పాకిస్తాన్: ‘200 ఏళ్ల పూర్వం మహిళల పరిస్థితులకు.. నేటి పరిమితులకూ పెద్ద తేడా లేదు’

  • 31 డిసెంబర్ 2017
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఇంగ్లండ్ రచయితకూ పాకిస్తాన్ మహిళలకూ ఏంటి సంబంధం?

200 ఏళ్ల క్రితం చనిపోయిన ఇంగ్లిష్ రచయిత జేన్ ఆస్టిన్. కానీ ఇప్పటికీ పాకిస్తాన్‌లో కొందరు మహిళలు ఆమెను గుర్తు చేసుకుంటున్నారు. ఏడాదికోసారి కలిసి అప్పటి దుస్తులనే ధరించి, ఆమె రచనల గురించి చర్చిస్తున్నారు.

పందొమ్మిదో శతాబ్దం తొలినాళ్లలో ఇంగ్లండ్‌లో మహిళలకు ప్రాధాన్యం ఉండేది కాదనీ, వాళ్లను కేవలం ఇంటి పనులకు పరిమితం చేసేవారనీ జేన్ ఆస్టిన్ అభిప్రాయం. అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టేలా ఆమె రాసిన పుస్తకాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ దక్కింది.

జేన్ ఆస్టిన్ రాసిన ‘ప్రైడ్ అండ్ ప్రిజ్యుడిస్’, ‘సెన్స్ అండ్ సెన్సిబిలిటీ’, ‘మ్యాన్స్‌ఫీల్డ్ పార్క్’ లాంటి రచనలకు ఇప్పటికీ మార్కెట్లో ఆదరణ ఉంది. ఆమె రచనల ఆధారంగా అనేక సినిమాలు కూడా రూపొందాయి.

నాటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండే ఆస్టిన్ రచనలకు పాకిస్తాన్‌లో కొందరు మహిళా అభిమానులు ఉన్నారు. వాళ్లంతా ‘జేన్ ఆస్టిన్ సొసైటీ ఆఫ్ పాకిస్తాన్’ అనే బృందంగా ఏర్పడ్డారు. ఇప్పటికీ ఏడాదికోసారి వాళ్లంతా కలిసి ఆస్టిన్ రచనల గురించి చర్చిస్తున్నారు.

చిత్రం శీర్షిక జేన్ ఆస్టిన్ సొసైటీ సభ్యులు

200ఏళ్ల క్రితం ఆస్టిన్ ప్రస్తావించిన సమస్యలే ఇప్పటికీ దక్షిణాసియాలో మహిళలు ఎదుర్కొంటున్నారని జేన్ ఆస్టిన్ సొసైటీ సభ్యులు అంటారు. ఆమె పుస్తకాలు చదివే అలవాటున్న కొందరు మహిళలు మొదట ఫేస్‌బుక్‌లో స్నేహితులయ్యారు. క్రమంగా ఆ స్నేహం పెరగడంతో కొన్నేళ్ల క్రితం అందరూ కలవాలని నిర్ణయించుకున్నారు.

‘మొదటిసారి అందరం ఓ టీపార్టీ ఏర్పాటు చేసుకొని కలిశాం. అప్పుడు అందరం ఆ కాలానికి చెందిన దుస్తులనే వేసుకున్నాం. చాలా కొత్తగా సరదాగా అనిపించడంతో అప్పట్నుంచీ ఇలా ఏడాదికోసారి కలుస్తున్నాం’ అంటారు లాలీన్ సుఖెరా. జేన్ ఆస్టిన్ సొసైటీని మొదలుపెట్టింది ఆవిడే.

‘జేన్ ఆస్టిన్ కాలం నాటి పరిస్థితులను ఇప్పటి సమాజానికి ఎలా అన్వయించుకోవచ్చో చర్చిస్తాం. అప్పటి ఆస్టిన్ రచనల్లో ఉన్న మగవాళ్ల పాత్రలే ఇప్పటి సమాజంలోనూ కనిపిస్తున్నాయి. 200ఏళ్ల నాటి రీజెన్సీ ఎరా పరిస్థితులకూ, ఇప్పటి దక్షిణాసియా పరిస్థితులకూ చాలా సారూప్యతలున్నాయి. ఆడవాళ్లను ద్వేషించడం, వాళ్లను మోసం చేయడం లాంటి పరిస్థితులు ఇప్పటికీ షరా మామూలే’ అంటారు లాలీన్.

మాలియా అనే మరో మహిళ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. ‘ఆస్టిన్ రచనల్లో ప్రస్తావించినట్టు.. ఈ రోజుకీ మహిళల సామాజిక స్థాయిలో పెద్దగా మార్పు రాలేదు. వారి జీవితంపై వారికున్న స్వేచ్ఛకూ, ఆర్థిక స్వాతంత్ర్యానికీ చాలా పరిమితులున్నాయి’ అంటారామె.

‘అత్తమామలు ఎదురుగా కూర్చున్నప్పుడు కోడలు చాలా పద్ధతిగా టీ అందించాలి. ఆమె కప్పుని ఎలా పట్టుకుందీ, ఎలా నడుస్తుందీ లాంటి విషయాలన్నీ వాళ్లు గమనిస్తారు. 200ఏళ్ల క్రితం కూడా పరిస్థితి ఇలానే ఉండేది. ఇప్పటికీ మహిళలు చాలా గంభీరంగా కనిపిస్తూ ఇంటి పనులకే పరిమితమవ్వాలని చాలామంది ఆశిస్తున్నారు’ అంటూ ఆస్టిన్ రచనల్లో పాత్రలకూ నేటి పరిస్థితులను ముడిపెట్టి చెబుతారు మాలియా.

‘పాకిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితులకు ఆస్టిన్ రచనలను అన్వయించుకోవచ్చు. అందుకే ఆమెకు పాకిస్తాన్‌లో అంత పేరొచ్చింది’.. అని అఫ్షాన్ అనే మరో మహిళ వివరిస్తారు. ఆ రచనలను చదువుతూ హాయిగా కాలాన్ని మరచిపోవచ్చన్నది ఆమె అభిప్రాయం.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)