అత్యాచారాలను నిరోధించే ప్యాంటీ తయారు చేసిన 19 ఏళ్ల యువతి!

  • మీనా కొత్వాల్
  • బీబీసీ ప్రతినిధి
సీనూ కుమారి
ఫొటో క్యాప్షన్,

సీనూ కుమారి తయారు చేసిన ప్యాంటీ ఇదే

అత్యాచారాలకు గురవకుండా మహిళలు తమను తాము రక్షించుకునేందుకు వీలుగా ఈ అమ్మాయి ఓ సరికొత్త 'రేప్ ప్రూఫ్ ప్యాంటీ'ని రూపొందించింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూకాబాద్‌కు చెందిన 19 ఏళ్ల ఈ యువతి పేరు సీనూ కుమారి.

తాను డిజైన్ చేసిన ప్యాంటీతో మహిళలు అత్యాచారాల నుంచి తప్పించుకునే వీలుంటుందని అంటున్నారు.

ఈ వినూత్న ఆవిష్కరణకు కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు.

ఈ ప్యాంటీ ప్రత్యేకత ఏంటి?

బ్లేడుతో దాడి చేసినా చిరగని ప్రత్యేక వస్త్రంతో ఈ ప్యాంటీని రూపొందించారు. నిప్పు అంటించినా ఇది అంత సులువుగా కాలిపోదట.

అంతేకాదు.. ఈ ప్యాంటీలో ఓ స్మార్ట్ లాక్, జీపీఆర్‌ఎస్, వాయిస్ రికార్డింగ్ పరికరాలు కూడా అమర్చి ఉన్నాయి.

"పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తేనే ప్యాంటీలోని స్మార్ట్ లాక్ తెరుచుకుంటుంది. దానికి ఓ బటన్ ఉంటుంది. అత్యవసర సమయాల్లో ఆ మీటను నొక్కితే చాలు.. జీపీఆర్‌ఎస్ ద్వారా వెంటనే 100 నంబర్‌కు ఫోన్ కాల్ వేళ్తుంది.

బాధితుల లొకేషన్‌‌తో పాటు, చుట్టూ వచ్చే శబ్దం కూడా పోలీసులకు వెంటనే చేరిపోతుంది. దాంతో పోలీసులు వెంటనే బాధితులను కాపాడేందుకు వీలుంటుంది" అని సీనూ కుమారి వివరించారు.

"ఇందులో కుటుంబ సభ్యుల ఫోన్‌ నంబర్లను కూడా పొందుపరచొచ్చు. తొలి కాల్ ఎవరికి వెళ్లాలో సెట్ చేయాల్సి ఉంటుంది.

అత్యవసర సమయాల్లో పోలీసులు వెంటనే స్పందించేందుకు వీలుగా ఉంటుందని 100 నంబర్‌ను సెట్ చేశాము" అని సీనూ తెలిపారు.

ఖర్చు రూ.4 వేలు

ఈ ప్యాంటీ తయారీకి దాదాపు 4 వేల రూపాయల దాకా ఖర్చయిందట. అయితే, మధ్యతరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈ యువతికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అందుకే దీన్ని తక్కువ ధర కలిగిన పరికరాలతోనే రూపొందించారు.

ప్రభుత్వం ఆర్థికంగా తోడ్పాటునందిస్తే నాణ్యమైన మెటీరియల్‌తో ప్యాంటీలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతానని ఈ యువతి అంటున్నారు.

"అత్యాచార ఘటనలకు సంబంధించిన అనేక వార్తలు నిత్యం టీవీల్లో వస్తూనే ఉన్నాయి. ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే భయమేస్తుంది. అందుకు పరిష్కారం కోసం ఆలోచించి ఈ ప్యాంటీని రూపొందించాను" అని వివరించారు సీనూ కుమారి.

ప్రస్తుతం నమూనాగా రూపొందించిన ఈ ప్యాంటీకి పేటెంట్ హక్కులు సంపాదించేందుకు ఈమె ప్రయత్నిస్తున్నారు.

ఈ యువతి ఆవిష్కరణ గురించి తెలుసుకున్న ఫరూకాబాద్ ఎంపీ ముఖేశ్ రాజ్‌పూత్, కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖకు లేఖ రాశారు.

నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే 'నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్‌'కు ఈ అమ్మాయి దరఖాస్తు చేశారు.

అయితే.. ఈ ప్యాంటీని ఎప్పుడూ ధరించేందుకు అనువుగా ఉండదని ఆమె చెబుతున్నారు. "ఒంటరిగా బయటకు వెళ్లేప్పుడు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ మాధిరిగా దీన్ని ధరించాలి. అంతేకానీ, ఇతర దుస్తుల్లా ఎప్పుడూ వేసుకునేందుకు అనువుగా ఉండదు" అని సీనూ తెలిపారు.

దేశంలో అత్యాచార కేసులు ఎన్ని?

  • జాతీయ నేర రికార్డుల బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం.. దేశంలో రోజూ 79 మంది మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు.
  • ఈ నేరాలు మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా నమోదువుతున్నాయి.
  • 2016లో దేశవ్యాప్తంగా 28,947 అత్యాచార కేసులు రిజిస్టరయ్యాయి.
  • ఒక్క మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోనే 4,882 ఘటనలు జరిగాయి.
  • ఉత్తర్ ప్రదేశ్‌లో 4,816 మంది, మహారాష్ట్రలో 4,189 మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)