ముంబయి అగ్నిప్రమాదంలోంచి నేనెలా బయటపడ్డానంటే..

  • 29 డిసెంబర్ 2017
భవనం పై అంతస్తులో ఉన్న పబ్‌లో అగ్నిప్రమాదం Image copyright AMOL RODE/BBC MARATHI
చిత్రం శీర్షిక భవనం పై అంతస్తులో ఉన్న రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం

అర్ధరాత్రి సమయంలో చిన్నగా మొదలైన మంటలు క్షణాల్లోనే అగ్నికీలలుగా మారాయి. 15 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. సందడిగా ఉన్న రెస్టారెంట్‌లో పది నిమిషాల్లో విషాదం అలుముకుంది. అసలా సమయంలో ఏం జరిగింది?

ముంబయి లోయర్ పరేల్ ప్రాంతంలోని కమలా మిల్స్ వాణిజ్య భవన సముదాయంలోని '1 ఎబౌ' రెస్టారెంట్‌లో గురువారం రాత్రి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.

చూస్తుండగానే 15 మంది సజీవ దహనం అయ్యారు. మరికొందరు గాయపడ్డారు.

ఈ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు బీబీసీ గుజరాతీ ఎడిటర్‌ అంకుర్ జైన్ తన స్నేహితులు, సోదరితో కలిసి ఆ రెస్టారెంట్‌లోనే ఉన్నారు.

ఈ ప్రమాదం నుంచి వారు ఎలా బతికి బయటపడ్డారు.? ఆ సమయంలో ఆయన ఏమేం గమనించారు? ఆయన మాటల్లోనే...

‘ఠాక్రే’ సినిమాతో బాలా సాహెబ్ ఇమేజిని మార్చే ప్రయత్నం?సాయంకాలం వేళ ఒక రెస్టారెంట్‌ వద్ద ఎలా ఉంటుందో కమలా మిల్స్ రెస్టారెంట్ వద్ద కూడా అలాగే ఉంది. కానీ నా జీవితంలో అత్యంత భయంకరమైన ఘటన ఇది. నాతో పాటు అక్కడున్న వంద మంది పరిస్థితి ఏమై ఉండేదో ఇప్పుడు తలుచుకుంటేనే భయం వేస్తోంది.

నేను డిన్నర్ చేసేందుకు నా స్నేహితులు, సోదరితో కలిసి '1 ఎబౌ' రెస్టారెంట్‌కు వెళ్లాను. కానీ అప్పటికే రెస్టారెంట్ మొత్తం కిక్కిరిసిపోయింది. కూర్చోవడానికి కూడా చోటు దొరకలేదు.

అందుకే పక్కనే ఉన్న డీజే కన్సోల్ వద్ద నిల్చుని ఎదురుచూస్తున్నాం. ఏదైనా టేబుల్ ఖాళీ అయితే కూర్చుందామని.

అప్పుడు అర్ధరాత్రి 12.30 అయింది. ఒక్కసారిగా అరుపులు, కేకలు వినిపించాయి.

'అక్కడ మంటలు వస్తున్నాయి.. రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్లిపోండి' అనే అరుపులు విన్నాను.

విన్న వెంటనే మేం అప్రమత్తమయ్యాం. రెస్టారెంట్ చివర్లో కొన్ని మంటలు మాకు కనిపించాయి. కానీ వాటిని అదుపు చేయవచ్చనే నేను భావించా. కానీ నా అంచనా పూర్తిగా తప్పు.

కొన్ని సెకండ్లలోనే పరిస్థితి చాలా విషమంగా మారుతోందని అక్కడున్న వారందరికీ అర్ధమైంది. మంటలు వేగంగా విస్తరించాయి. సమీపంలో ఉన్న వస్తువులను అవి దహించి వేస్తున్నాయి.

రెస్టారెంట్ ఫాల్స్ సీలింగ్ వల్ల మంటలను నియంత్రించడం సాధ్యం కాలేదు. ఒక్కసారి మంటలు సీలింగ్‌కి అంటుకుంటే వాటిని ఆర్పడం ఇక ఎవరి వల్లా కాదు.

Image copyright AMOL RODE/BBC MARATHI

మెట్ల ద్వారా కిందికి వెళ్లిపోవాలని రెస్టారెంట్ సిబ్బంది మాకు చెప్పారు. కానీ అందరూ ఒకేసారి పరుగులు తీయడంతో అక్కడ తోపులాట జరిగింది.

అంతేకాదు, కిందికి వెళ్లే మెట్ల దారిలో కూడా మంటలు చెలరేగాయి.

మా చుట్టు పక్కల ఉన్న అన్ని వస్తువులు ఒకదాని తర్వాత మరొకటి అగ్నికి ఆహుతి అవుతున్నాయి.

ఎలాగోలా మేం మెట్ల వరకు చేరుకున్నాం. ప్రాణం లేచి వచ్చింది. కానీ అంతలోనే కంగారు. మాలో ఒకరు కనిపించడం లేదు.

మాకు చాలా భయమేసింది. ఆమె ఎక్కడుందో తెలియలేదు. ఆమె పేరు పెట్టి బిగ్గరగా పిలిచాం. కానీ స్పందన లేదు.

