుడికి: రూ.1.5 లక్షలు

(ఆధారం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం)


Image copyright BBC/Naveen Kumar K

భూమి లేదు ఇల్లు లేదు

అయితే అందులో ప్రతి గ్రామంలో కనీసం 10 కుటుంబాలకైనా ఇస్తామన్న భూమి లేదా ఇల్లు రాలేదన్నది గ్రామస్థుల ఆరోపణ.

పోలవరం మండలం చేగుంటపల్లి గ్రామానికి చెందిన రమణ అనే మహిళ నిర్వాసితులైన మొత్తం 47,000 మంది ఆదివాసులలో ఒకరు. మూడు ఎకరాల భూమి వదులుకొని జీవనాధారమైన అడవినీ, పుట్టిన ఊరు వదిలి వచ్చేశారు.

Image copyright BBC/Naveen Kumar K

ఇప్పటికి మూడేళ్లు అవుతున్నా రావాల్సిన భూమి ఇంకా రాలేదు అని ఆమె చెబుతున్నారు.

"ఊరు ఖాళీ చేసి వచ్చినప్పటి నుంచి నా భర్తకు, పిల్లలకు తెలియకుండా ఏడ్చేదాన్ని. పొలం లేకుండా ఏం తింటాము? ఎలా బతుకుతాం? అన్న బాధ కలిచేస్తోంది. పాత ఊర్లో చచ్చిపోయినా బాగుండేది" అని వాపోయారు రమణ.

Image copyright BBC/Naveen Kumar K

అద్దె కూడా ఇవ్వడం లేదు

అదే ఊరికి చెందిన గీతాంజలి మరో ఆదివాసీ మహిళ.

తమకు కట్టించి ఇస్తామన్న ఇల్లు ఇంకా కట్టించి ఇవ్వలేదు. అద్దె కూడా ప్రభుత్వం ఇవ్వటం లేదు అని ఆమె చెప్పారు.

ఈ ఒక్క గ్రామమే కాదు పక్క గ్రామాలలో కూడా ఇటువంటి సమస్యలే ఉన్నాయి.

Image copyright BBC/Naveen Kumar K

అడవే ఆధారం

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులంతా ముఖ్యంగా అడవిపైనే ఆధార పడి జీవిస్తారు.

పుల్లలు ఏరుకోవటం, ఈత కళ్ళు గీసే పని, కుంకుడు కాయలు, తేనే వంటి అటవీ ఉత్పత్తులను సేకరిస్తారు. ఇపుడు అమాంతంగా తీసుకొచ్చి అడవికి దూరంగా కాలనీలు కట్టించినా సుఖం లేదని అంటున్నారు.

Image copyright BBC/Naveen Kumar K
చిత్రం శీర్షిక ప్రాజెక్టుతో నాలాంటి రైతులకు ఏం ఉపయోగమని నర్సింహులు ప్రశ్నిస్తున్నారు

అన్నీ ఇచ్చాం

అధికారులు మాత్రం అన్ని సక్రమంగా చేసేశాము అని అంటున్నారు.

"ఏదో ఒకటో రెండో కుటుంబాలు మిగిలి పోయి ఉంటాయి. కానీ వీలైనంత వరకు అందరికి ఇవ్వవలసిన పునరావాసం కల్పించాం. మిగిలిన వాళ్లవి కూడా చూస్తాము" అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఉన్నత అధికారి అన్నారు.

కానీ పొలం పనులు చేసి జీవనోపాధి సాగించుకునే రైతులు ఇప్పుడు కూలీలుగా మారారు. రామయ్యపేట కు చెందిన రైతు నర్సింహులు ప్రాజెక్టు సైట్‌లో సిమెంట్ పనిలో చేరారు.

"నాగలి పట్టి పొలం దున్నిన చేతులు ఇవి. ప్రాజెక్టు వస్తే నా లాంటి రైతులకి ఏంటి ఉపయోగం? డబ్బులు ఇచ్చారు. కానీ ఐదుగురు ఉన్న కుటుంబానికి జీవితాంతం ఇవి సరిపోతాయా?" అని ప్రశ్నించారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు