2017: దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు

  • 30 డిసెంబర్ 2017
సెన్సెక్స్ 34,000కు చేరిన సందర్భంగా వేడుకలు Image copyright PUNIT PARANJPE/getty images
చిత్రం శీర్షిక సెన్సెక్స్ 2017 చివరి కల్లా 34,000 పాయింట్లకు చేరింది

మదుపర్లకు 2017 మరపురాని సంవత్సరం.

స్టాక్ మార్కెట్లు లాభాలతో హోరెత్తించాయి. సూచీలు రేసు గుర్రాల మాదిరి దూసుకు పోయాయి.

మదుపర్లపై కాసుల వర్షాన్ని కురిపించాయి. మధ్యమధ్యలో చిన్నచిన్న మరకలున్నా చివరకు తీపి తాయిలాలనే పంచాయి.

Image copyright INDRANIL MUKHERJEE/getty images
చిత్రం శీర్షిక 2017లో మదుపర్లకు సూచీలు లాభాలు పంచాయి

కొత్త శిఖరాలకు

ఏడాది క్రితం ఇదే సమయానికి సెన్సెక్స్ 26,366 పాయింట్ల వద్ద ఉంది. ఏడాది తిరిగే సరికి అది నేడు 34,000 పాయింట్లకు చేరింది.

అంటే 7,600 పాయింట్లకు పైగా లాభపడింది. 29 శాతం ప్రతిఫలాన్ని ఇచ్చింది.

మార్కెట్లు దుమ్మురేపాయని చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం.

ఈ విషయంలో నిఫ్టీ కూడా తక్కువేమీ తినలేదు. 2017లో ఏకంగా 30 శాతం దూసుకెళ్లింది. 8,100 నుంచి 10,530 పాయింట్లకు చేరింది.

మొత్తానికి 2017లో ఇటు సెన్సెక్స్ అటు నిఫ్టీ సరికొత్త శిఖరాలకు చేరాయి. 2017కు లాభాలతో ఘనంగా వీడ్కోలు పలికి కొత్త సంవత్సరం దిశగా దూసుకెళ్లాయి.

అయితే 2017లో స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపిన ఓ అయిదు ప్రధాన సంఘటనలు చూద్దాం..

చిత్రం శీర్షిక 2017లో సెన్సెక్స్‌లో అత్యధికంగా లాభపడిన షేర్లు

87 శాతం వరకు ప్రతిఫలం

2017లో సూచీలే కాదు, కొన్ని షేర్లు కూడా అదరగొట్టాయి. సెన్సెక్స్, నిఫ్టీని మించి లాభాల్లో దూసుకెళ్లాయి.

సెన్సెక్స్-30లో టాటా స్టీల్ 87%, మారుతీ సుజుకీ 83%, ఎయిర్‌టెల్ 75%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 73%, హిందుస్థాన్ యూనిలీవర్ 67% చొప్పున లాభాలు పంచాయి.

2016 డిసెంబరు 29న టాటా స్టీల్ షేర్లలో రూ.లక్ష మదుపు చేసి ఉంటే, నేడు అది రూ.లక్ష 87 వేలు అయి ఉండేది.

Image copyright NOAH SEELAM/getty images

వస్తు, సేవల పన్ను

భారతదేశ చరిత్రలో అతిపెద్ద సంస్కరణ వస్తు-సేవల పన్ను (జీఎస్‌టీ). అంటే దాదాపు అన్ని పరోక్ష పన్నులను ఒకే తాటి కిందకు తీసుకురావడం.

దాదాపు 11 ఏళ్ల నిరీక్షణ తరువాత 2017 జులై ఒకటిన జీఎస్‌టీ అమల్లోకి వచ్చింది. ఇందులో 5, 12, 18, 28 శాతం పన్ను శ్లాబులున్నాయి.

ఏ వస్తువులు ఏ శ్లాబులోకి వస్తాయి వంటి విషయాలపై గందరగోళం నెలకొంది. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ వ్యాపారులపై ప్రభావం చూపాయి.

కార్పొరేట్ సంస్థల ఆదాయాలు సైతం కొంత మేరకు తగ్గాయి. 2017-18 తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు 5.7 శాతానికి తగ్గింది.

ఇందుకు కారణం ప్రభుత్వం అనాలోచితంగా పెద్దనోట్లను రద్దు చేయడం, హడావుడిగా జీఎస్‌టీని తీసుకు రావడమేనని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఆ తరువాత రెండో త్రైమాసికంలో వృద్ధి రేటు 6.3 శాతానికి పుంజుకుంది.

చిత్రం శీర్షిక 2017లో నష్టపోయిన సెన్సెక్స్ షేర్లు

ఎన్నికలు

2017లో ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరిగాయి. ఈ మూడు రాష్ట్రాలలోనూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని ప్రభుత్వాలు కోలువు తీరాయి.

ఉత్తర్ ప్రదేశ్‌లో భారీ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో గతంతో పోలిస్తే బీజేపీ కొన్ని సీట్లను కోల్పోవడం సూచీలపై ప్రభావం చూపింది.

Image copyright KIM WON-JIN/getty images

ఉత్తర కొరియా

2017లో స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపిన అంశాలలో ఉత్తర కొరియా ఒకటి.

అణు పరీక్షలు, మిసైల్స్ ప్రయోగాలు, హైడ్రోజన్ బాంబు పరీక్షలు అంటూ ప్రపంచవ్యాప్తంగా యుద్ధవాతావరణాన్ని సృష్టించింది. ఈ పరిణామాలు మదుపర్లను ఆందోళనకు గురి చేశాయి.

చిత్రం శీర్షిక 2017లో సెన్సెక్స్, నిఫ్టీ పనితీరు

ప్రభుత్వరంగ బ్యాంకులు

రానున్న రెండేళ్లలో ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.2 లక్షల కోట్లకు పైగా మూలధనాన్ని అందించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇది ఆ రంగ షేర్లపై సానుకూల ప్రభావాన్ని చూపింది.

ఉద్దేశపూర్వక ఎగవేతదార్లపై కఠిన చర్యలు తీసుకొనేలా తీసుకొచ్చిన ఇన్‌సాల్వేన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (దివాలా చట్టం) కూడా బ్యాంకింగ్ రంగంపై సానుకూల ప్రభావాన్ని చూపింది. 2017లో బీఎస్ఈ బ్యాంకెక్స్ దాదాపు 40 శాతం దూసుకెళ్లింది.

Image copyright SAM PANTHAKY/getty images

ముడిచమురు

ప్రపంచంలో అతిపెద్ద ముడిచమురు దిగుమతిదారుల్లో భారత్ ఒకటి. రెండేళ్ల క్రితం వరకు కనిష్ఠ స్థాయిల్లో ఉన్నముడి చమురు ధరలు 2017లో ధరలు పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ ధర 65 డాలర్ల పైన కదలాడుతోంది. పెరిగిన ముడిచమురు ధరలు ద్రవ్యలోటుపై ప్రభావాన్ని చూపాయి. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ గణాంకాల ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబరులో ఆర్థికలోటు రూ.6.12 లక్షల కోట్లకు పెరిగింది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)