పక్కన ఉన్న భవనం నుంచి కొందరు కిందికి దిగి వెళ్లారని ఎవరో ఒకరు మాకు చెప్పారు. కానీ మాకు నమ్మకం కలగలేదు.

కాసేపు అక్కడే వెతికాం. తను ముందే కిందికి దిగి వెళ్లిపోయి ఉంటుందన్న ఆశతో మేం కిందికి వచ్చేశాం. అదృష్టం బాగుండి మేం అనుకున్నది నిజమే అయింది.

చిత్రం శీర్షిక కమలా మిల్స్

మేం మూడో అంతస్తు నుంచి మెట్ల మార్గంలో కిందికి పరుగెత్తాం. ఆ సమయంలో రెస్టారెంట్‌లో పేలుళ్లు, జనం అరుపులు మాకు వినిపించాయి.

ఇంతలో రెస్టారెంట్ నుంచి వెంటనే బయటకి వచ్చేయమని మా బంధువు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఎలాగోలా మేం రెస్టారెంట్ నుంచి బయటపడ్డాం.

నిజానికి మంటలు చిన్నగా మొదలైనప్పుడే ఆ రెస్టారెంట్ నుంచి మేం బయటకు వెళ్లాలని అనుకున్నాం. మేం వెలుపలికి వెళ్లే దారికి సమీపంలోనే ఉన్నాం. అందుకే సకాలంలో ప్రాణాలతో బయటపడగలిగాం.

తమ బంధువులు, స్నేహితులు ఇంకా పైనే ఉన్నారని రెస్టారెంట్‌ కింద జనం అరవడం మేం చూశాం. ఈ మంటలు ఇంతటి విషాదాన్ని నింపుతాయని ఆ క్షణంలో ఎవరూ అనుకుని ఉండరు.రూఫ్ టాప్‌ ఒక మండే అగ్నిగోళంలా కనిపించింది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని వాచ్‌మెన్, సెక్యూరిటీ సిబ్బంది అరుస్తూ జనానికి చెబుతున్నారు.

ఇంత గందరగోళ పరిస్థితుల్లో తప్పిపోయిన మా బృందంలోని సభ్యురాలు కింద కనిపించారు. దాంతో మనసు కాస్త కుదుటపడింది.

అప్పుడే అగ్నిమాపక సిబ్బంది వచ్చారు.

ముగ్గురు గాయపడ్డారని వారు మాకు చెప్పారు. అప్పుడు సమయం దాదాపు 12.40 నిమిషాలు అవుతోంది.

కాసేపటి తర్వాత మేం ఇంటికి చేరుకున్నాం. కానీ మంటలు ఆరిపోయాయా లేదా అన్న విషయం న్యూస్ చూస్తూ తెలుసుకున్నాం.

ఇది చాలా విషాదకర ఘటన. మా పని అయిపోయిందనే అనుకున్నాం. చావు అంచుల దాకా వెళ్లొచ్చినట్లు అనిపిస్తోంది.ఉదయం న్యూస్ చూసి షాకయ్యాం. 15 మంది చనిపోయారని తెలిసి చాలా బాధపడ్డాం. కానీ ఆ ప్రమాదం ఇంతటి విషాదాన్ని మిగుల్చుతుందని అస్సలు అనుకోలేదు. కానీ అదే జరిగింది.

ప్రమాదం జరిగిన ప్రాంతం చుట్టుపక్కల మండే స్వభావం ఉన్న వస్తువులు ఉండటమే ఈ దుస్సంఘటనకు కారణం.

రెస్టారెంట్ యజమాని, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కూడా కారణమే. ఇలాంటి ఒక అత్యవసర పరిస్థితి వస్తే ఎదుర్కొనేందుకు, సహాయ చర్యలు చేపట్టేందుకు సరైన యంత్రాంగం, ఎర్పాట్లు లేవు.

గాయపడిన వారిలో ఎక్కువ మంది మహిళలు వాష్‌రూంలో ఉన్న వారేనని అధికారులు చెప్పారు. అది మంటలు లేచిన ప్రాంతానికి సమీపంలో ఉంది. నాకీ విషయం బాగా గుర్తుంది.

ప్రమాదం జరగడానికి కొన్ని నిమిషాల ముందే మాలో ఒకరు ఆ వాష్‌రూంకి వెళ్లి వచ్చారు. ఒకవేళ వారిని సకాలంలో కాపాడి ఉండకపోతే ఏం జరిగి ఉండేదో ఊహించుకునేనే ఒళ్లు జలదరిస్తోంది.


మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionకమలా మిల్స్ భవనం పైన మంటల్లో రెస్టారెంట్

నిజానికి ఫైర్ ఎగ్జిట్‌కే ముందు మంటలు అంటుకున్నాయి. ఇరువైపులా అట్టపెట్టెలు, బాక్సులు పెట్టడమే దానికి కారణం.

ఈ షాక్‌ నుంచి ఇంకా తేరుకోలేక పోతున్నా. భద్రతా ప్రమాణాలు పాటించని ఇలాంటి రెస్టారెంట్లకు అధికార యంత్రాంగం పర్మిషన్ ఎలా ఇచ్చారనేది ఆశ్చర్యం కలిగిస్తోంది.

అయితే, తమకు ఫైర్ సేఫ్టీకి సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయని ఈ రెస్టారెంట్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మొత్తం ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)