'ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్': భారతదేశంలోని ముస్లింలంతా దీన్ని పాటిస్తారా?... ట్రిపుల్ తలాక్ గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిన 4 విషయాలు

  • దివ్య ఆర్య
  • బీబీసీ ప్రతినిధి
ట్రిపుల్ తలాక్

ఫొటో సోర్స్, Getty Images

ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) బిల్లుకు లోక్‌సభ (2018 డిసెంబర్ 27వ తేదీన) ఆమోదం తెలిపింది. దీని ప్రకారం 'ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్'ను ఇకపై క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. ఈ బిల్లుపై రాజ్యసభలో కూడా చర్చించి, ఆమోదం పొందితే, అది చట్టంగా రూపొందుతుంది.

అసలు 'ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్' అంటే ఏంటి?

'ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్' లేదా 'తలాక్-ఉల్-బిద్దత్' అనేది 'తలాక్' చెప్పే ఒక విధానం. దీని ద్వారా భర్తలు ఒకే సమయంలో మూడు సార్లు 'తలాక్', 'తలాక్', 'తలాక్' అని చెప్పడం ద్వారా విడాకులు పొందవచ్చు.

దీనిని మాటల ద్వారా లేదా టెక్ట్స్ మెసేజ్‌ల ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా - ఎలాగైనా చెప్పవచ్చు.

దీనిని నిషేధించాలంటూ ముస్లిం మహిళల నుంచి సుప్రీంకోర్టుకు పెద్ద ఎత్తున పిటిషన్లు వెల్లువెత్తడంతో, కోర్టు ఇది రాజ్యాంగవిరుద్ధం అంటూ 2017 ఆగస్టులో దానిని నిషేధించింది.

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశంలోని ముస్లింలంతా ఈ 'ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్'ను పాటిస్తారా?

సున్నీ ఇస్లామిక్ చట్టంలోని మూడు సాంప్రదాయాలు 'ట్రిపుల్ తలాక్' విధానం ఇప్పుడు చెల్లుబాటు కాదని చెబుతున్నా... నాలుగోది అయిన దేవ్‌బంద్ సాంప్రదాయంలో మాత్రమే ఈ వివాదాస్పద విధానం ప్రస్తుతం చెల్లుబాటులో ఉంది.

భారతదేశంలోని ముస్లింలలో ఈ 'ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్'పై అధికారిక గణాంకాలు లేవు.

అతి తక్కువ మందితో నిర్వహించిన ఒక ఆన్‌లైన్ సర్వేలో, ఒక్కశాతం కన్నా తక్కువ మంది ఈ రకం విడాకుల విధానాన్ని ఉపయోగించుకున్నారని తెలిసింది.

ఖురాన్ ప్రకారం 'ట్రిపుల్ తలాక్' ఎలా ఇస్తారు?

విడాకుల ప్రక్రియను ఒక ముస్లిం పురుషుడు ప్రారంభిస్తే దానిని 'తలార్-ఉల్-అహ్సాన్' అని పిలుస్తారు. పరిస్థితులు చక్కబడేందుకు, దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తొలగించుకునేందుకు అవకాశం కల్పించే విధంగా ఇది మూడు నెలల వ్యవధిలో జరగాలి.

ఎవరైనా ముస్లిం మహిళ కూడా విడాకులను కోరవచ్చు. దీనిని 'ఖులా' అని అంటారు.

ఒకవేళ ఒక మహిళ విడాకులు కావాలనుకుని, ఆమె భర్త దానికి నిరాకరిస్తుంటే, ఆమె ఎవరైనా ఒక ఖాజీ వద్దకు లేదా షరియా కోర్టుకు వెళ్లవచ్చు. ఈ విధంగా న్యాయబద్ధంగా జారీ అయిన విడాకులను 'ఫష్క్-ఎ-నిఖా' అని అంటారు.

వివాహం జరిగేటప్పుడే, వివాహ ఒప్పందం 'నిఖానామా'లోనే ఒక మహిళ 'తలాక్' నియమ నిబంధనలను పేర్కొనవచ్చు. దీనిని 'తఫ్‌వీద్-ఎ-తలాక్' లేదా భార్యకు తలాక్ హక్కుల బదిలీ అంటారు.

ఫొటో సోర్స్, Getty Images

'ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్' చుట్టూ అలుముకున్న వివాదమేంటి?

ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) బిల్లు ప్రకారం 'ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్'ను క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. దీని కింద ఒక ముస్లిం పురుషుడికి అత్యధికంగా మూడేళ్ల జైలుశిక్ష విధించవచ్చు.

అంతే కాకుండా భర్త ఆ కాలంలో బాధితురాలికి భరణాన్ని కూడా చెల్లించాలి.

కొన్ని ముస్లిం మహిళా బృందాలు దీని వల్ల ముస్లిం మహిళలకు ప్రయోజనం ఉండదని వాదిస్తున్నాయి. వివాహ బంధాన్ని కొనసాగించడంలో మహిళలకు కూడా సమానమైన హక్కులు, రక్షణ వ్యవస్థలు ఉండాలని, వివాహ రద్దు విషయంలో తమ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు.

కేవలం జైలులో పెట్టడం వల్ల లక్ష్యం నెరవేరదు. దీని వల్ల భర్తలు తాము జైలులో ఉండడం వల్ల భరణం చెల్లించలేకపోతున్నామని కూడా చెప్పే అవకాశం ఉంది. అప్పుడు భార్యలే తమను, తమ పిల్లలనూ పోషించుకోవాల్సి వస్తుందని వారు అంటున్నారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)