ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం - సభలో ఎవరేమన్నారు?

  • 28 డిసెంబర్ 2017
రవిశంకర్ ప్రసాద్ Image copyright Getty Images

ట్రిపుల్ తలాక్ బిల్లు అని పిలిచే 'ముస్లిం మహిళల (వివాహ హక్కుల సంరక్షణ) బిల్లు, 2017'కు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. సుదీర్ఘ చర్చ తర్వాత బిల్లుకు వ్యతిరేకంగా వచ్చిన సవరణలన్నింటినీ సభ తిరస్కరించింది.

అంటే ట్రిపుల్ తలాక్ బిల్లు ఎలాంటి సవరణలు లేకుండానే సభ ఆమోదం పొందింది. ఇప్పుడు దీనిని రాజ్యసభలో ప్రవేశపెడతారు.

ఈ బిల్లుపై విపక్షాలు మొత్తం 19 సవరణలు ప్రతిపాదించాయి. అయితే వాటన్నింటినీ సభ తిరస్కరించింది. మూడు సవరణలపై సభ్యులు వోటింగ్‌కు పట్టుబట్టారు. వోటింగ్ తర్వాత ఆ ప్రతిపాదనలు వీగిపోయినట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.

ఎవరైనా వ్యక్తి ట్రిపుల్ తలాక్ ఇచ్చినట్టయితే ఆ వ్యక్తికి బెయిల్ లభించదు. దీనికి మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది.

అంతకు ముందు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గందరగోళం మధ్యే సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

చర్చలో పాల్గొంటూ మంత్రి, "దేశంలో చాలా మంది మహిళలు ట్రిపుల్ తలాక్ బాధితులుగా ఉన్నారు. 2017 ఆగస్ట్ 22న సుప్రీంకోర్టు దీనిని రాజ్యాంగవిరుద్ధమైందని ప్రకటించింది. రామ్‌పూర్ అనే గ్రామంలో ఒక మహిళ ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తుందన్న కారణంతో ఆమెకు తలాక్ ఇచ్చినట్టు ఈ ఉదయమే ఒక వార్త చదివాను" అని అన్నారు.

"ఇస్లామిక్ దేశాలైన బంగ్లాదేశ్, ఈజిప్ట్, మొరాకో, ఇండోనేషియా, మలేషియా, పాకిస్తాన్‌లలో కూడా ట్రిపుల్ తలాక్‌పై నియంత్రణలున్నాయి. బంగ్లాదేశ్‌లో 1961లోనే చట్టం తెచ్చారు. దీని ప్రకారం భర్త తన భార్యకు లిఖితపూర్వకంగా విడాకులు ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయనట్టయితే సంవత్సరం పాటు శిక్ష పడే వీలుంది. 1961లోనే పాకిస్తాన్‌లో కూడా చట్టం చేశారు. దీని ప్రకారం ట్రిపుల్ తలాక్ లేదా తలాక్-ఏ-బిద్దత్‌లో భార్యకు లిఖితపూర్వకంగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. నిబంధనను పాటించని పక్షంలో సంవత్సరం పాటు జైలు శిక్ష, ఐదు వేల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది" అని మంత్రి రవిశంకర్ ప్రసాద్ సభకు తెలిపారు.

Image copyright LOKSABHA
చిత్రం శీర్షిక విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజె అక్బర్

స్టాండింగ్ కమిటీకి పంపాలనే ప్రతిపాదనకు తిరస్కారం

కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖడ్గే మాట్లాడుతూ, "ప్రభుత్వం తెచ్చిన బిల్లులో కొన్ని లోపాలున్నాయి. ప్రతి ఒక్కరిదీ మహిళల పక్షమే. ఈ బిల్లును పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి పంపించాలి" అని అన్నారు.

