ముస్లింలను బాల్ ఠాక్రే ప్రేమించారా? ద్వేషించారా?

  • 29 డిసెంబర్ 2017
బాలా సాహెబ్ ఠాక్రే Image copyright Getty Images

బాలా సాహెబ్ ఠాక్రేపై రూపొందుతున్న 'ఠాక్రే' మూవీ టీజర్ విడుదలైంది. సోషల్ మీడియాలోనూ, సామాన్య ప్రజల్లోనూ దీనిపై బాగా చర్చ జరుగుతోంది.

అయితే దూకుడుకు మారుపేరుగా భావించే బాలాసాహెబ్ ఠాక్రేపై తయారైన ఈ బయోపిక్ ఆయన పాత్రకు న్యాయం చేయగలుగుతుందా అన్నది అందరి మనసుల్లో ప్రశ్నగా ఉంది.

అయితే దీనికి జవాబు కావాలంటే మూవీ రిలీజయ్యే దాకా వేచి చూడాల్సిందే.

Image copyright RAUT'ERS Entertainment
చిత్రం శీర్షిక బాలా సాహెబ్ ఠాక్రేగా నవాజుద్దీన్ సిద్దీకీ

మూడు ముఖ్యవిషయాలు

అయితే ఈ మూవీకి సంబంధించి మూడు ముఖ్యమైన విషయాలు మాత్రం తప్పక చెప్పుకోవాల్సిందే.

మొదటిది -బాల్ ఠాక్రే జీవితాన్నే కథా వస్తువుగా చేసుకుని తీస్తున్న ఈ సినిమాకు నిర్మాత శివసేన సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు సంజయ్ రావుత్.

రెండో విషయం.. ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దీకీ ఠాక్రే పాత్ర పోషిస్తున్నారు. అయితే ఉత్తర ప్రదేశ్‌కు చెందిన నవాజుద్దీన్ కొద్ది రోజుల క్రితం దీని గురించి చెప్పడానికి నిరాకరించారు. బాల్ ఠాక్రే బయోపిక్‌లో నటిస్తున్నారన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు.

మూడో ముఖ్యమైన విషయం - ఈ సినిమా టీజర్‌లో మెడలో తావీజు వేసుకున్న ఒక వ్యక్తి బాల ఠాక్రేకు మద్దతుగా నినాదాలు చేస్తూ కనిపిస్తాడు. దాంతో పాటే అస్పష్టంగా కనిపించే ఒక షాట్‌లో ఒక వ్యక్తి కాషాయ వస్త్రాలు ధరించి సమావేశం నిర్వహిస్తూ కనిపిస్తాడు. అదే గదిలో మరో వ్యక్తి నమాజు చేస్తుంటాడు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక బాలా సాహెబ్ ఠాక్రేతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్‌

'బాల్ ఠాక్రే ముస్లిం వ్యతిరేకి కాదు'

ఈ మూడు విషయాల్లో చివరిది ఆశ్చర్యం కలిగించేది. ఎందుకంటే రాజకీయ నాయకుడు కావడానికి ముందు కార్టూనిస్టుగా పని చేసిన బాల్ ఠాక్రేకు ముస్లిం అనుకూల ఇమేజి ఉండేది.

ఈ దృశ్యాలకు సంబంధించి ఈ ఫిల్మ్ దర్శకుడు, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనకు చెందిన అభిజీత్ పాన్సేతో బీబీసీ మట్లాడింది. 'బాల్ ఠాక్రే ముస్లిం వ్యతిరేకి కాదు. ఆయన కేవలం పాకిస్తాన్ అనుకూలురైన ముస్లింలకు మాత్రమే వ్యతిరేకం' అని అభిజీత్ చెప్పారు.

