2017: ఐపీఓల ద్వారా రూ. 75,000 కోట్ల సమీకరణ

  • 29 డిసెంబర్ 2017
బుల్‌తో షారూక్ ఖాన్ Image copyright AFP/gettyimages

స్టాక్ మార్కెట్ల విషయంలో 2017 ఒక చిరస్మరణీయంగా మిగిలిపోతుంది.

ఇటు మదుపర్లకు లాభాలు పంచడమే కాదు.. అటు సంస్థలపైనా కాసుల వాన కురిపించింది.

తొలి పబ్లిక్ ఆఫర్ల (ఐపీఓ) సందడి బాగా కనిపించింది.

ఎన్ని సంస్థలు పబ్లిక్ ఇష్యూకు వచ్చాయి? ఎంత మొత్తాన్ని సమీకరించాయి?

ప్రస్తుతం వీటి షేరు ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Image copyright INDRANIL MUKHERJEE/getyimages

రూ.75,000 కోట్లు

దాదాపు 153 సంస్థలు ఐపీఓకి వచ్చాయి. ఈ సంస్థలు ఉమ్మడిగా దాదాపు రూ.75,000 కోట్లు సమీకరించాయి.

మన దేశంలో 2017లో నిధుల సమీకరణ పరంగా వచ్చిన పబ్లిక్ ఇష్యూలలో జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాది అతి పెద్దది.

ఈ ఇష్యూ ద్వారా సంస్థ దాదాపు రూ.11,000 కోట్లు సమీకరించింది.

దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చూసినా 2017 ఐపీఓలకు మంచి కాలమని చెప్పొచ్చు.

Image copyright AFP/gettyimages

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,624 ఐపీఓలు వచ్చాయి. ఇవన్నీ కలిపి దాదాపు రూ. 12.50 లక్షల కోట్లు సమీకరించాయి.

ప్రస్తుతం డాలరుతో పోలిస్తే రూపాయి 63-65 మధ్య కదలాడుతోంది.

2007లో 1,974 సంస్థలు తొలి పబ్లిక్ ఇష్యూకు వచ్చాయి. ఇవి ఉమ్మడిగా సమీకరించిన నిధులు రూ.13.50 లక్షల కోట్లు.

నాడు డాలరుతో పోలిస్తే రూపాయి 38-40 మధ్య ఉంది.

బీఎస్‌‌ఈలో షేరు ధర పరంగా బాగా రాణించిన 5 షేర్లు

(గమనిక: పైన పట్టికలో ఇచ్చిన ప్రస్తుత ధరలు 2017 డిసెంబరు 29 ముగింపు నాటివి)

బీఎస్ఈలో షేరు ధర పరంగా డీలాపడిన 5 షేర్లు

(గమనిక: పైన పట్టికలో ఇచ్చిన ప్రస్తుత ధరలు 2017 డిసెంబరు 29 ముగింపు నాటివి)

తొలి పబ్లిక్ ఆఫర్ అంటే ఏమిటి?

ఒక కంపెనీని ఎందుకు స్థాపిస్తారు..? వ్యాపారం కోసమే కదా..!

వ్యాపారంలో ప్రధాన ఉద్దేశమేమిటి..? లాభాలే కదా..!

నిన్న రూపాయి.. నేడు రెండు రూపాయలు.. రేపు మూడు రూపాయలు ఇలా లాభం అంతకంతకూ పెరుగుతూ పోవాలనే కదా ఎవరైనా ఆశించేది.

ఇలా లాభం పెరగాలంటే ఆదాయం పెరగాలి.. ఆదాయం పెరగాలంటే అమ్మకాలు పెరగాలి..

అమ్మకాలు పెరగాలంటే కొత్త మార్కెట్లలోకి విస్తరించాలి.. కొత్త మార్కెట్లలోకి విస్తరించాలంటే పెట్టుబడి కావాలి.

పెట్టుబడి పెట్టాలంటే నిధులు కావాలి. సంస్థలు అనేక మార్గాల్లో ఈ నిధులు సమీకరిస్తాయి.

Image copyright INDRANIL MUKHERJEE/gettyimages

ఎలా సేకరిస్తారు?

నిధుల సమీకరణ మార్గాల్లో తొలి పబ్లిక్ ఆఫర్ ఒకటి. దీనినే ఆంగ్లంలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) అంటారు.

ఏ సంస్థ అయితే ఐపీఓ ద్వారా నిధులు సమీకరించాలని అనుకుంటుందో దానిని కొన్ని వాటాలు (షేర్స్)గా విభజిస్తారు.

ఒకో షేరుకు ప్రాథమిక ధరను నిర్ణయిస్తారు. దీనినే ఆఫర్ ప్రైస్ అంటారు. ఈ ధర వద్ద మదుపర్లు షేర్లు కొనుక్కోవాల్సి ఉంటుంది.

సంస్థ తనకు ఎంత నిధులు అవసరమో ఆ మేరకు షేర్లను విక్రయానికి పెడుతుంది. దీనినే ఇష్యూ సైజ్ అంటారు.

ఇలా సంస్థలోని వాటాలను తొలిసారి ప్రజలకు విక్రయించడాన్ని తొలి పబ్లిక్ ఆఫర్ అంటారు.

Image copyright INDRANIL MUKHERJEE/gettyimages

స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు:

ఇలా ఐపీఓ ముగించుకొని వచ్చిన సంస్థల షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వంటి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదవుతాయి.

ఇక్కడ ఆ షేర్లను అమ్మే వాళ్లు అమ్ముతుంటారు. కొనే వాళ్లు కొనుక్కుంటూ ఉంటారు.

ఐపీఓ ప్రయోజనాలు

  • సులభంగా నిధులు సమీకరించవచ్చు
  • నిధులు తిరిగి చెల్లించనక్కర్లేదు
  • వడ్డీల బాధ ఉండదు
  • అప్పులు తీర్చవచ్చు
  • కొత్త ఉత్పత్తుల తయారీపై ఖర్చు చేయొచ్చు
  • కార్యకలాపాలను విస్తరించవచ్చు

(ఆధారం: ఎర్నెస్ట్ అండ్ యంగ్, బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈ)

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)