అయితే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తోసిపుచ్చింది. ఏ సలహాలున్నా ఆయన సభలోనే ఇవ్వడం మంచిదని మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

అస్సాంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సుష్మితా దేవ్ మాట్లాడుతూ, "మీరు దీనిని నేరంగా చేసి భర్తను జైలుకు పంపిస్తే ఆ మహిళ, పిల్లల లాలన పాలన ఎట్లా జరగాలి? మహిళల పట్ల అంతగా ప్రేమ ఉంటే చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం ఎందుకు ముందుకు తేవడం లేదు? సుప్రీం కోర్టు తన తీర్పులో ట్రిపుల్ తలాక్‌ను నిషేధించింది. ముస్లిం మహిళల అభ్యున్నతి కోసం పాటుపడేలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే, వారి కోసం విడిగా ఒక ఫండ్ ఏర్పాటు చేయాలి. తలాక్ ఇచ్చిన భర్తలు జైలు పాలైతే బాధిత మహిళల పోషణ కోసం ఈ ఫండ్‌ను వినియోగించాలి" అని అన్నారు.

Image copyright RAVEENDRAN/AFP/Getty Images
చిత్రం శీర్షిక అసదుద్దీన్ ఓవైసీ

బిల్లు వైరుధ్యాల మయం

రాష్ట్రీయ జనతా దళ్ సభ్యుడు జయప్రకాశ్ యాదవ్ సభలో మాట్లాడుతూ, "ఈ వ్యవహారంలో ముస్లిం పర్సనల్ బోర్డు నుంచి సలహా, సమ్మతి తీసుకోవడానికి ప్రయత్నించి ఉండాల్సింది. భర్త జైలులో, భార్య ఇంట్లో ఉంటే పిల్లలను ఎవరు పోషిస్తారు?" అని అన్నారు.

హైదరాబాద్‌కు చెందిన ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ, "ఈ విషయంలో పార్లమెంటుకు చట్టం చేసే హక్కు లేదు. ఎందుకంటే ఈ బిల్లు ప్రాథమిక హక్కులకు భంగకరం. ఇది రాజ్యాంగంలోని 15వ అధికరణానికి విరుద్ధం. సుప్రీంకోర్టు ఇదివరకే తలాక్-ఏ-బిద్దత్‌ను రద్దు చేసింది" అని అన్నారు.

"దేశంలో ఇప్పటికే చాలా చట్టాలున్నాయి. గృహహింస నిరోధక చట్టం ఉంది. ఐపీసీ ఉంది. దీనిని నేరంగా చేసే ప్రయత్నం సరికాదు. ఈ బిల్లులో చాలా వైరుధ్యాలున్నాయి. భర్త జైలులోకి వెళ్లినా భార్యకు భృతి చెల్లించాలని ఇందులో ఉంది. జైలులో ఉన్న మనిషి భార్యకు ఎలా భృతి చెల్లించగలుగుతాడు?" అని ఓవైసీ ప్రశ్నించారు.

"దేశంలో భర్తలు వదిలేసిన మహిళలు 20 లక్షల మంది దాకా ఉన్నారు. వారంతా ముస్లింలేమీ కారు. వారి కోసం చట్టం చేయాల్సిన అవసరం ఉంది. వీరిలో గుజరాత్‌లో ఉన్న మన వదిన గారు కూడా ఉన్నారు. వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం అలా చేయడం లేదు" అని ఓవైసీ అన్నారు.

ఈ బిల్లు రాజ్యాంగంలోని 25వ అధికరణానికి ఉల్లంఘన అవుతుందని కేరళకు చెందిన ముస్లిం లీగ్ సభ్యుడు మహ్మద్ బషీర్ అన్నారు. ఇది పర్సనల్ లాను అతిక్రమిస్తుందని కూడా ఆయన అన్నారు.

బిజూ జనతాదళ్‌కు చెందిన సభ్యుడు భృతహరి మహతాబ్ మాట్లాడుతూ, ఈ బిల్లులో చాలా లోపాలున్నాయని అన్నారు. ఇది వైరుధ్యాల పుట్ట అని ఆయన అభిప్రాయపడ్డారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)