"ఇది బాలా సాహెబ్‌పై ఫెయిర్ పొలిటికల్ బయోపిక్. ఠాక్రే గురించి ప్రజలకు తెలియని విషయాలను సైతం తెలియజెప్పడమే ఈ ఫిల్మ్ ఉద్దేశం. ఈ ఫిల్మ్ టీజర్‌లో మీరు చూసిన షాట్ అలాంటి కథనాల్లో ఒకటి. ఇవన్నీ మీకు ఫిల్ము చూసిన తర్వాత బోధపడతాయి" అని అభిజీత్ అన్నారు.

నవాజుద్దీన్‌ను ఈ సినిమాలోకి తీసుకోవడం గురించి చెబుతూ, "కళ విషయంలో మేం హిందూ, ముస్లిం కళాకారులను విడిగా చూడం. ఠాక్రే పాత్రకు నవాజుద్దీన్ సరిగ్గా సరిపోతాడని భావించడం వల్లనే మేం ఆయనను ఎంపిక చేశాం. మాకు సమస్యల్లా పాకిస్తానీ కళాకారులతోనే" అని అన్నారు.

Image copyright STRDEL/AFP/Getty Images

శివసేన మొదట్లో ఇలా లేదు

బాల్ ఠాక్రే నేతృత్వం వహించిన శివసేన పార్టీ నేడు అతివాద తరహా హిందుత్వ పార్టీలా కనిపించినప్పటికీ ఇది ముందు నుంచి అట్లా ఏమీ లేదు.

1970వ దశకంలో అది ముస్లిం లీగ్‌తో పొత్తు పెట్టుకొని ముంబయి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసింది.

అలాంటప్పుడు శివసేన అతివాద హిందుత్వ వైపు ఎలా మళ్లింది? ముంబయికి చెందిన పాత్రికేయుడు వైభవ్ పురందరే ఈ ప్రశ్నకు జవాబిస్తూ శివసేనలో ముస్లింల విషయంలో ద్వంద్వ వైఖరి తొలినుంచే ఉందని అన్నారు.

"ముస్లింలీగ్‌తో పాటు శివసేన అనేక ఇతర పార్టీలతో జత కట్టింది. రాజకీయంగా దానికి ఎక్కడ ఏది మంచిదనిపిస్తే దానితో పొత్తు పెట్టుకుంది" అని వైభవ్ చెప్పారు.

బహుశా బాల్ ఠాక్రే ముస్లిం వ్యతిరేకి కాదని చెప్పడం ఈ సినిమా ఉద్దేశమై ఉండొచ్చని ఆయన అన్నారు.

అయితే, బాబ్రీ మసీదు కూల్చేసింది తామేనని బీజేపీ ఎన్నడూ నేరుగా ఒప్పుకోలేదు కానీ బాల్ ఠాక్రే మాత్రం దీనిని బాహాటంగా ఒప్పుకున్నారని వైభవ్ అంటారు.

బాల్ ఠాక్రే ఓటు హక్కును నిషేధించిన వేళ...

రామమందిర ఉద్యమ సమయంలో శివసేన వేగంగా హిందుత్వ వైపు మళ్లుతున్నట్టు కనిపించింది. 1985 తర్వాత శివసేన పూర్తిగా హిందుత్వ మార్గాన్ని చేపట్టింది.

1987లో విలే పార్లే అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో హిందుత్వ పేరుతో పాల్గొన్న ఏకైక పార్టీ శివసేననే.

"ఆ ఎన్నికలో హిందుత్వ పేరుతో ఓట్లు అడిగినందుకు ఎన్నికల కమిషన్ ఠాక్రే ఓటుహక్కుపై ఆరేళ్ల నిషేధం విధించింది" అని వైభవ్ చెప్పారు.

1992-93 ముంబయి అల్లర్లలో శివసేన ప్రమేయం ఉందనే ఆరోపణలు కూడా వచ్చాయి. "ముస్లింలు ఏమైనా చేస్తే శివసేన వారికి గుణపాఠం చెబుతుందని బాల్ ఠాక్రే అనేవారు" అని వైభవ్ అన్నారు.

"ఆయన ఎప్పుడూ వివాదాల్లో ఉండే వ్యక్తి. ఏది మాట్లాడినా బాహాటంగానే మాట్లాడేవారు. 'దేశభక్తులైన ముస్లింల'కు మద్దతునివ్వడం శివసేన, ఠాక్రేల వ్యూహం. పాకిస్తాన్ క్రికెట్ టీమ్ గెల్చినందుకు ఎక్కడైనా టపాసులు కాలిస్తే దానికి నేను వ్యతిరేకం అని ఠాక్రే అంటుండేవారు. భారత క్రికెటర్ అజహరుద్దీన్‌ను ఠాక్రే దేశభక్తుడిగా భావించేవారు" అని వైభవ్ చెప్పారు.

Image copyright Getty Images

బాల్ ఠాక్రే అంతిమ యాత్ర

ఠాక్రే అంతిమ యాత్రను కూడా వైభవ్ ప్రస్తావించారు.

"ఆయన అంతిమయాత్ర సాగుతున్నప్పుడు మాహిమ్ దర్గాకు చెందిన ఖాదిమ్‌లు ఆయనకు గౌరవంగా ఒక చాదర్ సమర్పించారు. ఠాక్రేకు, ముస్లింలకు మధ్య కనిపించే ఈ సంబంధాలే వైరుధ్యపూరితమైనవి" అని వైభవ్ అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక లతా మంగేష్కర్, బాలా సాహెబ్ ఠాక్రే, మాధురీ దీక్షిత్

బాలీవుడ్‌పై పూర్తి పట్టు

బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రఖ్యాత ముస్లింలతో ఠాక్రేకు మంచి దోస్తీ ఉండేది. వారిలో దిలీప్ కుమార్ ఒకరు.

సినీ రంగం కోసం శివసేన విడిగా భారతీయ చిత్రపట సేన పేరుతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు టెక్నీషియన్లలో, ఇతర ఉద్యోగులలో మంచి ఆదరణ ఉంది.

అయితే సినిమాల విషయంలో శివసేన పెద్దగా జోక్యం చేసుకోలేదు. అది మరాఠీ సినిమాల విషయంలోనే అప్పుడప్పుడు కొన్ని ధర్నాలు నిర్వహించింది.

బీబీసీ మరాఠీ సర్వీస్ సంపాదకుడు ఆశీష్ దీక్షిత్ దీని గురించి మాట్లాడుతూ, "సినీ పరిశ్రమలో సమ్మెలన్నీ ఈ చిత్రపట సేన పిలుపుపైనే జరుగుతాయి. దీనికి చాలా బలం ఉంది. అయితే శివసేన మాత్రం సినిమాలను అస్త్రంగా ఎప్పుడూ ఉపయోగించుకుంది లేదు. ఆ పార్టీపై మరాఠీలో ఒక సినిమా వచ్చింది కానీ అదంతగా నడవలేదు" అని అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక బాబ్రీ మసీదు విధ్వంసం

హిందీ, మరాఠీ, ఇంగ్లిష్‌లలో రానున్న 'ఠాక్రే'

శివసేనకు ఇప్పుడు సినిమా బలమేంటో తెలిసి వచ్చిందని ఆశీష్ అభిప్రాయపడ్డారు. అందుకే వారు మొదట తమ పార్టీపై సినిమా తీశాక, ఇప్పుడు తమ పార్టీ సంస్థాపకుడైన బాల్ ఠాక్రేపై మరో సినిమా తీస్తున్నారు.

అభిజీత్ పాన్సే కూడా ఆశీష్ అభిప్రాయంతో ఏకీభవించారు. "వారు ఈ సినిమాను హిందీతో పాటు మరాఠీలో కూడా నిర్మిస్తున్నారు. దీనిని ఇంగ్లిష్‌లోకి కూడా డబ్ చేయనున్నారు. తద్వారా ప్రపంచానికంతా ఠాక్రే గురించి తెలియజెప్పాలని వారి ఉద్దేశం" అని ఆయనన్నారు.'ఠాక్రే' సినిమాతో బాలా సాహెబ్ ఇమేజిని మార్చే ప్రయత్నం ?

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)